Sunday, December 22, 2024

క్రికెటర్ అజారుద్దీన్‌కు సమన్లు!

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : మనీలాండరింగ్ కేసులో టీమిండియా మాజీ కెప్టెన్, కాంగ్రెస్ నేత అజారుద్దీన్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఇడి) సమన్లు జారీ చేసింది. ఆయనకి ఇదే తొలి సమన్లు. హైదరాబాద్ లోని ఇడి కార్యాలయం ఎదుట హాజరు కావాలని ఆయనకు అందజేసిన నోటీసుల్లో పేర్కొన్నారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సిఎ) అధ్యక్షులుగా ఉన్న సమయంలో అవినీతి జరిగినట్లు అజారుద్దీన్ పై ఆరోపణలు వచ్చాయి. దీంతో అసోసియేషన్ లో జరిగిన అక్రమాలపై ఇడి దర్యాప్తు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే ఉప్పల్ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ఇడి ఇసిఐఆర్ నమోదు చేసింది. ఇందులో భాగంగా అజారుద్దీన్‌కు ఇడి అధికారులు నోటీసులు జారీ చేశారు. అజహ ర్ పై దాదాపు 20కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియం కోసం డీజిల్ జనరేటర్లు, అగ్నిమాపక యంత్రాలు, తదితరాల సేకరణలో రూ. 20 కోట్లు అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో చాలా కాలంగాపాటు నిషేధానికి గురైన అజహరుద్దీన్ నిషేధ కాలం తర్వాత క్రికెట్ రాజకీయాల్లోకి వచ్చారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేన్ అధ్యక్షుడిగా గెలిచారు. అయితే ఆయన హయాంలో అనేక అవకతవకలు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. 2019 నుంచి 2023 వరకు ఆయన అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ సమయంలో జరిగిన అవకతవలపై అనేక ఆరోపణలు వచ్చాయి. సభ్యుల మధ్య కూడా తీవ్ర విబేధాలు రావడంతో న్యాయస్థానం జస్టిస్ లావు నాగేశ్వరరావు కమిషన్ నియమించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న సమ యంలో ఉప్పల్ స్టేడియంలో వివిధ సామగ్రి కొనుగోళ్లలో కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని అజారుద్దీన్‌పై సంఘంలోని తోటి సభ్యులే ఆరోపణలుచేశారు. హెచ్‌సిఎలో కోట్ల రూపాయల నిధులు గోల్‌మాల్ చేశారని టెండర్ల పేరుతో థర్డ్ పార్టీకి నిధులు కట్టబెట్టారని అజారుద్దీన్‌పై కేసు కూడా నమోదు కావడంతో ఎసిబి విచారణ చేస్తోంది. అగ్నిమాపక పరికరాలు, క్రికెట్ బంతులు, బకెట్ కుర్చీలు, జిమ్ సామాగ్రితో సహా అనేక పరికరాల కొనుగోలు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు వెల్లడి కావడంతో రాచకొండ పోలీసులు ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లోనే ఇడి కూడా రంగంలోకి దిగింది.

ఎసిబి అధికారులు నమోదు చేసిన కేసుల్లో రూ.20 కోట్ల వరకూ అక్రమ లావాదేవీలు జరిగాయని గుర్తించింది. అయిత అజహరుద్దీన్ ఇడి ఎదుట హాజరయ్యేందుకు తటపటాయిస్తున్నారు. కాంగ్రెస్ రాజకీయా ల్లో గతంలో యూపీ నుంచి ఓ సారి పోటీ చేసి ఎంపిగా గెలిచారు. తర్వాత రాజస్థాన్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మరోసారి గెలవలేక పోయారు. ఎమ్మెల్యేగా పోటీ చేసినా విజయం దక్కలేదు. ఇకపోతే, అజారుద్దీన్ భారత్ తరఫున 99 టెస్టులు, 334 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 45.04 సగటుతో 6215 పరుగులు, వన్డేల్లో 36.92 సగటుతో 9378 పరుగులు చేశాడు. టెస్టుల్లో 22 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు, వన్డేల్లో ఏడు సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు సాధించాడు. ఇది కాకుండా అజారుద్దీన్ వన్డేల్లో 12 వికెట్లు తీశాడు. అతని అత్యుత్తమ స్కోరు టెస్టులో 199 పరుగులు, వన్డేలో 153 పరుగులు. అజారుద్దీన్ వన్డే ప్రపంచకప్ లకు కూడా టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించాడు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News