క్రేన్ డ్రైవర్ చాకచక్యంతో తప్పిన మరింత ప్రాణనష్టం
న్యూఢిల్లీ : ఢిల్లీ లోని ముంద్కా మెట్రోస్టేషన్ సమీపం లోని ఓ మూడంతస్తుల భవనంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించి 27 మంది సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాద సమయంలో ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు చేరుకోకముందే ఆపద్బాంధవుడిలా క్రేన్ డ్రైవర్ వచ్చి దాదాపు 55 మందిని కాపాడగలిగారు. నిమిషాల వ్యవధిలో భవనం మొత్తం మంటలు వ్యాపించే సరికే ఆయన వీరిని రక్షించ గలిగారు. అయితే మంటలు మరింత తీవ్రమయ్యేసరికి మిగతా వారిని కాపాడలేక పోయానని ఆయన బాధపడ్డారు. సోషల్ మీడియాలో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ప్రమాద సమయంలో ముంద్కా ఉద్యోగ్ నగర్ నుంచి క్రేన్‌తో అటుగా వెళ్తోన్న దయానంద్ తివారీ ఓ సహాయకుడి సహాయంతో వెంటనే భవనం వద్దకు చేరుకొన్ని అక్కడ ఉన్నవారిని రక్షించడం మొదలు పెట్టారు.
ఈ ప్రమాద సమాచారం తెలుసుకుని అగ్నిమాపక యంత్రాలు అక్కడికి చేరుకునే లోపే ఆయన స్థానికుల సహాయంతో దాదాపు 50 మంది ప్రాణాలు కాపాడ గలిగారు. అగ్నిమాపక యంత్రాలు గంటన్నర ఆలస్యంగా అక్కడకు చేరుకున్నాయని ఆయన వాపోయారు. పోలీసులు, రెండు ఫోరెన్సిక్ బృందాలు కాలిపోయిన మృతుల అవశేషాలకు డిఎన్‌ఎ పరీక్ష నిర్వహించి వాటి ఆధారంగా బాధితులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి భవన యజమానిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు రోజులుగా పరారీలో ఉన్న యజమాని మనీశ్ లక్రాను ఢిల్లీ, హర్యానాలో సోదాలు నిర్వమించి అరెస్టు చేశారు.