Thursday, January 23, 2025

మోడీపై ఆగ్రహజ్వాలలు

- Advertisement -
- Advertisement -

మోడీ గో బ్యాక్ నినాదంతో కార్మిక సంఘాల నిరసన ఉద్యమం
ప్రధానికి రామగుండం వచ్చే అర్హత లేదు: సింగరేణి ఐకాస
వర్గీకరణ చేశాకే రావాలి : తెలంగాణ ఎంఆర్‌పిఎస్
అల్టిమేటం 10 నుంచి సింగరేణి బొగ్గు గనుల్లో ఆందోళనలు: సిపిఐ
రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు సిపిఎం పిలుపు

మన తెలంగాణ/హైదరాబాద్/ముషీరాబాద్: రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనపై పలు కార్మిక, విద్యార్థి, కుల సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న అగ్రహజ్వాలలు వెల్లువెత్తున్నాయి. ఈ నెల 12న రామగుండం ఫెర్టిలైజర్స్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్‌ఎఫ్‌సిఎల్)ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. దాదాపు రూ.6 వేల 120 కోట్ల వ్యయంతో గ్యాస్ ఆధారిత యూరియా తయారీ ప్లాంట్‌ను పునరుద్ధరించారు. ఈ కర్మాగారం ద్వారా రోజుకు సుమారు 3,850 మెట్రిక్ టన్నుల యూరియా, 2 వేల మెట్రిక్ టన్నుల అమ్మోనియా ఉత్పత్తి అవుతుందని అంచనా వేశారు. వీటిలో వార్షిక ఉత్పత్తిలో సగం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించనున్నారు. రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ఓ వైపు ఏర్పాట్లు జరుగుతుండగా, అదేస్థాయిలో వివిధ పక్షాల నుంచి ఆందోళనలు, నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధాని రామగుండం పర్యటన అగ్నిగుండం అవుతుందని… తెలంగాణ విశ్వవిద్యాలయాల విద్యార్థుల జెఎసి అల్టిమేటం ఇచ్చింది. ప్రధాని మోడీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని విద్యార్థుల జెఎసి ప్రకటించింది. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని వారు మండిపడ్డారు. పాతవాటినే మళ్లీ ప్రారంభిస్తూ.. రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నారు ఆరోపించారు. యూనివర్సిటీల కామన్ రిక్రూట్మెంట్ బిల్లును ప్రభుత్వం ఆమోదించాలని డిమాండ్ చేశారు. లేకపోతే మోడీ పర్యటన అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డుపై వివాదం చెలరేగుతోన్న విషయం విధితమే. శాసనసభలో పాస్ చేసిన బిల్లును గవర్నర్ ఆమోదించక పోవడంపై విద్యార్థుల జెఎసి కొన్ని రోజులుగా ఆందోళన చేపడుతోన్న విషయం తెలిసిందే. ఇత ర రాష్ట్రాలకు ఒక విధంగా తెలంగాణకు మరో విధంగా కేంద్రం కుట్రలు చేస్తోందని జెఎసి నాయకులు ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా నరేంద్ర మోడీ పర్యటన నేపథ్యంలో తమ కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. బిల్లుపై సమాధానం చెప్పకపోతే శనివారం చేపట్టబోయే మోడీ రామగుండం పర్యటనను అడ్డుకుంటామని హెచ్చరిస్తున్నారు.అదే విధంగా ఎస్‌సి వర్గీకరణపై ప్రధాని స్పందించాలని ఎంఆర్‌పిఎస్ డిమాండ్ చేస్తోంది. విద్యార్థి జెఎసి చేసిన వ్యాఖ్యలతో ఒక్కసారిగా తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. ఈ నేపథ్యంలో ఈ వివాదం ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.
రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన..
ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రానికి రావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 12న రాష్ట్రవ్యాప్తంగా నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల నాయకులు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తానని ఈ నెల 10వ తేదీ లోపు ప్రకటించి రాష్ట్రానికి రావాలని సూచించారు. బాగ్‌లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో టిఆర్‌ఎస్‌కెవి, సిఐటియూ, ఎఐటియూసి, హెచ్‌ఎంఎస్, ఐఎన్‌టియూసి కార్మిక సంఘాల నాయకులు సంయుక్తంగా మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టిఆర్‌ఎస్‌కెవి రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ మాట్లాడుతూ కేంద్రంలో మోడీ అధికారంలోకి వచ్చాక కార్మిక హక్కులను కాలరాసే విధంగా పాలనాపరమైన విధానాలు అవలంభిస్తున్నారని విమర్శించారు. సింగరేణి, విద్యుత్, ఎన్‌టిపిసి తదితర రంగాలను ప్రైవేటీకరించే చర్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్‌లను తీసుకురావడం అంటే దశాబ్దాల తరబడి పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను హరించడమేనని ద్వజమెత్తారు. ప్రధాని మోడీ వెంటనే కార్మిక వ్యతిరేక విధానాలను ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెల 12న ఆర్‌ఎఫ్‌సిఎల్ ను జాతికి అంకితం చేస్తానంటూ రావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 12న హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో అన్ని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నల్ల జెండాలతో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడుతున్నట్టు తెలియజేశారు. జిల్లాల నాయకులు వారి వారి స్థానిక వెసులుబాటుకు అనుగుణంగా నిరసన కార్యక్రమాలు ఉంటాయన్నారు. సిఐటియూ కార్యదర్శి భూపాల్ మాట్లాడుతూ సింగరేణిని ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. సింగరేణిలో 15 కొత్త బావులను తవ్వకానికి అనుమతి ఇవ్వాలని కోరితే కేంద్రం నిరాకరించినట్టు వివరించారు. ఎఐటియూసి రాష్ట్ర అధ్యక్షులు బాలరాజు మాట్లాడుతూ విభజన చట్టాల హామీల అమలును నిర్లక్షం చేసిన మోడీకి తెలుగు రాష్ట్రాలలో అడుగుపెట్టే హక్కు లేదన్నారు. హెచ్‌ఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెబ్బ రామారావు మాట్లాడుతూ అన్ని కార్మిక సంఘాలు ముక్త కంఠంతో ప్రధాని గో బ్యాక్ నినాదంతో కలిసికట్టుగా నిరసన వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ వికాస సమితి సైతం..
తెలంగాణ వికాస సమితి సైతం ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను వ్యతిరేకిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ వికాస సమితి ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘విభజన హామీలు నెరవేర్చకుండా, మాట్లాడిన ప్రతిసారీ.. తల్లిని చంపి బిడ్డను బ్రతికించారు.. అని తెలంగాణను అవమానిస్తున్న ప్రధాని మోదీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆర్‌ఎఫ్‌సిఎల్ ప్రారంభమై విపరీతమైన దుర్వాసనను వెదజల్లుతోంది. రామగుండం ప్రాంత భూ నిర్వాసుతులకు ఇప్పటికి న్యాయం చెయ్యకుండా.. పరిశ్రమను ప్రైవేటుకు ఇచ్చి చేతులు దులుపుకున్న మోడీ రామగుండం పర్యటన పారిశ్రామిక ప్రాంత ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారు. బొగ్గు బ్లాకులను ప్రైవేట్‌కు కట్టబెట్టి సింగరేణిని చంపాలని చూస్తూన్న ప్రధాని పర్యటనను ఈ ప్రాంతవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తారు.. మోడీ అనుసరిస్తున్న తెలంగాణ వ్యతిరేక ధోరణిని.. తెలంగాణ వికాస సమితి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కృష్ణా జలాల పంపిణీని ఇప్పటికీ తేల్చకుండా తెలంగాణ అభివృద్దిని అడ్డుకుంటున్న మోడీ.. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వని మోడీ.. మా రైతుల వడ్లు కొనమంటే నూకలు తినండి అని అవమానించిన మోడీ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ వారు మండిపడ్డారు.
మోడీ పర్యటనను అడ్డుకుంటాం : సిపిఐ
మోడీ తెలంగాణ పర్యటనను అడ్డుకుంటామని సిపిఐ ప్రకటించింది. విద్యార్థుల జీవితాలతో అడుకుంటున్న గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేసింది. మోడీ పర్యటన దృష్ట్యా టిఆర్‌ఎస్, వామపక్షాలు ఉమ్మడి ఉద్యమ కార్యచరణను సిద్దం చేసుకుంటున్నాయి. వామపక్ష కార్మిక సంఘాలతో టిఆర్‌ఎస్ కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ప్రధాని మోడీకి తెలంగాణపై అనుకోని ప్రేమ పుట్టుకొచ్చిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఎద్దేవా చేశారు. దురుద్దేశంతోనే మోడీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారని విమర్శించారు. గతేడాది ప్రారంభమైన ఫ్యాకర్టీని ఇప్పుడు ప్రారంభించడం ఏమిటని ప్రశ్నించారు.
12న రాజ్ భవన్‌ను ముట్టడి : సిపిఎం
కేంద్ర ప్రభుత్వం గవర్నర్లను ఏజెంట్లుగా మార్చుకుని రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చివేయడాన్ని నిరసిస్తూ ఈ నెల 12న ప్రధాని పర్యటన సందర్భంగా రాజ్ భవన్‌ను ముట్టడించనున్నట్లు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. టిఆర్‌ఎస్, సిపిఐలతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహించడంతో పాటు, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. పోడుభూముల ఆక్రమణలో ఉన్న ప్రతి సాగుదారుకు పట్టాలివ్వాలని డిమాండ్ చేశారు.

CPI to plan Protest against PM Modi to visit Telangana

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News