మన తెలంగాణ, హైదరాబాద్ : ఉమ్మడి రాష్ట్రంలో సంక్షోభ హాస్టళ్లను నేడు సంక్షేమ హాస్టళ్లుగా మార్చిన ఘనత సిఎం కెసిఆర్‌కు దక్కుతుందని బీసీ కమిషన్ సభ్యులు కిశోర్‌గౌడ్ పేర్కొన్నారు. బుధవారం అంబర్‌పేట బిసి హాస్టల్ పూర్వ విద్యార్ధుల, హాస్టల్ కమిటీ ఆధ్వర్యంలో బీసి కమిషన్ సభ్యులుగా నియమితులైన సందర్భంగా ఏర్పాటు చేసిన ఆత్మీయ సన్మానసభలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులు పురుగుల అన్నం, కప్పులతో కొలిచిపెట్టే అన్నం, చాలీచాలని స్కాలర్‌షిప్, సరైన వసతులు లేక ఆకలికేకలతో అలమటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడాక సీఎం కెసిఆర్ మన విద్యార్థులను కన్నబిడ్డలుగా భావించి, గొప్ప మనస్సుతో వారికి సన్నబియ్యంతో సంతృప్తికరమైన భోజనం పెడుతున్నారని పేర్కొన్నారు.
రాష్ట్రంలో దాదాపు వెయ్యి గురుకుల పాఠశాలలు పెట్టి, కార్పొరేట్ విద్యాసంస్దలకు దీటుగా ఎస్సీ, ఎస్టీ, బీసి, మైనార్టీ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందజేస్తున్నారని, ఒక్కో విద్యార్థిపై రూ. 1.25లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు. మారుమూల ప్రాంతంలో పుట్టిన నేను అంబర్‌పేట బిసి హస్టల్ లేకుంటే నాయకుడిని అయ్యేవాడిని కాదని, సమాజం కోసం పనిచేసే అవకాశం ఇక్కడ నుంచే లభించిందని కిశోర్‌గౌడ్ గర్వంగా తెలిపారు. ఈకార్యక్రమంలో తెలంగాణ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్, రామ్‌కోటి, జూకంటి ప్రవీణ్, బడేసాబ్, అనంతులు రామ్మూర్తిగౌడ్, ఈడిగ శ్రీనివాస్, బీసి సంక్షేమ అధికారులు ఆశన్న, నర్సింహులు, మురళి, వార్డెన్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు.