నిందితుల శాంపుల్స్ సేకరణకు అధికారం
నేర నిర్థారణకు అని ప్రభుత్వ వివరణ
రాజ్యాంగ వ్యతిరేకం ః ప్రతిపక్షం
న్యూఢిల్లీ : దేశంలోని భారతీయ శిక్షా స్మృతి సంబంధిత వ్యక్తుల గుర్తింపు బిల్లును కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఐపిసికి సవరణలు చేపట్టేందుకు ప్రభుత్వం సంకల్పించడం దారుణం, అన్యాయం, రాజ్యాంగ వ్యతిరేకమని సభలో ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ప్రభుత్వ ప్రతిపాదిత చట్ట సవరణలతో సంబంధిత అధికారులు ఏదైనా నేరం విషయంలో నిందితులు, నేరాలకు పాల్పడ్డారనే అభియోగాలు ఉన్న వ్యక్తుల భౌతిక లేదా శారీరక లక్షణాల శాంపుల్స్‌ను తీసుకునేందుకు వీలేర్పడుతుంది. ఈ మేరకు పోలీసులకు పూర్తి అధికారాలు సంక్రమిస్తాయి. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా తేనీ సభలో బిల్లును ప్రవేశపెట్టారు. నేరాల నిర్థారణకు ఇప్పుడు అందుబాటులో ఉన్న వివిధ శాస్త్రీయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను వాడుకోవడానికి ఈ సవరణలు అత్యవసరం అని, దీనిని ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. నేరం చేసిన వారెవరు అనేది సంబంధితుల శరీరాల కొలతలను బట్టి అంచనా వేయడానికి వీలేర్పడుతుంది. నేర నిర్థారణ జరిగి దోషులకు శిక్షలు పడితే మంచిదే కదా అని ప్రశ్నించారు.
బిల్లును ప్రతిపక్షాలకు చెందిన మనిష్ తివారీ, అధీర్ రంజన్ చౌదరి, సౌగతా రాయ్, ఎన్‌కె ప్రేమచంద్రన్ తప్పుపట్టారు. ఇటువంటి దుష్టమైన ఆలోచనలకు పాల్పడరాదని కేంద్రాన్ని హెచ్చరించారు. బిల్లు ప్రవేశపెట్టవచ్చా లేదా అనే అంశంపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దీనితో జరిగిన ఓటింగ్‌లో 120 మంది సభ్యులు సవరణ బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. వ్యతిరేకంగా 58 మంది నిలిచారు. దీనితో బిల్లు సభలో చర్చకు నోచుకుంది. బిల్లును మంత్రి అజయ్ మిశ్రా పూర్తిగా సమర్థిస్తూ ప్రిజనర్స్ ఐడెంటిఫికేషన్ యాక్ట్ 1920 నాటిదని, ఇప్పటివరకూ దీనిని అదే విధంగా ఉంచారని, దీనితో నేర నిర్థారణ ప్రక్రియలో జాప్యం ఏర్పడుతోందని, సైంటిఫిక్ విధానాలు అందుబాటులో ఉన్నా కేవలం ఇప్పుడు వేలిముద్రలు తీసుకోవడానికే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు.
అయితే సవరణల బిల్లు తీసుకురావడం రాజ్యాంగ వ్యతిరేకం అని, ఇది ఆర్టికల్ 20, ఆర్టికల్ 3, ఆర్టికల్ 21లకు విఘాతం కల్పిస్తుందని కాంగ్రెస్‌కు చెందిన తివారీ తెలిపారు. రాజ్యాంగంలోని నిర్ధేశిత అంశానికి సవరణలు ప్రతిపాదించడం చట్టసభల పరిధిలోకి రాదని చెప్పారు. ఏదైనా నేరానికి సంబంధించి నిందితుడు ఎవరైనా తనకు తాను వ్యతిరేక సాక్షం ఇచ్చుకునే బలవంతపు చర్యలు కుదరవని ఆర్టికల్ 20, ఆర్టికల్ 3 నిర్ధేశిస్తున్నాయని అన్నారు. ప్రభుత్వం ఈ సవరణల బిల్లు ద్వారా న్యాయానికి వ్యతిరేకంగా రాజ్యాంగానికి విఘాతంగా వ్యవహరిస్తోందన్నారు.