Wednesday, January 22, 2025

గబ్బర్ సంచలన నిర్ణయం

- Advertisement -
- Advertisement -

టీమిండియా స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. దేశవాళీ క్రికెట్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. సుదీర్ఘ కాలంగా టీమిండియాకు సేవలు అందించిన ధావన్ అగ్రశ్రేణి ఓపెనర్లలో ఒకరిగా పేరు తెచ్చకున్నాడు. మూడు ఫార్మాట్‌లలో ధావన్ మెరుగైన బ్యాటింగ్‌తో అలరించాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఆరంగేట్రం టెస్టులోనే అత్యంత వేగవంతమైన శతకం బాది చరిత్ర సృష్టించాడు. మొహాలీలో జరిగిన ఈ మ్యాచ్‌లో ధావన్ రికార్డు స్థాయిలో 185 పరుగులు సాధించాడు. భారత జట్టులోనే కాకుండా ఐపిఎల్‌లోనూ శిఖర్ సత్తా చాటాడు. ఐపిఎల్‌లో హైదరాబాద్‌తో పాటు ముంబై, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కొంతకాలంగా పంజాబ్ కింగ్స్ టీమ్‌కు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే ఫిట్‌నెస్ లేమీతో కిందటి సీజన్‌లో కేవల ఐదు మ్యాచులు మాత్రమే ఆడాడు.

ఇక ఫామ్ కూడా కోల్పోవడంతో రెండేళ్లుగా టీమిండియాకు కూడా దూరమయ్యాడు. ఇక ధావన్ భారత క్రికెట్‌పై తనదైన ముద్ర వేశాడు. అద్భుత బ్యాటింగ్‌తో పలు మ్యాచుల్లో టీమిండియాకు ఒంటిచేత్తో విజయాలు సాధించి పెట్టాడు. ఫార్మాట్ ఏదైనా ధాటిగా ఆడడంలో ధావన్ తనకు తానే సాటి అనిపించుకున్నాడు. సెహ్వాగ్ తర్వాత మూడు ఫార్మాట్‌లలో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడిన టీమిండియా ఓపెనర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంతేగాక ఇంగ్లండ్‌లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుత బ్యాటింగ్‌ను కనబరిచాడు. అంతేగాక ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్‌ది టోర్నమెంట్ అవార్డును కూడా సొంతం చేసుకున్నాడు. తొలి బంతి నుంచే ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకు పడడం ధావన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఎంత పెద్ద బౌలర్‌కైనా ముచ్చెమటలు పట్టించిన ఘనత శిఖర్‌కు దక్కుతోంది. బరిలోకి దిగాడంటే చివరి వరకు చెలరేగి ఆడడం ధావన్‌కు అలవాటుగా ఉండేది. ప్రపంచంలోని అగ్రశ్రేణి బౌలర్లను దీటుగా ఎదుర్కొన్న బ్యాటర్లలో ధావన్‌కు ఒకడని చెప్పాలి. టీమిండియాతో పాటు ఐపిఎల్‌లోనూ ధావన్ అద్భుత బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News