- Advertisement -
న్యూఢిల్లీ: క్రిమినల్ ప్రొసీజర్(ఐడెంటిఫికేషన్) బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ మంగళవారం ఆమోదముద్ర వేశారు. దోషులు, క్రిమినల్ కేసులలో నిందితుల శారీరక, జీవసంబంధ నమూనాలను పోలీసులు సేకరించే అధికారాలు ఈ చట్టం ద్వారా లభిస్తాయి. 1920 నాటి ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రిజనర్స్ యాక్ట్ స్థానంలో అమలులోకి వచ్చే ఈ బిల్లుకు ఏప్రిల్ 4న లోక్‌సభ, ఏప్రిల్ 6న రాజ్యసభ ఆమోదం తెలిపాయి. దోషులు, నిందితుల భౌతిక, జీవసంబంధమైన నమూనాలను పోలీసులు సేకరించే అధికారంతో పాటు ఒక నేరం జరిగినపుడు దర్యాప్తునకు సహకరించేందుకు అవసరమైన వ్యక్తుల ఫోటోలను, కొలతలను తీసుకోవాలని ఆదేశించే అధికారం సంబంధిత మెజిస్ట్రేట్‌కు ఈ చట్టం ద్వారా సంక్రమిస్తుంది. దోషి జైలు నుంచి విడుదలైన తర్వాత, నిందితుడు నిర్దోషిగా తేలిన తర్వాత సేకరించిన నమూనాలను ధ్వంపం చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తోంది.
- Advertisement -