హైదరాబాద్ : ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.2,80,000 నగదు, టివి సెట్‌టాప్ బాక్స్, క్యాలిక్యులేటర్, నోట్‌బుక్, ఏడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం….నగరంలోని జియాగూడకు చెందిన సందీప్ పంచల్ నిరుద్యోగి, ఎస్‌కే ఉదయ్ శంకర్ టైలరింగ్ వర్క్ చేస్తున్నాడు, విష్ణు గౌరవ్ సింగ్ ఫ్యాషన్ కన్స్‌ల్‌టెంట్, నిఖిల్ శర్మ స్టీల్ వ్యాపారం చేస్తున్నాడు. నలుగురు కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సందీప్ నిరుద్యోగి కావడంతో ఖర్చులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. సులభంగా డబ్బులు సంపాదించేందుకు బెట్టింగ్ నిర్వహించాలని ప్లాన్ వేశాడు.
ఇదే విషయం మిగతా స్నేహితులకు చెప్పాడు. నగరంలోని పలువురుని పంటర్లుగా నియమించుకుని 20 నుంచి 25మందితో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. పంటర్ల నుంచి వచ్చే కాల్స్‌ను ఉదయ్, విష్ణు గౌరవ్ రిసీవ్ చేసుకునేవారు. వీరికి నెలకు రూ.10,000 వేతనం ఇచ్చేవారు. ఈ నెల 18వ తేదీన జరిగిన రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహించారు. ఈ విషయం పోలీసులకు తెలియడంతో దాడి చేసి అరెస్టు చేశారు. కేసు దర్యాప్తు కోసం నిందితులను కుల్సుంపుర పోలీసులకు అప్పగించారు. సందీప్‌ను గతంలో కుల్సుంపుర, మంగళ్‌హాట్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్స్‌స్పెక్టర్ శ్రీనాథ్ రెడ్డి, ఎస్సైలు షేక్ కవియుద్దిన్, మల్లికార్జున్, ఎండి ముజఫర్‌అలీ, రంజిత్ కుమార్ తదితరులు పట్టుకున్నారు.