ఇద్దరి అరెస్టు, పరారీలో ప్రధాన నిందితుడు
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు నిందితులను సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి రూ.77,000 నగదు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం…నగరంలోని నాంపల్లికి చెందిన మోహిత్ అగర్వాల్ వ్యాపారం చేస్తున్నాడు, పంటర్‌గా వ్యవహరిస్తున్నాడు. రామ్‌కోఠికి చెందిన మహేందర్ కుమార్ సోని ఆటోమోబైల్ వ్యాపారం చేస్తూ క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాడు. మోహిత్ అగర్వాల్ సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఆన్‌లైన్‌లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు.
గతంలో రెస్టారెంట్ వ్యాపారం చేయడంతో మోహిత్‌కు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయి. వాటి నుంచి అధిగమించేందుకు 24క్యారేట్ అండ్ పార్కర్ ఎక్చేంచ్ యాప్‌లో ఆన్‌లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. మహేందర్ కుమార్ సోనితో కలిసి వాట్సాప్‌లో బెట్టింగ్‌పై ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బులు తీసుకుంటున్నారు. మహేందర్ కుమార్ యాప్‌ను ధూల్‌పేటకు చెందిన సురేష్ వద్ద నుంచి తీసుకున్నట్లు తెలిపాడు, బూకీ సురేష్ పరారీలో ఉన్నాడు. నిందితులు కేసు దర్యాప్తు కోసం నారాయణగూడ పోలీసులకు అప్పగించారు. ఇన్స్‌స్పెక్టర్ రాఘునాథ్, ఎస్సైలు నవీన్‌కుమార్ తదితరులు పట్టుకున్నారు.