Monday, January 20, 2025

సైబర్ నేరగాళ్ల విజృంభణ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : రాష్ట్రంలో 2022లో సైబర్ నేరగాళ్లు విజృంభించారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. విస్తుగొలిపే సంచల నాత్మక కేసులు అంతే స్థాయిలో నమోదయ్యాయి. హత్య, కిడ్నాప్ కేసులు సంచలనం సృష్టించాయి. డ్రగ్స్, రేప్, చీటింగ్ కేసులు భారీగా పెరిగాయి. ఓ మారు ఈ ఏడాదిలో జరిగిన నేరాలుఘోరాలు ఏమిటో పరిశీలిద్దాం. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో మైనర్ రేప్ కేసు సంచలనం రేపింది. జూబ్లీహిల్స్ పబ్ నుంచి మైనర్ బాలికను తీసుకెళ్లిన నిందితులు ఇన్నోవా కారులో అత్యాచారానికి పాల్పడ్డారు. తర్వాత ఆ కారులోనే మొయినాబాద్ వెళ్లారు. మొయినాబాద్ లో ఉన్న ఓ రాజకీయ నేత ఫాంహౌస్ లో ఆ రాత్రి నిందితులు మందు పార్టీ చేసుకున్నారు.

తర్వాత ఫుల్ల్ గా ఎంజాయ్ చేశారు. బాధితురాలు రెండు రోజుల పాటు ముభావంగా ఉండటంతో తల్లిదండ్రులు విషయం తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు . దీంతో నేరం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితులు ఎక్కువగా మంది రాజకీయ నేతల పిల్లలు కావడంతో తీవ్ర దుమారం రేగింది. వారిలోనూ కొంత మంది మైనర్లు. అయితే వీరిని మేజర్లుగా పరిగణించాలని పోలీసులు వేసిన పిటిషన్‌కు హైకోర్టు అనుకూలంగా తీర్పు చెప్పింది. ఈ కేసు వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది అదే విధంగా హైదరాబాద్ శివార్లలో ఆదిభట్ల మన్నెగూడులో ఇంటిపై వంద మందికిపైగా దాడి చేసి యువతిని ఎత్తుకెళ్లిన వీడియోలు వైరల్ గా మారాయి. నిందితుడు నవీన్‌రెడ్డి మిస్టర్ టీ ఓనర్. అతడు వైశాలితో కలిసి బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది.

నవీన్‌రెడ్డి పెళ్లి ప్రస్తావన తీసుకురావడందో తమ తల్లిదండ్రుల అనుమతి లేకుండా తాను నిర్ణయం తీసుకోలేనని వైశాలి చెప్పిందని, దీంతో నవీన్‌రెడ్డి యువతి ఇంటికి వచ్చి పెళ్లి సంబంధం మాట్లాడగా ఆమె తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో కోపం పెంచుకున్న నవీన్‌రెడ్డి గతంలో ఆ యువతితో చనువుగా ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టుచేశాడు. దీంతో వైశాలి, నవీన్‌రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇది మనుసులో పెట్టుకున్న నవీన్ రెడ్డి, శుక్రవారం యువతిని చూడడానికి పెళ్లి చూపులకు వస్తున్న సంగతి తెలుసుకొని వందమందితో ఆమె ఇంటికి దాడిచేశాడు. అడ్డు వచ్చిన వారిపై రాడ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి మరీ ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లాడు. ఈ కేసులో నవీన్ రెడ్డి జైల్లో ఉన్నాడు. వైశాలి సేఫ్ గా ఉంది. ఖమ్మం జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య సంచలనం సృష్టించింది. ఆగస్టు 15న తమ్మినేని కృష్ణయ్యను ప్రత్యర్థులు దారుణంగా హత్య చేశారు. దోబీఘాట్ దగ్గర బైక్ పై వెళ్తున్న కృష్ణయ్యను ఆటోతో ఢీకొట్టి దాడికి దిగారు నిందితులు. కిందపడిపోయిన తమ్మినేని కృష్ణయ్యను కత్తులతో పొడిచి అతి కిరాతకంగా మర్డర్ చేశారు.దుండగులు కృష్ణయ్య రెండు చేతుల్ని నరికి తీసుకెళ్లిపోయారు. కృష్ణయ్య గతంలో సిపిఎంలో కీలక నేతగా ఉన్నారు.

తర్వాత మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు సమక్షంలో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఆనతి కాలంలో తుమ్మల ప్రధాన అనుచరుడిగా కృష్ణయ్య మారారు. చుట్టు పక్కల మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కృష్ణయ్య సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రానికి సోదరుడు అవుతారు. వీరభద్రం మరో సోదరుడు అయిన కోటేశ్వరరావుతో కృష్ణయ్యకు ఆధిపత్య పోరు వల్లే హత్య జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు.
గొత్తికోయలు దాడిలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు హత్య
విధి నిర్వహణలో ఉన్న చండ్రుగొండ అటవీశాఖ రేంజ్ అధికారి శ్రీనివాసరావును గొత్తికోయలు (వలస ఆదివాసీలు) కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి హత్యచేయడం కూడా ప్రకంపనలు రేపింది. బెండాలపాడు గ్రామ శివారు అడవిలో ఉన్న ప్లాంటేషన్‌లో పది మందికి పైగా గొత్తికోయలు ఆవులు, మేకలు మేపుతున్న సమయంలో ఫారెస్ట్ అధికారులు అభ్యంతరం చెప్పారు. ఈ సందర్భంగా ఘర్షణ జరిగింది. ఆ ఘర్షణలో ఎఫ్‌ఆర్వో శ్రీనివాసరావు మృతి చెందారు. విధి నిర్వహణలో ఉద్యోగిని చంపడం సంచలనం సృష్టించింది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నారాయణరెడ్డి (25)ని దారుణంగా హత్య చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలంరేపింది.

ఏడాది క్రితం ప్రేమ వివాహం చేసుకున్న నారాయణరెడ్డిని భార్య తల్లిదండ్రులు, బంధువులు ఏకంగా యువకుడి మర్డర్‌కు ప్లాన్ చేశారు. హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ కెపిహెచ్‌బి నివాసం ఉంటాడు. హఠాత్తుగా కనిపించకుండా పోయాడు. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసుపై విచారణ చేపట్టిన పోలీసులు నారాయణరెడ్డిని హతమార్చి జిన్నారం అటవీ ప్రాంతంలో పెట్రోల్ పోసి తగులబెట్టారని గుర్తించారు. యువతి కుటుంబసభ్యులే నారాయణరెడ్డిని హత్య చేయించినట్లుగా తేలింది.
సూదీతో పొడిచి చంపేశారు…
ఇంజక్షన్లతో కూడా మర్డర్లు చేసే ప్లాన్లు ఈ ఏడాది అమలు చేశారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన షేక్ జమాల్ సాహెబ్ ను ఇంజక్షన్ పొడిచి చంపేశారు. షేక్ జమాల్ సాహెబ్ భార్య షేక్ ఇమాంబీ ఆటో డ్రైవర్ తో అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను చంపాలని ప్లాన్ చేసింది. ఓ ఆర్‌ఎంపీ దగ్గర మనిషి ప్రాణాలు తీయగల ఇంజక్షన్ కొని ఓ సారి బయట నుంచి వస్తున్న సమయంలో లిఫ్ట్ అడిగి వెనుక కూర్చుని ఇంజక్షన్ ఇచ్చి చంపేశాడు. అయితే ఎలా చంపారు ఏంటి అన్నది మొదట తేలలేదు. చివరికి పోలీసుల దర్యాప్తులో మిస్టరీ చేధించారు. ఇలా కూడా చంపుతారా? అని అందరూ ఆశ్చర్యపోవాల్సి వచ్చింది.
పరువు హత్య కలకలం
తెలంగాణలో పరువు హత్యలు కూడా కలకలం రేపాయి. వేరే మతానికి చెందిన ఆశ్రీన్‌ను పెళ్లి చేసుకున్న నాగరాజు అనే యువకుడ్ని ఆశ్రీన్ బంధువలు వెంటాడి మరీ చంపేశారు. రంగారెడ్డి జిల్లా మర్‌పల్లికి చెందిన బిల్లాపురం నాగరాజు , పోతిరెడ్డిపల్లెకు చెందిన ఆశ్రిన్ సుల్తానా ( మతాలు వేరు అయినా పెద్దలు వ్యతిరేకించినా పెళ్లి చేసుకున్నారు. వివాహం గురించి తెలిస్తే చంపేస్తార్ని ముందే పసిగట్టిన ఈ జంట.. పెళ్లి అయిన వెంటనే ఏపీలోని విశాఖపట్నంకు వెళ్లి అక్కడే ఉన్నారు. రెండు నెలల తర్వాత హైదరాబాద్ వచ్చి రహస్యంగా జీవిస్తున్నారు. అయితే వీరు వచ్చారని తెలిసిన ఆశ్రీన్ బంధువులు అడ్రస్ తెలుసుకుని ఇంటికి బైక్‌పై వెళుతున్న నాగరాజు, ఆశ్రిన్‌పై దాడికి పాల్పడ్డారు. నాగరాజును ఇనుపరాడ్‌తో కొట్టి హత్య చేశారు. ఆశ్రీన్ కళ్ల ముందే నాగరాజును చంపేశారు.
కలకలం రేపిన ఆరుగురి సజీవదహనం కేసు…
మంచిర్యాల ఓకే ఇంట్లో ఇంట్లో ఆరుగురు సజీవదహనమైన ఘటన కూడా ఏడాది చివరిలో కలకలంరేపింది. మందమర్రి మండలం గుడిపెల్లి గ్రామంలోని మాసు శివయ్య ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. మాసు శివయ్య, ఆయన భార్య పద్మ, ఆమె అక్క కూతురు మౌనికతో పాటు ఆమె ఇద్దరు పిల్లలు శాంతయ్య అనేవ్యక్తి చనిపోయారు. వివాహేతర బంధం వల్ల శాంతయ్య భార్య, పిల్లలే ప్లాన్ చేసి.. ఈ హత్యలు చేశారని పోలీసులు గుర్తించారు. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని.. తనకు డబ్బులివ్వడంలేదనే కక్షతో మృతుడు శాంతయ్య భార్య సృజన ఆస్తి ఆశ చూపి తన ప్రియుడిని ఉసిగొల్పి హత్యలు చేయించిదని నిర్ధారించారు. రాఖీ సినిమాలో మాదిరిగా పెట్రోల్ పోసి నిప్పంటించి చంపాలని ప్లాన్ చేసుకుని ఈ సజీవ దహనానికి పాల్పడ్డారు.
ములుగు జిల్లాల్లో న్యాయవాది దారుణ హత్య
ములుగు జిల్లాలో ఇన్నోవా కారులో వెళ్తున్న న్యాయవాది కారును అడ్డగించి.. దారుణంగా గొడ్డళ్లు, కత్తులతో దుండగులు దాడి చేసి హత్య చేశారు. గతంలో లాయర్ దంపతులను హత్య చేసినట్లుగానే ఈ ఘటన ఉండటం కలకలం రేపింది. అడ్వకేట్ మల్లారెడ్డి ములుగు జిల్లా కేంద్రం నుంచి మల్లంపల్లి వైపునకు వెళ్తున్న సమయంలో.. పందికుంట స్టేజీ వద్ద దుండగులు మాటు వేశారు. సరిగ్గా స్పాట్‌కు రాగానే ఇన్నోవా కారును మరో కారుతో అడ్డగించి.. డ్రైవర్‌పై దాడి చేశారు. ఆ తర్వాత కారులో నుంచి మల్లారెడ్డిని బయటకు లాగి విచక్షణా రహితంగా కత్తులు, గొడ్డళ్లతో దాడి చేసి చంపేశారు.
చేలరేగిన సైబర్ నేరగాళ్లు.. కోట్లలో దోచేశారు…
తెలంగాణలో అతి పెద్ద నగరమైన హైదరాబాద్‌లో ఎన్నో చిత్ర విచిత్రమైన నేరాలు చోటు చేసుకున్నాయి. సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక నేరాలు సరేసరి, వేల కోట్లలోనే ఉన్నాయి. మామూలు నేరాలు తగ్గి సైబర్ నేరాలు తీవ్రతరమవుతాయన్న నిపుణుల అంచనాలు నిజమవు తున్నాయి. సాంకేతిక పరిజ్ఞానం ఉన్నా, మిడి మిడి జ్ఞానం ఉన్నప్పటికీ సైబర్ నేరాలే ఉత్తమమని సైబర్ నేరాలవైపు దొంగలు తమ దారి మళ్లిస్తు న్నారని ఇటీవల మూడు కమిషనరేట్ల పరిధిలో విడుదల చేసిన వార్షిక నివేదికలో సైబర్ నేరాల పెరుగుదలే ఇందుకు తార్కాణంగా చెప్పవచ్చు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపర్చడం గమనార్హం.

అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో బాధితులు చిక్కుతుండటం సహజం. వలకు చిక్కిన వెంటనే తమ పనిని క్షణాల్లో పూర్తి చేయడం సైబర్ నేరగాళ్లకు అంతే సులభం. ఇలా ఆశ చూపి ఆశలు రేకెత్తించి తమ ట్రాప్‌లో చిక్కిన వారినుంచి అందినంత మేర దండుకోవడమే సైబర్ నేరగాళ్ల పని. ఈ స్థాయిలో సైబర్ నేరాలు తీవ్రతరమవుతున్నా మళ్లీ వారి ఉచ్చులో సామాన్యులతో పాటు విద్యావంతులు సైతం చిక్కుతుండటం ఇక్కడ గమనించదగిన పరిణామం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News