హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా షూటింగ్ కూడా లాంఛనంగా ప్రారంభమైంది. ‘మెగా 157’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా రూపొందుతోంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఓ అప్‌డేట్‌ని విడుదల చేసింది. చిత్ర యూనిట్. ఓ విభిన్నమైన రీతిలో ఈ సినిమాకి పని చేసే వారి వివరాలను వెల్లడిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. ‘ది గ్యాంగ్ ఆఫ్ మెగా 157’ అంటూ సాగే ఈ వీడియోలో చిత్రానికి పని చేసే వారు.. చిరంజీవి సినిమా పేర్లతో ఒక్కొక్కరు తాము చేసే పనిని వివరించారు.
చివర్లో సంగీత దర్శకుడు భీమ్స్, నిర్మాతలు సాహు గారపాటి, సుష్మిత కొణిదెల, దర్శకుడు-రచయిత అనిల్ రావిపూడి కూడా చిరు టైటిల్స్‌తో తమని తాము పరిచయం చేసుకున్నారు. ‘ఈ సంక్రాంతికి రఫ్పాడిస్తున్నాం’ అంటూ 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించారు. ఈ వీడియో చిరు అభిమానులను విపరీతంగా అకట్టుకుంటుంది. అనిల్ దర్శకత్వంలో చిరు చేసే కామెడీని ఎప్పుడెప్పుడు చూస్తామా.. అని వాళ్లు ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరంజీవి తన అసలు పేరైన.. ‘శంకర్ వరప్రసాద్’ అనే పాత్రలో కనిపించనున్నారు.