న్యూఢిల్లీ : టీమ్ ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్, ఆయన భార్య ఆయేషా ముఖర్జీలకు ఢిల్లీ లోని ఫ్యామిలీ కోర్టు విడాకులు మంజూరు చేసింది. ఈ కేసులో ప్రాథమికంగా భార్య క్రూర ప్రవర్తన కారణం గానే వారికి విడాకులు మంజూరు చేస్తున్నట్టు న్యాయస్థానం ఈ సందర్భంగా వెల్లడించింది. తాము విడిపోతున్నట్టు రెండేళ్ల క్రితం శిఖర్ ధావన్ దంపతులు ప్రకటించారు. ఈ క్రమం లోనే తన భార్య మానసికంగా వేధిస్తోందని ఆరోపిస్తూ… ధావన్ ఢిల్లీ లోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పిటిషన్‌పై తాజాగా విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం .. వీరికి విడాకులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా భార్య ఆయేషా ముఖర్జీపై ధావన్ చేసిన ఆరోపణలు నిజం కావని ఆయేషా రుజువు చేసుకోలేక పోయినట్టు పేర్కొంది. “ తన ఒక్కగా నొక్క కుమారుడికి దూరంగా ఉండాలని ధావన్‌ను అతడి భార్య మానసికంగా వేధించినట్టు కోర్టు గుర్తించింది. ఆయేషా తొలుత శిఖర్ ధావన్‌తో కలిసి భారత్‌లో ఉండేందుకు అంగీకరించింది.
కానీ , తన మొదటి భర్తతో కలిగిన సంతానాన్ని చూసుకునేందుకు ఆస్ట్రేలియా లోనే ఉండిపోయింది. దీంతో ధావన్ తన కుమారుడికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఇక ధావన్ తన సొంత డబ్బుతో ఆస్ట్రేలియాలో కొనుగోలు చేసిన మూడు ఆస్తులపై తనకు యాజమాన్య హక్కులు కల్పించాలని ఆమె ఒత్తిడి చేసినట్టు కోర్టు నిర్ధారణకు వచ్చింది. ఒక ఆస్తిలో 99 శాతం వాటా , మిగతా రెండు ఆస్తుల్లో సహ యాజమాన్యం కావాలని ఆమె డిమాండ్ చేసినట్టు ధావన్ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. ఈ ఆరోపణలను ఆమె వ్యతిరేకించలేదు. అందువల్ల ఇవన్నీ వాస్తవమేనని కోర్టు గుర్తించింది. ” అని న్యాయస్థానం తమ తీర్పు సందర్భంగా వెల్లడించింది. అంతేగాక, శిఖర్‌ధావన్ పరువుకు భంగం కలిగించేలా ఆయేషా ఉద్దేశపూర్వకంగా తోటి క్రికెటర్లు, బీసీసీఐ,ఐపీఎల్ జట్టు యాజమాన్యానికి తప్పుడు సందేశాలు పంపించినట్టు విచారణలో తేలింది. తన మొదటి భర్తతో కలిగిన ఇద్దరు కుమార్తెల ఫీజులు, ఇతరత్రా ఖర్చుల కోసం కూడా ధావన్ నుంచి ఆమె డబ్బులు డిమాండ్ చేసినట్టు కోర్టు గుర్తించింది.
ధావన్ చేసిన ఆరోపణలన్నీ నిజమని తేలడంతో కోర్టు వీరిద్దరికీ విడాకులు మంజూరు చేసింది. అయితే తన కుమారుడి శాశ్వత కస్టడీ కోసం ధావన్ చేసిన అభ్యర్థనపై తీర్పు ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది.కానీ ధావన్ తన కుమారుడితో వీడియో కాల్ ద్వారా టచ్‌లో ఉండేందుకు అనుమతించింది. స్కూల్ వెకేషన్ సమయంలో ఆయేషా తన కుమారుడిని భారత్‌కు తీసుకొచ్చి ధావన్ కుటుంబంతో సమయం గడిపేలా చూడాలని కోర్టు ఆదేశించింది. ఆస్ట్రేలియాకు చెందిన బాక్సర్ ఆయేషా ముఖర్జీని ధావన్ 2012లో వివాహం చేసుకున్నాడు. వీరికి ఓ కుమారుడున్నాడు. అయితే వీరి మధ్య మనస్పర్థలు రావడంతో 2020 నుంచి వీరు దూరంగా ఉంటున్నారు. ధావన్ నుంచి తాను విడిపోతున్నట్టు 2021లో ఆయేషా ఇన్‌స్టా వేదికగా ప్రకటించింది. ఆమెకు అంతకు ముందే పెళ్లి అయి భర్త నుంచి విడిపోయింది. మొదటి భర్త ద్వారా ఆమెకు ఇద్దరు కుమార్తెలున్నారు.