క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.25,55,000 నగదు, ల్యాప్‌టాప్, మూడు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్, శ్రీనగర్ కాలనీకి చెందిన మహ్మద్ అబ్దుల్ సోహైల్ వ్యాపారం చేస్తున్నాడు, ఎండి ఫర్హతుల్లా కలిసి క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. సోహైల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే అలవాటు ఉంది. దీంతో క్రికెట్ మ్యాచ్‌లు జరిగిన ప్రతిసారి తన పంటర్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. యాప్‌నే ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్న నిందితుడు ఆసక్తి ఉన్న వారికి యూజర్ ఐడి, పాస్‌వర్డ్‌ను ఇస్తున్నాడు.
నిందితుడి వద్ద 20 నుంచి 25మంది పంటర్లు పనిచేస్తున్నారు. బెట్టింగ్ కట్టే వారి వద్ద నుంచి గూగుల్ పే, ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే నిందితుడు టి 20 ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ శనివారం రాత్రి జరుగుతుండడంతో దానికి బెట్టింగ్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. పలువురు పంటర్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలియడంతో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. టాస్క్‌ఫోర్స్ డిసిపి వైవిఎస్ సుదీంద్ర ఆధ్వర్యంలో ఇన్స్‌స్పెక్టర్ రామకృష్ణ, ఇన్స్‌స్పెక్టర్ నవీన్‌కుమార్, ఎస్సై శ్రీకాంత్ గౌడ్ తదితరులు పట్టుకున్నారు.