సుమారు రూ. 3లక్షలను అందించిన రాష్ట్ర అధ్యక్షుడు
మనతెలంగాణ/హైదరాబాద్ : జగిత్యాల జిల్లా వెలగటురు మండలం కోదండాపూర్‌లో ఎస్జీటీగా పనిచేస్తూ కోవిడ్‌తో ఇటీవల మృతిచెందిన సిపిఎస్ ఉపాధ్యాయుడు ధోనిపల్లి రాజేశం కుటుంబాన్ని ఆదుకోవడానికి సిపిఎస్ యూనియన్ నేతలు ముందుకొచ్చారు. రాష్ట్ర సిపిఎస్ యూనియన్ ఉద్యోగ ఉపాధ్యాయులు కలిసి (మూడు లక్షల పదకొండు వందల రూపాయల) 3,01,100 పోస్ట్ ఆఫీస్ డిపాజిట్ బాండ్ల రూపంలో మృతుడి పిల్లలైన మహతి, మహాలక్ష్మిలకు సిపిఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్‌లు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు స్థితప్రజ్ఞ మాట్లాడుతూ చనిపోయిన సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వారి కుటుంబాలకు అందే ఫ్యామిలీ పెన్షన్ జి.ఓ 58ను ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసిందని, కానీ ఆర్థిక శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఆగిపోయిందని, వెంటనే దీనిపై ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మ్యాన పవన్, కూరకుల శ్రీను, రాష్ట్ర నాయకులు మల్లికార్జున్, జగిత్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్, ప్రధాన కార్యదర్శి సతీష్, మహేష్, శ్రీనివాస్, ఎంఈఓ తదితరులు పాల్గొన్నారు.