న్యూఢిల్లీ: రాఫెల్ యుద్ధ విమానాల ఒప్పందానికి సంబంధించి వాటి తయారీ సంస్థ డసాల్ట్ ఏవియేషన్ భారత్‌లోని ఒక మధ్యవర్తికి 11 లక్షల యూరోలు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించిన నేపథ్యంలో ఈ ఒప్పందంపై విచారణ జరిపించాలని సిపిఎం డిమాండు చేసింది. 36 యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో ఒక మధ్యవర్తికి డసాల్ట్ ఏవియేషన్ సంస్థ 11 లక్షల యూరోలు ముడుపులు చెల్లించినట్లు ఫ్రెంచ్ మీడియా వెల్లడించడంతో రాఫెల్ ఒప్పందంలో ముడుపులు, అవినీతి జరిగాయన్న ఆరోపణలు మళ్లీ తెరమీదకు వచ్చాయని సిపిఎం పోలిట్‌బ్యూరో మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
డసాల్ట్ కంపెనీకి చెందిన 2017 ఆడిట్ రిపోర్టుల విశ్లేషణ ఆధారంగా ఫెంచ్ మీడియా ఈ విషయాన్ని వెల్లడి చేసిందని సిపిఎం పేర్కొంది. రాఫెల్ ఒప్పందంపై విచారణ జరిపించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్దంద్వంగా నిరాకరించం వెనుక ఈ వ్యవహారంలో వాస్తవాలను తొక్కిపెట్టే ఉద్దేశం కనపడుతోందని సిపిఎం ఆరోపించింది. రాఫెల్ ఒప్పందానికి సంబంధించి పాత ఉత్తర్వులను రద్దు చేసి 36 యుద్ధ విమానాల కొనుగోలు కోసం తాజా ఉత్తర్వులు జారీచేయడంపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలని సిపిఎం డిమాండు చేసింది.