Monday, December 23, 2024

అభ్యర్థులే నేరచరిత్ర తెలపాలి..పార్టీలు వివరణ ఇచ్చుకోవాలి

- Advertisement -
- Advertisement -

జైపూర్ : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నేరచరితను ముందుగానే పత్రికా ప్రకటనల ద్వారా బహిరంగ పర్చాలని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సిఇసి) రాజీవ్ కుమార్ తెలిపారు. ఈ ఏడాది చివరిలో అసెంబ్లీ ఎన్నికలు జరిగే రాజస్థాన్‌లో ఎన్నికల సన్నద్ధతను సమీక్షించేందుకు తమ బృందంతో ఇక్కడికి వచ్చిన సందర్భంగా ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియ మరింత పారదర్శకం, కళంకితుల రహితం చేసేందుకు ఎన్నికల సంఘం పాటుపడుతుందని తెలిపారు. ఎన్నికల బరిలోకి దిగే అభ్యర్థులు తమంతతాముగా బహిరంగంగా తమపై ఉన్న కేసులు ఇతరత్రా సమాచారాన్ని పొందుపర్చాల్సి ఉందన్నారు. ఇక నేరచరితులను రాజకీయ పార్టీలు అభ్యర్థులుగా ఎంచుకుంటే , ఎందుకు ఎంపిక చేశారనే కారణాలను సంబంధిత పార్టీలు వివరించాలని తెలిపారు. తప్పుడు అఫిడవిట్లు, కులాల విద్వేషప్రచారాలు, ఎన్నికలలో ధనం, మద్యం పంపిణీ వంటి వాటిని సహించేది లేదన్నారు. చట్టసభల్లోకి నేరచరితులు వచ్చి చేరకుండా చేసే విధంగా ఎన్నికల సంఘం పలు చర్యలు తీసుకుంటుంది.

ఇదే క్రమంలో ఇటువంటి వారు సభలలో ప్రవేశించకుండా చేసేందుకు రాజకీయ పార్టీలు కూడా నైతిక బాధ్యత తీసుకోవల్సి ఉంటుంది. వివాదాస్పద అభ్యర్థులు, క్రిమినల్ కేసులు ఉన్న వారిని అభ్యర్థులుగా తీసుకోవడం జరిగితే సంబంధిత పార్టీలు ప్రజలకు తగు వివరణ ఇచ్చుకోవల్సి ఉంటుంది. దీనివల్ల కళంకితుల చరిత్ర ముందుగానే ఓటర్లకు తెలుస్తుంది. కేసుల పూర్వాపరాల బహిరంగంగా ప్రకటించడం ద్వారా సదరు అభ్యర్థి, ఆయా పార్టీలు ఎన్నికల తరువాత కూడా ఓటర్లు అంటే ప్రజలకు తగు విధంగా జవాబుదారీ అయ్యేందుకువీలుంటుందని రాజీవ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా జరిగేందుకు, రాజస్థాన్‌లో ఓటింగ్ శాతం పెరిగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సిఇసి రాజీవ్ కుమార్ వెంబడి ఎన్నికల కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్‌లు రాష్ట్రంలో ఎన్నికల సంసిద్ధతను అధికారులతో భేటీ సందర్భంగా సమీక్షించారు.

వయోవృద్ధులకు , 40 శాతం అంతకు మించి అంగవైకల్యం ఉన్న వారికి ఇంటినుంచే ఓటేసే సౌకర్యం ఇక్కడ కల్పిస్తారు. సీనియర్ సిటిజన్లు తమ ఓటుఫ్రమ్ హోం అవకాశం గురించి ముందుగా ఆన్‌లైన్‌లో తెలియచేసుకోవల్సి ఉంటుంది. పోలింగ్ రోజున సిబ్బంది వెళ్లి అక్కడికక్కడ వారి నుంచి ఓటు తీసుకుంటారు. రాజస్థాన్‌లో మొత్తం 5.25 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 2.51 మంది పురుషులు, కాగా 2.51 కోట్ల మంది మహిళలు. ఈసారి ఎన్నికలలో 100 ఏండ్లు దాటిన వారు దాదాపు 19వేల మంది ఉన్నారు. 80 సంవత్సరాలు దాటిన వారు 11 లక్షల మంది వరకూ ఉన్నారు. తొలిసారి ఓటింగ్ హక్కు పొందిన వారి సంఖ్య 21.9 లక్షల వరకూ ఉందని సిఇసి తెలిపారు. పూర్తి స్థాయి ఎన్నికల సంఘం రాజస్థాన్‌లో పలు దఫాలుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడింది. రాజకీయ పార్టీల ప్రతినిధులతో కూడా మాట్లాడారు. ఓటరు చైతన్య సదస్సులలో కూడా పాల్గొన్నారు.

నిర్బంధ ఓటింగ్ ఆలోచన లేదు
ఎన్నికలలో ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేసేలా చేసే నిర్బంధ పద్ధతి తీసుకువచ్చే ప్రతిపాదన ఏదీ లేదని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచడానికి నిర్బంధ పద్థతి దారికాదని అభిప్రాయపడ్డారు. ఓటింగ్ శాతం పెంచేందుకు ఇతరత్రా విధానాలు పాటిస్తారని వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News