న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ ఆర్డినెన్సుకు వ్యతిరేకంగా ఆప్‌కు మద్దతు ఇస్తామని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మంగళవారం వెల్లడించారు. ఈమేరకు పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టినప్పుడు వ్యతిరేకంగా తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందన్నారు. ఈ అంశంపై ఆప్‌కు పూర్తి మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీని, ఇతర పార్టీలను ఆయన కోరారు. కేజ్రీవాల్‌తో సమావేశమైన తరువాత ఆయన సంయుక్తంగా పాత్రికేయ సమావేశంలో మాట్లాడారు.
ఢిల్లీలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌లపై నియంత్రణకు ఆర్డినెన్స్ ప్రకటించడం రాజ్యాంగాన్ని కేంద్ర ప్రభుత్వ “ఆకస్మిక ఉల్లంఘించడం” గా ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీయేతర పార్టీ ప్రభుత్వం ఉన్న చోట ఇలాంటివి జరుగుతుంటాయని విమర్శించారు. కేంద్రం ఆర్డినెన్సు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని, కోర్టు ఆదేశాలను ధిక్కరించడమేనని ధ్వజమెత్తారు. పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ ముందుకు వచ్చి మన రాజ్యాంగాన్ని రక్షించవలసి ఉందని అభ్యర్థించారు.