Wednesday, January 22, 2025

పెరిగిన విపక్ష అభ్యర్థుల నేరచరిత్ర

- Advertisement -
- Advertisement -

(ఎల్. వెంకటేశం/మనతెలంగాణ)
తెలంగాణలో ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల నామినేషన్లలో 119 నియోజకవర్గాలకు సంబంధించిన అభ్యర్థులు తమపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు వెల్లడించారు. ఇందులో బిఆర్‌ఎస్ అభ్యర్థుల కంటే బిజెపి, కాంగ్రెస్ అభ్యర్థుల నేరచరిత్ర అంతకంతకు పెరిగిపోవడం విశేషం. 2018 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే 2023 నాటి ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల నేరచరిత్రలో చాలా వ్యత్యాసం కనిపిస్తుంది. ముఖ్యంగా కాంగ్రెస్, బిజెపి నాయకులపై క్రిమినల్ కేసులు పెరిగిపోయాయి. 2018 నాటికి ప్రతిపక్ష నాయకులపై పదుల సంఖ్యలో కేసులో నమోదు కాగా, తాజాగా అభ్యర్థులను దాఖలు చేసిన అఫిడవిట్ల ప్రకారం ఒక్కో ప్రతిపక్ష నాయకుడిపై 50 శాతానికి పైగా కేసులు పెరగడం విశేషం. అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లను పరిశీలిస్తే అందరికంటే ముందుగా అధికార బిఆర్‌ఎస్ పార్టీ 119 మంది అభ్యర్థుల్లో దాదాపు 56 మంది ఎమ్మెల్యేల పైన క్రిమినల్ కేసులు ఉన్నట్టు ప్రకటించడంతో పాటు నేర చరిత్ర ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్ ప్రకారం అధికారికంగా పత్రికల్లో కేసుల వివరాలను ఆ పార్టీ అభ్యర్థులు వెల్లడించారు.

ధర్మపురి అరవింద్‌పై 17 కేసులు
రేవంత్ రెడ్డిపై 2018లో 42 క్రిమినల్ కేసులు ఉంటే 2023 ఎన్నికల సందర్భంగా దాఖాలు చేసిన అఫిడవిట్లో తనపై 89 కేసులు ఉన్నట్టు ప్రకటించారు. ఇక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై 2018లో 43 కేసులు ఉంటే 2023 నాటికి వాటి సంఖ్య 89కి మారింది. బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ పై గత ఎన్నికల్లో 6 కేసులు ఉంటే నాలుగు సంవత్సరాల్లో బండి సంజయ్‌పై 53 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం బండి సంజయ్‌పై 59 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మరో బిజెపి నేత ధర్మపురి అరవింద్‌పై గత ఎన్నికల్లో కేవలం ఒక్క కేసు మాత్రమే ఉండగా 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ధర్మపురి అరవింద్ పై ప్రస్తుతం 17 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావుపై గతంలో ఒక్క కేసు కూడా లేదు. ప్రస్తుత అఫిడవిట్ ప్రకారం రఘునందన్ రావు పై 27 క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈటల రాజేందర్‌పై గత ఎన్నికల్లో కేవలం 3 కేసులు ఉండగా ఈ ఎన్నికలకు వాటి సంఖ్య 40కు చేరింది.

బిఆర్‌ఎస్ అభ్యర్థులపై తగ్గిన కేసులు
అయితే, గత ఎన్నికలతో పోలిస్తే అధికార బిఆర్‌ఎస్ కి సంబంధించిన అభ్యర్థులపై మాత్రం క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. బిఆర్‌ఎస్ అభ్యర్థులకు సంబంధించి చాలామందిపై ఉన్న క్రిమినల్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే, 2018లో ఏర్పడిన ప్రజాప్రతినిధుల కోర్టులో ఎమ్మెల్యేల కేసుల విచారణ సందర్భంగా చాలా కేసులు వీగిపోవడం విశేషం. 2023 ఎన్నికల సందర్భంగా బిఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్లను పరిశీలిస్తే 119 నియోజకవర్గాల్లో 56 నియోజకవర్గాల అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే 2018 ఎన్నికల్లో 59 మంది బిఆర్‌ఎస్ అభ్యర్థులపై కేసులు ఉండేవి. 2023 నాటికి బిఆర్‌ఎస్ కు చెందిన 56 మంది అభ్యర్థులపై కేసులు ఉన్నట్టు బిఆర్‌ఎస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే గతంతో పోలిస్తే ఒక్కో అభ్యర్థిపై ఉన్న కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వచ్చింది.

గంగుల కమలాకర్‌పై 10 కేసులు
మంత్రి కెటిఆర్‌పై గతంలో 16 కేసులు పెండింగ్‌లో ఉండగా 2023 ప్రకారం ఏడు క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మంత్రి హరీష్ రావు పై గతంలో 39 కేసులు ఉండగా, తాజా అఫిడవిట్ ప్రకారం మంత్రి హరీష్ రావు పై కేవలం మూడు కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న బిఆర్‌ఎస్ అభ్యర్థులలో గంగుల కమలాకర్ పై 10 కేసులు, పాడి కౌశిక్ రెడ్డిపై 4, సబితా ఇంద్రారెడ్డిపై 5, సైదిరెడ్డిపై 5, ఎర్రబెల్లి దయాకర్ రావుపై 3 కేసులు, చల్లా ధర్మారెడ్డి పైన 4 కేసులు, నోముల భగత్ పై 3, పట్నం నరేందర్ రెడ్డి పై రెండు కేసులు, పైలట్ రోహిత్‌రెడ్డి పై రెండు కేసులు, దానం నాగేందర్ పై రెండు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలు బేఖాతరు
అయితే, క్రిమినల్ కేసులు ఉన్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వడంపై ఆయా పార్టీలు అధికారికంగా పత్రికా ముఖంగా తెలపాలని సుప్రీంకోర్టు గతంలో తీర్పునిచ్చింది. 2018 లోనే సుప్రీంకోర్టు దీనిపై ఆదేశాలు జారీ చేసింది. 2018 ఎన్నికలకు క్రిమినల్ కేసులో ప్రకటనపై పార్టీలు పెద్దగా పట్టించుకోనప్పటికీ 2023 ఎన్నికలకు మాత్రం ఎలక్షన్ కమిషన్ ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. దీంతో అధికారిక బిఆర్‌ఎస్ పార్టీ ఇప్పటికే తమ 56 మంది ఎమ్మెల్యేలపై ఉన్న కేసులు వివరాలను పత్రికాముఖంగా నవంబర్ 11వ తేదీన ప్రచురించింది. ఆ పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్ పేరుతో అభ్యర్థులపై ఉన్న క్రిమినల్ కేసుల వివరాలను ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News