చిన్నచూపు చూస్తే కఠిన చర్యలు
క్రికెటర్లకు జై షా హెచ్చరిక
ముంబై: కొంత మంది యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్‌లో ఆడేందుకు ఆసక్తి చూపకపోవడాన్ని భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) తీవ్రంగా పరిగణిస్తోంది. టీమిండియాలో చోటు సంపాదించాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాల్సిందేనని బిసిసిఐ స్పష్టం చేసింది. ఈ మేరకు క్రికెటర్లను ఉద్దేశించి బిసిసిఐ కార్యదర్శి జై షా లేఖ రాసినట్టు ప్రముఖ క్రీడా ఛానల్ వెల్లడించింది. కొంత మంది క్రికెటర్లు దేశవాళీ క్రికెట్‌పై పెద్దగా ఆసక్తి చూపడం లేదని, ఐపిఎల్‌లో ఆడేందుకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఇలాంటి వైఖరితో ఉన్న ఆటగాళ్లు తమ పద్ధతిని మార్చుకోవాలని జై షా ఆ లేఖలో సూచించినట్టు తెలిసింది. ఐపిఎల్‌లో ఆడేందుకే మొగ్గు చూపడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని, డొమెస్టిక్ క్రికెట్‌లో కూడా ఆడాల్సిందేనని జై షా తేల్చి చెప్పినట్టు తెలిసింది.
జాతీయ జట్టులోకి రావాలంటే దేశవాళీ క్రికెట్ ఆడడం తప్పనిసరి అని, దానిపై చిన్నచూపు చూస్తే కఠిన చర్యలకు సయితం వెనకాడబోం అని లేఖలో పేర్కొన్నారు. భారత క్రికెట్‌కు వెన్నుముక దేశావాళీ క్రికెటే అని, దానిని నిర్లక్షం చేస్తే సహించే ప్రసక్తేలేదని షా హెచ్చరించారు. దేశవాళీ క్రికెట్‌లో ఆడని వారు నేరుగా ఐపిఎల్‌లో ఆడతామంటే అంగీకరించమని షా వివరించారు. ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, హార్దిక్ పాండ్య తదితరులు డొమెస్టిక్ క్రికెట్ ఆడడంపై ఆసక్తి చూపడం లేదు. ఇషాన్ కిషన్‌ను రంజీ ట్రోఫీలో ఆడాలని టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే సూచించాడు. అయినా ఇషా న్ మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఇలాంటి సమయంలో బోర్డు కార్యదర్శి జై షా నేరుగా క్రికెటర్లకు లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది.