ఐదుగురు నిందితుల అరెస్టు
రూ.16లక్షల విలువైన సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడించిన రాచకొండ సిపి మహేష్ భగవత్
హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.14,92,500 నగదు, ల్యాప్‌టాప్, ఎనిమిది మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.16లక్షలు ఉంటుంది. నేరెడ్‌మెట్‌లోని రాచకొండ పోలీస్ కమిషనరేట్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. నగరంలోని కొత్తపేట, మోహన్‌నగర్‌కు చెందిన బైరామల్ శ్రీధర్ బుక్‌స్టాల్ నిర్వహిస్తున్నాడు. క్రికెట్ బెట్టింగ్ ఆర్గనైజర్‌గా వ్యవహరిస్తున్నాడు. ఉప్పల్, గాంధీ నగర్‌కు చెందిన సంబరం రామాంజనేయులు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన జాజుల రాముగౌడ్ కల్లుదుణం ఉంది. బోయిన్పల్లి చత్రపతి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు.
గౌని కళ్యాణ్ రియల్ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. శ్రీధర్ తన వద్ద పనిచేస్తున్న రామాంజనేయులు సాయంతో ఆన్లైన్, ఆఫ్ లైన్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. రాముగౌడ్, కళ్యాణ్ పంటర్లుగా పనిచేస్తున్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి cricketline gur, cricket exchange యాప్‌లను డౌన్లోడ్ చేసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. ఆసక్తి ఉన్న వారి నుంచి డబ్బులు తీసుకుని బాల్ టు బాల్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఇండియా, పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌లో బెట్టింగ్ నిర్వహించారు. ఆర్గనైజర్ శ్రీధర్ తనకు తెలిసిన వారి పేర్లను నోట్‌బుక్‌లో రాసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. వంద రూపాయల నుంచి వేల రూపాయల వరకు బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. ఈ విషయం తెలియడంతో ఎల్బి నగర్ ఎస్ఓటి పోలీసులు, చైతన్యపురి పోలీసులు కలిసి దాడి చేసి నిందితులను అరెస్టు చేశారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ పర్యవేక్షణలో ఇన్స్‌స్పెక్టర్స్ రవికుమార్, వి. రవికుమార్, ఎస్సైలు అవినాష్ బాబు తదితరులు పట్టుకున్నారు.