Friday, November 15, 2024

అందరి దృష్టి విరాట్‌పైనే!

- Advertisement -
- Advertisement -

ఆత్మవిశ్వాసంతో భారత్, లంకకు పరీక్ష, నేటి నుంచి తొలి టెస్టు

Cricket fans concentrate on Virat kohli

మొహాలీ: ఇటీవల కాలంలో వరుస విజయాలతో జోరుమీదున్న టీమిండియా సొంత గడ్డపై శ్రీలంకతో జరిగే రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు సమరోత్సాహంతో సిద్ధమైంది. మొహాలీ వేదికగా శుక్రవారం నుంచి లంకతో తొలి టెస్టు జరుగనుంది. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి ఈ మ్యాచ్‌కు ప్రత్యేక ఆకర్షణగా మారాడు. విరాట్ కోహ్లి కెరీర్‌లో ఇది వందో టెస్టు మ్యాచ్ కావడమే దీనికి కారణం. ఈ మ్యాచ్‌లో గెలిచి విరాట్‌కు అరుదైన బహుమతిని అందించాలనే పట్టుదలతో టీమిండియా క్రికెటర్లు ఉన్నారు. ఇక రోహిత్ శర్మ కెప్టెన్‌గా టీమిండియా ఆడుతున్న తొలి సిరీస్ ఇదే కావడంతో అందరి దృష్టి దీనిపై నిలిచింది. ఇప్పటికే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో అద్భుత కెప్టెన్సీతో భారత్‌కు వరుస సిరీస్‌లు అందించిన రోహిత్ శర్మ టెస్టుల్లోనూ అదే సంప్రదాయాన్ని కొనసాగించాలనే పట్టుదలతో ఉన్నారు. మరోవైపు చాలా కాలం తర్వాత సీనియర్లు అజింక్య రహానె, చటేశ్వర్ పుజారా, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహాలు లేకుండా భారత్ బరిలోకి దిగుతోంది. కాగా పర్యాటక శ్రీలంక జట్టు కూడా సిరీస్‌ను సవాల్‌గా తీసుకొంటోంది. ప్రతిభావంతులైన క్రికెటర్లకు ఆ జట్టులో కొదవలేదు. కెప్టెన్ దిముత్ కరుణరత్నె, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లా, లహిరు తిరిమన్నే, ఎంజిలో మాథ్యూస్, దినేశ్ చండీమల్, ధనంజయ డిసిల్వా, చరిత్ అసలంకా వంటి మ్యాచ్ విన్నర్ ఆటగాళ్లు లంకకు అందుబాటులో ఉన్నారు. దీంతో పాటు లహిరు కుమారా, సురంగా లక్మల్, విశ్వ ఫెర్నాండో, జయవిక్రమ వంటి ప్రతిభావంతులైన బౌలర్లు ఉండనే ఉన్నారు. ఇలాంటి స్థితిలో టీమిండియాకు కాస్త గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఫేవరెట్‌గా బరిలోకి..

మరోవైపు ఆతిథ్య టీమిండియా సిరీస్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది. ఇంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే ఆటగాళ్లకు జట్టులో కొదవలేదు. కెప్టెన్ రోహిత్‌తో పాటు విరాట్ కోహ్లి, మయాంక్ అగర్వాల్, శ్రేయస్ అయ్యర్, రవింద్ర జడేజా, రిషబ్ పంత్, హనుమ విహారి వంటి అగ్రశ్రేణి బ్యాటర్లు జట్టులో ఉన్నారు. ఇక వందో టెస్టు మ్యాచ్‌లో మెరుగైన ప్రదర్శన చేసేందుకు కోహ్లి సిద్ధంగా ఉన్నాడు. బౌలింగ్‌లో కూడా భారత్ చాలా బలంగా ఉంది. జస్‌ప్రీత్ బుమ్రా, సిరాజ్, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, షమి, ఉమేశ్ యాదవ్ వంటి మ్యాచ్ విన్నర్ బౌలర్లు ఉండనే ఉన్నారు. దీంతో మొహాలీ వేదికగా జరిగే తొలి టెస్టులో గెలిచి సిరీస్‌లో శుభారంభం చేయాలనే పట్టుదలతో టీమిండియా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News