Sunday, December 22, 2024

సృజనాత్మక చదువువైపు

- Advertisement -
- Advertisement -

ఆలోచన, అవగాహన, ఆచరణ ఈ మూడింటికీ అవినాభావ సంబంధం ఉంది. చిన్నారుల్లో ఏదైనా ఆలోచన మొలకెత్తితే, అది ఆచరణ రూపం దాల్చాలంటే వాళ్ల స్థాయిలో బోధన జరుగాలి. సాధారణంగా బొమ్మల రూపంలో చెబితే సులువుగా వారి బుర్రకెక్కుతుంది. బోధించే వివిధ పాఠ్యాంశాల నుంచి పిల్లలు ఏం నేర్చుకుంటున్నారని గమనించాలి. వాళ్ల సామర్థ్యం ఏపాటిది అనే విషయాన్ని బోధకులు అంచనా వేయాలి. ఇందుకు భిన్నంగా విద్యా బోధన జరుగుతుండటంతో చాలా మంది పిల్లలు తమ మాతృభాషలో ఉన్న వచనాన్ని చదవలేకపోతున్నారు. వాస్తవానికి మాతృభాషలో ఉన్న వాక్యాలను చదువగలిగే సామర్థ్యం వారికి ఎనిమిదేళ్లు నిండేసరికి రావాలి. 57 శాతం బాలబాలికలు ప్రాథమిక అంకగణితంలో లెక్క కూడా పరిష్కరించలేకపోతున్నారు. ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటున్న వారు కూడా సరళమైన ఇంగ్లీషు వాక్యాలను సులువుగా పలుకలేకపోతున్నారు. ఇది పిల్లల సామర్థ్యలోపమా? ఉపాధ్యాయుల బోధన లోపామా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఎనిమిదవ దశాబ్దంలో ఉన్నా విద్యా పరిస్థితి ఇది. విద్యాహక్కును ప్రకటించుకున్నాక కూడా నాసిరకం విద్యా బోధన తరం తర్వాత తరం పాఠశాలల ప్రాంగణాల్లో గూడుకట్టుకున్నాయి.

ప్రజ్ఞాపాటవాలను పెంచి, వివేకవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో, బోధన అభ్యసన ఫలితాలను బలోపేతం చేసే దిశగా ‘స్ట్రెంతెనింగ్ టీచింగ్ లెర్నింగ్ అండ్ రిజల్ట్స్ ఫర్ స్టేట్స్‌స్టార్స్’ అనే ప్రాజెక్టును జాతీయ విద్యా విధానంలో భాగంగా రూపుదిద్దుకుంది. భారతీయ మూలాలను గుర్తెరిగి, ప్రపంచీకరణను అనుసంధానం చేస్తూ మానవ విలువలు, వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ పౌరుడి లక్షణాలు అలవర్చేలా ప్రాథమిక విద్యకు రూపకల్పన చేసింది కేంద్ర ప్రభుత్వం. విద్యార్థులపై మార్కుల వొత్తిడిలేని విద్యాబోధన చేయడం దీని ప్రధాన ఉద్దేశం. మానసిక వొత్తిడితగ్గించి ఆనందకర బోధన పద్ధతులపై ఉపాధ్యాయులు దృష్టి పెట్టాలి. తరగతికి బందీ అయి సృజనాత్మక, విమర్శనాత్మక అభ్యాసనాన్ని కోల్పోకుండా చూడాలి. శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించేలా ఆటలు, వ్యాయామంపై దృష్టి సారించాలి. సృజనాత్మకత, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, అభ్యసనను పరిశ్రమలకు అనుసంధానం చేయడం, వృత్తి విద్య విస్తరించడం దిశగా బోధన సాగాలని దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి పదిహేను లక్షలకు పైగా సూచనలు అందాయి. వీటికి అనుగుణంగా గుణాత్మక విద్య లక్ష్యంగా విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దడానికి పలురాష్ట్రాలు ప్రయత్నాలు ప్రారంభించాయి. బ్రిటన్, అమెరికా, నెదర్లాండ్స్, స్వీడన్, డెన్మార్క్ తదితర దేశాలు అత్యాధునిక సాంకేతిక పద్ధతులను అందిపుచ్చుకొని పాఠశాలల్లో మేలిమి విద్యను అందిస్తున్న తీరులో విద్యకు పాదు వేసుకుంటున్నారు. అయితే, దేశీయంగా చాలా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక కునారిల్లుతున్నాయి. పిల్లలకుండవలసిన ఆహ్లాదకర వాతావరణ చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. అమ్మ వొడిని వీడి బడిలోకి అడుగిడటానికి పిల్లలు చేసే మారాం అంతా ఇంతా కాదు.

బడిలోకి వేసిన ప్రతి అడుగు జ్ఞానసముపార్జన కోసమని తెలియక, కమ్మనైన అమ్మ వొడిని కాదని కొత్త లోకంలోకి అయిష్టంగానే అడుగుపెడతారు. ఇంట్లో ఉండే ఆటబొమ్మలు ఇక్కడ కనిపిస్తున్నా తన సహజ స్వేచ్ఛ కోల్పోయానని లోలోన మథనపడుతుంటారు. సాటి పిల్లలను తేరిపార చూస్తూ దిగులు దిగులుగా సమయాన్ని కరిగిస్తుంటారు. బడిఅలవాటు అయ్యేవరకూ, తోటి పిల్లలతో మచ్చిక జరిగేవరకూ ‘బడికి వెళ్లనని’ మారాం చేస్తూఉంటారు. అక్కడి వాతావరణం నచ్చే వరకూ పిల్లలకు అదో బందీఖానాలాగే ఉంటుం ది. పెరిగి పెద్దవుతూ ప్రాథమిక విద్యలోకి అడుగిడగానే పిల్లలకు మరో లోకం కానవస్తుంది. వీపు మీద పుస్తకాల బరువు పెరగడం, పుస్తకాల్లోని విజ్ఞానం బుర్రలోకి ఎక్కించడానికి వారు పడే తంటాలు అలవికానివి. అయితే ఏ దశలో ఎంత జ్ఞానాన్ని విద్యార్థులకు అందజేయాలన్న అంశం, అందుకుగల మార్గాలను నిర్దేశించడానికి పార్లమెంట్‌లో అనేకమార్లు చర్చ జరిగింది. పిల్లల లేత మనస్సు నొప్పించకుండా విజ్ఞానాన్ని వారి బుర్రలోకి ఎలా నిక్షిప్తం చేయాలన్న విషయంపై ప్రభుత్వం పలు కమిటీల ద్వారా నివేదికలు తెప్పించుకున్నప్పటికీ ఆచరణలో పెట్టలేకపోయింది. ‘భారం లేకుండా విద్యార్థులు నేర్చుకోవడం’ పద్ధతి అమలు కాలేదు. 2010లో కేంద్రీయ విద్యాలయ సంఘటన్ దేశంలో 891 పాఠశాలల్లో సంచుల బరువు లేకుండా అమలు జరిపింది. అయినప్పటికీ ఆచరణ సాధ్యం కాలేదు. జీవితానికి అక్కరకు రాని చదువులు ఇప్పుడు సమాజానికి పెద్ద తలనొప్పిగా మారింది.

పాఠాలను బట్టీ పెట్టడం, తిరిగి వాటిని అప్పజెప్పడం, పరీక్షల్లో అవే పాఠాలు వారిచేత రాయించే రొడ్డకొట్టుడు విధానాలు అమలు జరుగుతుండటం విద్యార్థుల్లో కొత్త వెలుగును అందించలేకపోతోంది. దీంతో సొంతంగా ఆలోచించే బుద్ధిజీవుల సంఖ్య తగ్గిపోతోంది. వొత్తిడి లేకుండా పరీక్షలకు హాజరు కావడమనేది విద్యార్థుల ముందు పెద్ద ప్రశ్నగా తలెత్తింది. పాఠాలను సంపూర్ణంగా అవగాహన చేసుకోవడం, పరీక్షల్లో మంచి మార్కులు పొందడం. ఈ రెండూ వేర్వేరు అంశాలు. పరీక్షల్లో అత్యధిక మార్కులు సంపాదించడమే లక్ష్యంగా పిల్లలపై వొత్తిడి తెస్తే వారి మానసిక వికాసం దెబ్బతింటుంది. అవగాహన కొరవడుతుంది. ఇదే మన సమాజంలో జరుగుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల దృష్టంతా మార్కుల చుట్టే తిరుగుతోంది. సహజ సిద్ధమైన పద్ధతిలో, తమకు అనుకూలమైన వాతావరణంలో పాఠ్యాంశాలను అవగాహన ఏర్పడటం ఒక ఎత్తయితే, అభిరుచులకు అనుగుణమైన అంశాలను ఎంపిక చేసుకోవడం మరో ఎత్తు. వీటిని సమన్వయపరిచి సర్వతోముఖాభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానాన్ని అమలుపరచడం ఉపాధ్యాకుల సామాజిక బాధ్యతగా గుర్తించాలి. నిత్య జీవన పథంలో అవసరపడే విజ్ఞానం, వినోదం, నైపుణ్యాలను సమకూర్చకోవడంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలి. తరగతి గదుల్లో హాజరు నిక్కచ్చి కొలబద్ధలుగా కాకుండా, వారిలో కొత్త ఆలోచనలు మొలిచేలా పాఠాల బోధన ఉండాలి.

కోడం పవన్‌కుమార్
9848992825

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News