న్యూఢిల్లీ : క్రెడిట్, డెబిట్ కార్డ్ లేదా కార్డ్ పేమెంట్ ద్వారా చేసే షాపింగ్ రూల్ కొత్త సంవత్సరంలో మారనుంది. 2022 జనవరి 1 నుండి ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే గనుక ప్రతిసారీ కార్డ్ పూర్తి వివరాలను నమోదు చేయాలి లేదా మీరు టోకనైజేషన్‌ని ఎంచుకోవాలి. ఈ విషయంపై చాలా బ్యాంకులు ఇప్పటికే ఖాతాదారులకు సమాచారం ఇవ్వడం ప్రారంభించాయి. ఇప్పటి వరకు ఆన్‌లైన్ షాపింగ్ చేసేటపుడు ఒకసారి మాత్రమే కార్డు సమాచారాన్ని నమోదు చేయాలి. ఆ తర్వాత సివివి నంబర్ మాత్రమే నమోదు చేస్తే సరిపోయేది.
ఆ తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఒటిపి వస్తుంది. కానీ 2022 జనవరి 1 నుండి ప్రతిసారీ బ్యాంక్ కార్డు పూర్తి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఎన్నిసార్లు కొనుగోలు చేసినా కార్డు పూర్తి వివరాలను ఇవ్వాల్సి ఉంటుంది. దాని టోకనైజేషన్ కోసం ఒక ఎంపిక కూడా ఉంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) మార్గదర్శకాలను విడుదల చేసింది. మార్చి 2020లో ఆర్‌బిఐ మర్చంట్ సైట్‌లు కార్డ్ డేటాను నిలుపుకోలేవని తెలిపాయి. దీంతో 2021 సెప్టెంబర్‌లో ఈ సమస్యపై ఆర్‌బిఐ మళ్లీ మార్గదర్శకాలను జారీ చేసింది. దీనిలో వినియోగదారులకు టోకనైజ్ చేసుకునే అవకాశం కల్పించాలని పేర్కొంది. ఇప్పుడు అదే నియమం 2021 జనవరి 1 నుండి అమలవుతోంది.
టోకనైజేషన్ అంటే?
కార్డు ద్వారా లావాదేవీ చేసినప్పుడు 16 అంకెల సంఖ్య, కార్డ్ గడువు తేదీ, సివివి, ఒటిపి నమోదు చేయాలి. ఈ సమాచారం ఏదైనా సరిగ్గా లేకుంటే మీ లావాదేవీ పూర్తి కాదు. టోకనైజేషన్ అంటే కార్డ్ సంబంధిత సమాచారాన్ని నమోదు చేయడం, అంటే టోకెన్ అనే కోడ్ కేటాయిస్తారు. ఈ టోకెన్ ప్రతి కార్డుకు ప్రత్యేకంగా ఉంటుంది.