Friday, December 20, 2024

సత్వర న్యాయం సాధ్యమేనా?

- Advertisement -
- Advertisement -

ఎంపిలు, ఎంఎల్‌ఎలపై గల క్రిమినల్ కేసుల సత్వర పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని హైకోర్టులకు సుప్రీం కోర్టు గురువారం నాడు ఇచ్చిన ఆదేశాలు సమగ్రంగా అమలుకు నోచుకోవాలని కోరుకోని వారు వుండరు. నేర చరిత్ర గల వారి ప్రవేశంతో దేశ రాజకీయాలు ఎంతగా భ్రష్టుపట్టిపోయాయో, పర్యవసానంగా అవినీతి మరెంతగా విజృంభించి సాధారణ ప్రజల జీవితాల్లో చీకటిని కుమ్మరిస్తున్నదో అన్నది కళ్ళముందున్న కఠోర వాస్తవమే. ప్రస్తుత ఎంపిలలో 40% మందిపై క్రిమినల్ కేసులు పెండింగ్‌లో వున్నాయి. వాటిలో 25% కేసులు తీవ్రమైనవి. అలాగే ప్రస్తుత ఎంఎల్‌ఎలలో 44% మంది మీద క్రిమినల్ కేసులు వుండగా, అందులో 28% సీరియస్ కేసులు. ఏ కేసులూ లేని వారి కంటే వున్న వారి ఆస్తులు చాలా ఎక్కువని కూడా ప్రజాస్వామిక సంస్కరణల సంఘం (ఎడిఆర్) వెల్లడించింది. హత్య, హత్యాయత్నం, కిడ్నాపింగ్, మహిళలపై అత్యాచారాలు తదితర నేరాలకు పాల్పడ్డారన్న ఆరోపణలున్న కేసులనే ఎడిఆర్ సీరియస్ కేసులుగా వర్గీకరించింది. ఇంతటి ఘోరమైన నేరాలు చేసినట్టు కేసులు నమోదైన వారు పెద్ద సంఖ్యలో ఎంపిలు, ఎంఎల్‌ఎలుగా వున్నారంటే, మన చట్ట సభలలో శాసన కర్తలుగా కొనసాగుతున్నారంటే సుప్రీం కోర్టు హెచ్చరించినట్టు దేశ ప్రజాస్వామిక రాజకీయాలపై అది ఎంతటి వ్యతిరేక ప్రభావం చూపుతుందో ఊహించవచ్చు.

పార్టీ ఫిరాయింపుల వంటి ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులు ప్రబలడానికి మన ప్రతినిధులు నేర చరిత్రులు కావడమే చాలా వరకు కారణం అవుతున్నది. అందుచేత ఈ కేసులను వేగంగా పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా వున్నది. న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ 2016లో దాఖలు చేసిన ఈ కేసును భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ సారథ్యంలోని ధర్మాసనం విచారిస్తున్నది. ప్రస్తుత, మాజీ ఎంపిలు, ఎంఎల్‌ఎలపై వున్న క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించాలన్న అభ్యర్థనతో పాటు, ఈ కేసుల్లో కనీస పక్షం రెండేళ్ళు శిక్షలు పడిన వారిని జీవితాంతం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలని కూడా ఉపాధ్యాయ తన పిటిషన్‌లో కోరారు. రెండో దానిని పక్కనబెట్టి మొదటి దానికే పరిమితమై విచారణ సాగుతున్నది. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం రెండేళ్ళకు తక్కువ కాకుండా శిక్ష పడిన వారిని ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీకి అనర్హులు చేయడానికి అవకాశమున్నది. ప్రస్తుత, మాజీ ఎంఎల్‌ఎలు, ఎంపిలపై 2022 నాటికే 5175 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో వున్నాయి. ఇందులో 40% కేసులు (2166) ఐదేళ్ళుగా అపరిష్కృతంగా కొనసాగుతున్నాయి. ఎక్కువ కేసులు ఉత్తరప్రదేశ్ (1377) నుంచి నమోదు కాగా, రెండో స్థానంలో బీహార్ (546), మూడో స్థానంలో మహారాష్ట్ర వున్నాయి.

ఈ కేసులున్న ఎంఎల్‌ఎలలో 114 మందిపై మహిళల మీద నేరాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. వీరిలో 14 మంది మీద మహిళలపై అత్యాచారానికి పాల్పడినట్టు కేసులు దాఖలయ్యాయి. ఒక సమాచారం ప్రకారం మొత్తం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 4001 మంది ఎంఎల్‌ఎలపై కేసులు నమోదు కాగా, వారిలో 1777 మందిపై క్రిమినల్ కేసులున్నాయి. వీరిలో 1136 మంది మీద సీరియస్ క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. హత్యారోపణలున్న ఎంఎల్‌ఎలు 47 మంది కాగా, మహిళలపై నేరాలకు సంబంధించిన కేసులు నమోదైన వారు 114 మంది. ఎన్నికలలో డబ్బు పాత్ర అధికమయ్యే కొద్దీ రాజకీయాల్లో నేర చరిత్రులకు ప్రాధాన్యం పెరుగుతుంది. అందుచేత అక్రమార్జనాపరులు మాత్రమే రాజకీయాలను శాసించగలుగుతున్నారు. మూలంలోని ఈ కారణాన్ని తొలగించకుండా రాజకీయాలు నేరస్థులకు దూరంగా వుండాలని ఆశించడం అత్యాశే అవుతుంది. ఇంకా చెప్పాలంటే దేశ ప్రజల్లో ఎక్కువ శాతం మంది పేదరికంలో మగ్గుతున్నంత కాలం వారు ప్రలోభాలకు లొంగిపోయి ఓటును అమ్ముకోడం మామూలైపోతున్నది.

ఇక్కడే అక్రమార్జనాపరులు, నీతిమాలిన ప్రవర్తన గల వారు ప్రాబల్యం గడించుకోగలుగుతున్నారు. ప్రజలకు శాస్త్రీయమైన చదువు లేకపోడం కూడా ఇందుకు దారి తీస్తున్నది. ఎంపిలు, ఎంఎల్‌ఎలపై కేసు దాఖలైన రోజు నుంచి ఏడాది లోగా తీర్పు రావాలని 2014 సెప్టెంబర్‌లో సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా ఇంకా వేల సంఖ్యలో ఇటువంటి కేసులు అపరిష్కృతంగా వుండడం బాధాకరం. న్యాయ స్థానాల్లో కేసుల నత్త నడక కూడా ఇందుకొక కారణమవుతున్నది. పేదలపై నమోదయ్యే కేసుల్లో త్వరత్వరగా శిక్షలు పడి వారు జైలుకు వెళుతుండగా, ధనికులపై కేసులు పరిష్కారం కాడానికి ఏళ్ళూపూళ్ళూ పట్టిపోడం ఆందోళనకరం. పేదలు బెయిలు దొరక్క విచారణలోని ఖైదీలుగానే బతుకులు చాలిస్తున్నారు. ధనికులు వెంట వెంటనే బెయిలు పొంది బయటి సమాజంలో గౌరవ మన్ననలు పొందుతున్నారు. దీనిని కూడా సుప్రీం కోర్టు పట్టించుకోవలసి వుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News