నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
రూ.2,03,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం
మనతెలంగాణ, హైదరాబాద్ : ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు శనివారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,03,000 నగదు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం… నగరంలోని అఫ్జల్‌గంజ్‌కు చెందిన మాయా చంద్రకాంత్ వ్యాపారం చేస్తున్నాడు. ఉప్పల శషాంక్, రజనీష్ కుమార్, పవన్ అగర్వాల్ కలిసి బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. మాయా చంద్రకాంత్ ఆన్‌లైన్‌లో గత కొంత కాలం నుంచి బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. Tripal.com, subh999.com, radheexchange.com, skyexchange.comల ద్వారా పెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సులభంగా డబ్బులు సంపాదించేందుకు ప్లాన్ వేసిన చంద్రకాంత్ మహారాష్ట్రకు చెందిన ప్రధాన బెట్టింగ్ నిర్వాహకుడు మహదేవ్ అలియాస్ మహదేవ్‌బుక్ తరఫున ఇక్కడ పనిచేస్తున్నాడు.
ఈ వెబ్‌సైట్ల ద్వారా లైవ్ క్రికెట్ మ్యాచ్‌లు, ఆన్‌లైన్ గేమ్‌లు, స్పోర్ట్, టీన్‌పట్టీ, క్యాసినో గేమ్స్, ఫుట్‌బాల్, టెన్నీస్, బాస్కెట్‌బాల్ తదితర గేమ్స్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. తనకు సాయంగా శషాంక్, రజనీష్ కుమార్, పవన్ అగర్వాల్‌ను నియమించుకున్నాడు. బెట్టింగ్‌లో పాల్గొనే వారి నుంచి డబ్బులు ఆన్‌లైన్ పేమెంట్ తీసుకునేవాడు. వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్ ఇచ్చేవాడు. బెట్టింగ్‌లో డబ్బులు గెలుచుకున్న వారికి పంటర్ల సాయంతో డబ్బులు చెల్లిస్తున్నాడు. దీనికి గాను తాను 3 నుంచి 5శాతం కమీషన్ తీసుకుంటున్నాడు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం అఫ్జల్‌గంజ్ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ నాగేశ్వరరావు, ఎస్సైలు పరమేశ్వర్, శ్రీకాంత్, అశోక్ రెడ్డి, శివానందం తదితరులు పట్టుకున్నారు.