క్రైమ్ ఇన్ ఇండియా 2020 నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ : దేశంలో ప్రతిరోజూ సగటున దాదాపు 80 హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యల్లో ఎక్కువ శాతం ప్రేమ వ్యవహారాలు కానీ అక్రమ సంబంధ పరిణామాలు కానీ ఉంటున్నాయని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) ఇటీవల విడుదల చేసిన క్రైమ్ ఇన్ ఇండియా ఇయర్ 2020 నివేదిక వెల్లడించింది. దేశంలో గతేడాది నమోదైన 29,193 హత్యల్లో 3031 హత్యలు ప్రేమ, అక్రమ సంబంధాలకు సంబంధించినవని పేర్కొంది. భూ వివాదాలు, కుటుంబీకుల మధ్య గొడవలు, హత్యలు ఇలా చాలానే ఉన్నాయి. ఏదైనా హత్య జరిగిందంటే దాని వెనుక ప్రేమ వ్యవహారమో లేక అక్రమ సంబంధాలో ఉంటున్నాయని, పోలీసుల దర్యాప్తు కూడా ఆ కోణం లోనే సాగుతోందని నివేదిక వెల్లడించింది. ఈ తరహా హత్యలు 2010 2014 మధ్య కాలంలో 7.8 శాతం మాత్రమే ఉండేవి. కానీ ప్రస్తుతం అది 10 నుంచి 11 శాతానికి పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది. ఈ హత్యల్లో ఉత్తరప్రదేశ్ మొదటి స్థానంలో ఉండగా, బీహార్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, తమిళనాడు, గుజరాత్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. కేరళ, పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ తరహా తక్కువగా నమోదవుతున్నాయని నివేదిక తెలిపింది.