Monday, December 23, 2024

మత్తు ఇచ్చి దోపిడీ..!

- Advertisement -
- Advertisement -

ముషీరాబాద్: ఓ మాజీ ఐఆర్‌ఎస్ అధికారికి మత్తు మందు ఇచ్చి ఆయన ఇంట్లో దోపిడీకి పాల్పడిన ఘటన నగరంలోని ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపుతోంది. సదరు అధికారి మత్తులోకి జారుకున్నాకా ఇంట్లోని నగదు, బంగారంతో పాటు విలువైన డాక్యుమెంట్లతో పరారీ అయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముషీరాబాద్ డిఐ ప్రశాంత్ తెలిపిన ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ విష్ణు రెసిడెన్సీలో మాజీ ఐఆర్‌ఎస్ అధికారి సామ్యూల్ ప్రసాద్ (80) భార్య మరణించడం,

ఇద్దరు కుమారులు అమెరికాలో ఉండటంతో ఒంటరిగా ఉంటున్నాడు. నగరంలోని నిజాంపేటకు చెందిన సురేందర్ అనే వ్యక్తి ఇటీవల రియల్ ఎస్టేట్ వ్యాపారి పేరుతో పరిచయం అయ్యాడు. తనకు పలు ఆస్తులున్నాయని, మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఇటీవలనే 5 ఎకరాలు కొనుగోలు చేసినట్టుగా చెప్పి స్నేహం పెంచుకున్నాడు. అనంతరం విశాఖపట్నంలో ఉన్న సిస్టర్స్ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు ఇప్పించాలంటూ సామ్యూల్ ప్రసాద్‌ను సురేందర్ కోరాడు. అందుకు సంబంధించిన డబ్బు సిద్ధంగా ఉన్నట్టు నమ్మించాడు.
15 గంటలపాటు అపస్మారక స్థితిలో…
ఈ నేపథ్యంలోనే మే 30న గాంధీనగర్‌లోని సామ్యూల్ ప్రసాద్ ఇంట్లో విశాఖపట్నం ప్లాట్లకు చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లను చూపించాలని సురేందర్ అడగడంతో తన ముందే అల్మారాలోని పత్రాలను చూపించాడు. ఈ క్రమంలోనే సామ్యూల్ ప్రసాద్‌తో సురేందర్ కొంత సేపు గడిపారు. ఈ సమయంలోనే టిఫిన్ తిని, కొబ్బరినీళ్లు తాగిన సామ్యూల్ రాజ్ స్పృహ తప్పిపడి పోవడంతో ఇంట్లోని రూ. 5 లక్షల నగదు, 30 తులాల బంగారు ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్లతో సురేందర్ ఉడాయించినట్టుగా జూన్ 14వ తేదీన ముషీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. సామ్యూల్ రాజ్‌కు ఎన్నిసార్లు ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదో,

ఏం జరిగిందో తెలుసోకోవాలని సోమాజిగూడలోని బంధువులకు సమాచారం అందించారు ఆయన సిస్టర్స్. దీంతో మే 31న గాంధీనగర్‌లోని ఆయన ఫ్లాట్‌కు వెళ్లి చూడగా, మంచంపై అపస్మారక స్థితిలో ఉండడాన్ని గమనించారు. హుటాహుటీనా హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ సమయంలో ఎవరైనా మత్తు మందు ఇచ్చి ఉండవచ్చని వైద్యులు అనుమానం ఉండటంతో జరిగిన కథను పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ నెల 14న కేసు నమోదు చేశారు. ఈ సమయంలో మాజీ ఐఆర్‌ఎస్ అధికారి సుమారు 15 గంటలు అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా తెలుస్తోంది.
ఓ ఎస్‌ఐ పాత్రపై ఆరా..?
కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించిన పోలీసులు ఈ నెల 19న సురేందర్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తులో భాగంగా మూడ్రోజుల పాటు కోర్టు అనుమతితో నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. సురేందర్ 20 ఏళ్లుగా ఫార్మా రంగంలో అనుభవం ఉండటం చేత ఈ దోపిడీ పథకం ప్రకారమే జరిగినట్టుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీకి గురైన పత్రాలు దుండిగల్ ఎస్సై కృష్ణ వద్ద రికవరీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో సురేందర్‌కు సదరు ఎస్‌ఐకు ఉన్న సంబంధాలు ఏంటీ..? సామ్యూల్ ప్రసాద్ ఇంట్లో చోరీ జరిగినప్పుడు లేకున్నా.. పని మనిషి సుమలతను కూడా విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఒంటరిగా ఉండే సామ్యూల్ ప్రసాద్ ఇంట్లోకి పని మనిషి సుమలత, సురేందర్‌లను ఎస్‌ఐ పథకంలో భాగంగానే ప్రవేశించారా.. అనే సందేహాలు పోలీసులను వెంటాడుతున్నాయి. సామ్యూల్ ప్రసాద్‌కు చెందిన 25 ఎకరాలలో 3 ఎకరాల భూమిని ఎస్‌ఐ కొనుగోలు చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలన్నీ ఈ దోపిడీ కేసుతో సదరు ఎస్‌ఐకు సంబంధాలు ఉన్నట్టుగానే పోలీసులు భావిస్తున్నారు. నగర పోలీసులకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన ఈ కేసు దర్యాప్తు చిరవకు ఏమవుతోందో చూడాల్సి ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News