చెన్నై: తమిళనాడు రాణిపేట జిల్లాలోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో ఆదివారం ఘోర విషాదం సంభవించింది. రాత్రి 8.15 గంటల సమయంలో భక్తులపై క్రేన్ కూలడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో తొమ్మిది మందికి గాయాలయ్యాయి. ఆలయం చుట్టూ భక్తులు క్రేన్‌ను తిప్పుతూ భక్తుల నుంచి దండలు తీసుకుంటుండగా ఈ ప్రమాదం జరిగింది. క్రేన్ కూలిన చోట అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, గాయపడిన వారిలో ఒకరు సోమవారం ఉదయం ఆస్పత్రిలో మరణించారు.
మృతులు ఎస్. భూపాలన్ (40), బి. జ్యోతిబాబు (17), కె. ముత్తుకుమార్ (39), చిన్నస్వామి (60)గా గుర్తించారు. పంటకోతల పండగ ( పొంగల్) అయిన తరువాత అరక్కోణం లోని కెజవీధి, నెమెల్లి, ఆలయాల్లో ఉత్సవాలు జరగడం పరిపాటిగా వస్తోంది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో క్రేన్ కూలిన తరువాత జనం అటుఇటూ పరుగులు తీయడం కనిపించింది. షాక్ నుంచి తేరుకుని కొందరు గాయపడిన వారికి సహాయం అందించారు. నెమెల్లి పోలీసులు క్రేన్ ఆపరేటర్‌ను అదుపు లోకి తీసుకున్నారు.