Thursday, November 14, 2024

మళ్లీ నగరంలో హత్యలు..

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః నగరంలో మళ్లీ వరుసగా హత్యలు జరుగుతున్నాయి. చిన్న చిన్నన కారణాల వల్ల యువకులు బహిరంగంగా హత్యలు చేస్తున్నారు. పోలీసులు పట్టుకుంటారని, భవిష్యత్తు నాశనం అవుతుందని ఏమాత్రం కూడా వెనుకాడకుండా హత్యలు చేస్తున్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరుగుతున్న హత్యలు ఎక్కువగా ఒకే సమాజిక వర్గానికి చెందిన వారి పాత్ర ఉంటోంది. వారిలో వారే హత్యలు చేసుకుంటున్నారు. చిన్న, చిన్న తగాదాలకు కక్ష పెంచుకుని హత్య చేసేందుకు పక్క ప్లాన్ వేసి హత్య చేస్తున్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా భూకక్షల నేపథ్యంలో హత్యలకు పాల్పడుతున్నారు. భూవివాదంలో తండ్రికుమారుడు కలిసి ఓ వ్యక్తిని కిరాయి హంతకులతో కలిసి హత్య చేశారు. కోట్లాది రూపాయల భూమి విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం ఏర్పడింది. దీంతో ఏకంగా బాధితుడు బైక్ వెళ్తుండగా వెనుక నుంచి ఢీకొట్టి హత్య చేశారు. లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత వరుసగా పాతబస్తీలో హత్యలు జరిగాయి. ఇందులో ఎక్కువగా ఓకే సామాజిక వర్గానికి చెందిన వారు ఉన్నారు.

మళ్లీ అదేపరిస్థితి పునరావృతం అవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హత్యకు గురైన వారు అందరూ గతంలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నవారే ఉన్నారు. కొన్ని హత్యల్లో బాలురు కూడా పాల్గొన్నారు. మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆరుగురు వ్యక్తులను హత్య చేశారు. ఇందులో అందరినీ నిందితులు కత్తులతో పొడిచి హత్య చేశారు. చాలామంది ఇందులో రౌడీషీటర్లు ఉండగా, మిగతా వారు కుటుంబ సభ్యుల మధ్య ఉన్న చిన్న చిన్న తాగాదాలకు హత్య చేసేందుకు కూడా వెనుకాడలేదు. జగద్గిరిగుట్టలో ఇద్దరు ఆటోడ్రైవర్లు నవాజ్(25), ఇమ్రాన్(21) మధ్య గతంలో వివాదం ఉంది. దానిని మనసులో పెట్టుకున్న ఇమ్రాన్‌ను గిరినగర్‌లో నవాజ్‌ను కత్తులతో పొడిచి చంపాడు. బేగంపేటలో కూడా పాతకక్షల నేపథ్యంలో ఓ వ్యక్తిని హత్య చేశారు. ఇటీవల మలక్‌పేటలోని ముసారాంబాగ్ ఎక్స్ రోడ్డులో జరిగిన హత్యలో కుటుంబంలో ఉన్న చిన్న గొడవ కారణంగా బావమర్ధి, బావను కత్తులతో పొడిచి చంపాడు. అలాగే మంగళ్‌హాట్‌కు చెందిన నరేష్‌ను ఇందిరానగర్‌లో గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో పొడిచి చంపారు.

పాతబస్తీ కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మరో హత్య కేవలం పేకాటలో వచ్చిన డబ్బులు బలవంతంగా తీసుకున్నాడని చెప్పి బాధితుడిని తీసుకువచ్చి హత్య చేశారు. ఇందులో ఇద్దరు బాలురతోపాటు ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. అన్నదముళ్ల మధ్య ఉన్న చిన్న ఆస్థిగొడవ కారణంగా అన్న విజయ్‌ను తమ్ముడు నరేందర్ మద్యం తాగిన తర్వాత కత్తితో పొడిచి చంపాడు. పాతబస్తీలోని రేయిన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ పర్వేజ్ అలియాస్ పర్రు డాన్‌ను కత్తితో పొడిచి చంపారు. ఈ హత్య కేవలం ఆధిపత్య పోరులో భాగంగా జరిగింది. రెండు గ్రూపులకు చెందిన వారి మధ్య వచ్చిన వివాదం హత్యకు దారి తీసింది. ప్రత్యర్థులు పర్వేజ్‌ను తల్వార్లు, డాగర్‌తో కిరాతకంగా హత్య చేశారు. కంచన్‌బాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పాత నేరస్థులు హత్య కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. బయటికి వచ్చిన తర్వాత హత్యకు గురైన బాధితుడి సోదరుడికి ఫోన్ చేసి చంపివేస్తానని తరచూ హెచ్చరిస్తున్నాడు. దీంతో విరక్తి చెందిన బాధితుడు తన స్నేహితులతో కలిసి జైలుకు వెళ్లి వచ్చిన నిందితుడిని హత్య చేశాడు.

అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 2, 2023న మద్యం సేవించి స్నేహితుడిని కత్తులతో పొడిచి చంపాడు. సులేమాన్‌నగర్‌కు చెందిన ఖలీల్ స్నేహితులతో కలిసి మద్యం తాగాడు. వారి మధ్య మద్యం తాగుతుండగా గొడవ జరిగింది. దీంతో ఖలీల్‌ను మిగతా వారు కత్తులతో పొడిచి చంపారు. మద్యం తాగి తిడుతున్నాడని బహదూర్‌పురాకు చెందిన షేక్ ఖాసీంను మిగతా వారు హత్య చేశారు. షేక్ ఖాసీం, సయిద్ యూసుఫ్, సయిద్ ఫజల్ కలిసి రోజు మద్యం తాగేవారు, చివరికి తనకు మద్యం సరిపోలేదని, మరింత తెప్పించాలని షేక్‌ఖాసీం మిగతా వారి కుటుంబ సభ్యులను దూషించేవాడు. దీంతో వారు మద్యం తాగేందుకు పిలిచి షేక్ ఖాసీంను హత్య చేశారు. డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వలేదని కిడ్నాప్ చేసి హత్య చేసిన సంఘటన ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మల్లేపల్లికి చెందిన మల్లేపల్లికి చెందిన మహ్మద్ సలీం వద్ద సంతోష్‌నగర్‌కు చెందిన ఎండి రిజ్వాన్ వివిధ దశల్లో రూ.33లక్షలు అప్పుగా తీసుకున్నాడు. ఎన్నిసార్లు అడిగినా అప్పుకట్టకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.

దీంతో సలీం తన స్నేహితులతో కలిసి రిజ్వాన్‌ను అతడి ఇంటి నుంచి కిడ్నాప్ చేశారు. తమ ఆఫీసుకు తీసుకుని వచ్చి మూడు రోజులు చితకబాదారు. తర్వాత రిజ్వాన్ తండ్రికి ఫోన్ చేసి బెదిరించడంతో రూ.2లక్షలు చెల్లించాడు. మిగతా డబ్బులు పది రోజుల్లో కడుతానని చెప్పాడు. దీంతో రిజ్వాన్‌ను అతడి ఇంటి వద్ద వదిలేశారు, కానీ అప్పటికే తీవ్రంగా గాయపడడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఇలా సెప్టెంబర్ నెలలో 20 రోజుల్లోనే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా హత్యలు జరిగాయి.

రౌడీల్లో మార్పు రావడంలేదు…
వివిధ కేసుల్లో ఉన్న రౌడీల్లో ఇప్పటికీ మార్పు రావడంలేదు. చిన్న చిన్న కారణాల వల్ల హత్యలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పాతబస్తీలో హత్యలు వరుసగా జరుగుతున్నాయి. చాలా హత్యలు చిన్న చిన్న కారణాల వల్లే జరిగాయని పోలీసుల విచారణలో తేలింది. పాతబస్తీ కేంద్రంగా ఇన్ని హత్యలు గతంలో ఇప్పుడు జరుగుతున్నా పోలీసులు పటిష్ట నిఘా పెట్టలేకపోతున్నారు. రౌడీషీటర్లలో మార్పు తీసుకుని వచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నం చేయడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో పాతబస్తీకి చెందిన రౌడీషీటర్లకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చే వారు కరోనా వచ్చిన తర్వాత వాటిని మర్చిపోయారు. ఒకటి రెండు మినహా ఏ పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్ కన్పించడంలేదు. హత్య జరిగిన తర్వాత నిందితులను అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నారు తప్ప హత్యలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే కార్డన్ సెర్చ్‌ను కూడా మర్చిపోయారు, కరోనాకు ముందు పోలీసులు తరచూ పాతబస్తీలో కార్డన్ సెర్చ్ చేసేవారు. ఇప్పుడు కార్డన్ సెర్చ్ చేయడం మర్చిపోయారు, దీంతో రౌడీలు తాము చేయాల్సిన పనులను యథేచ్చగా చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News