Wednesday, January 22, 2025

నేరచరితులకేదీ అడ్డుకట్ట?

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరొందిన ఇండియాలో ఎన్నికలు రానురాను ప్రహసనంగా మారుతున్నాయి. అంగబలం, అర్థబలం ఉన్నవారే తప్ప పేదలు ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే పరిస్థితి మృగ్యమైపోతోంది. సమాజంలో గౌరవ ప్రతిష్ఠలు, మంచితనం, మానవత్వం, పదుగురికీ సాయం చేసే ఉన్నతగుణం.. ఇత్యాది మంచి లక్షణాలు ఉంటే చాలు, ఒకప్పుడు ఇట్టే గెలిచేవారు. కానీ, ఇప్పుడా పరిస్థితి లేదు. మంచిగుణాలు ఉన్నా లేకున్నా, ధారాళంగా ఖర్చుచేసే స్థోమత, ఎప్పుడూ వెన్నంటి ఉండే అనుచరగణం ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హతలుగా మారాయి. చట్టసభలకు ఎన్నికయ్యే వ్యక్తి సకల గుణాభిరాముడై ఉండాలనీ, పదిమందికీ మార్గదర్శకుడిగా నిలవాలనీ ఒకప్పుడు భావించేవారు. ఇప్పుడు దీనికీ నిర్వచనం మారిపోయింది.

హత్యలు, మానభంగాలు, ఇతర నేరపూరిత చర్యలతో సంబంధం ఉండి, కేసులు ఎదుర్కొంటున్నవారు కూడా నిస్సంకోచంగా పోటీ చేస్తున్నారు.. చట్టసభలకు ఎన్నికవుతున్నారు. కొత్తగా కొలువు తీరనున్న 18వ లోక్‌సభకు ఎన్నికైన 543 మంది సభ్యులలో దాదాపు సగం మంది.. 251మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్ (ఎడిఆర్) పేర్కొనడం ఆందోళన కలిగించే విషయం. ఇలాంటి నేరచరిత గలవారు గత లోక్ సభ లో 233 మంది ఉంటే, ఈ దఫా ఈ సంఖ్య మరికాస్త పెరగడం గమనార్హం. తాజాగా గెలిచిన లోక్‌సభ సభ్యులలో ఇద్దరిపై అత్యాచారం కేసులు, నలుగురు కిడ్నాపింగ్ కేసులలో నిందితులు కావడం గమనార్హం. కేవలం నేరచరిత గలవారే కాదు, ఈసారి ఎన్నికైనవారిలో 504 మంది కోట్లకు పడగలెత్తినవారేనట. ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా అందరికీ సమానావకాశాలు కల్పించేందుకు అభ్యర్థులు ఎన్నికల్లో చేసే ఖర్చుపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించినా ఆచరణలో అది అపహాస్యం పాలవుతోంది.

స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో లోక్‌సభ అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితి రూ. 25 వేలు కాగా, ప్రస్తుతం అది రూ. 95 లక్షలకు చేరింది. ఈ ఖర్చుకు పరిమితమై ప్రచారపర్వాన్ని కొనసాగించి, విజయావకాశాలు అందుకునే అభ్యర్థులు ఉంటారా అనేది సందేహమే. గడచిన లోక్‌సభలో ఆర్థిక మంత్రిగా సేవలందించిన నిర్మలా సీతారామన్ ఇటీవల ఒక సందర్భంలో.. ఎన్నికల్లో పోటీ చేసేందుకు తన వద్ద డబ్బు లేదని తేల్చి చెప్పారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీలు సుమారు 55 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయని ఓ స్వచ్ఛంద సంస్థ జరిపిన పరిశీలనలో తేలడం డబ్బుకు, ఎన్నికలకు అవినాభావ సంబంధం ఉన్నదని తేటతెల్లం చేస్తోంది. ఎన్నికల సమయంలో అభ్యర్థుల తరఫున డబ్బు పంచిపెడుతూ పట్టుబడితే, ఐపిసి సెక్షన్ 171 ప్రకారం ఏడాది వరకూ జైలు శిక్షపడే అవకాశం ఉంటుంది. కానీ, ఏ అభ్యర్థి తరఫున డబ్బు పంచుతున్నారో, ఆ అభ్యర్థిపై కూడా కేసు పెడితేనే ఈ అరాచకానికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. కానీ, చట్టంలో ఇలాంటి నిబంధన ఉన్నట్లు కనిపించదు.

చట్టసభల్లో నేరచరితులు అడుగుపెట్టకుండా ఉండాలనే సదుద్దేశంతో రూపొందిన ప్రజాప్రాతినిథ్య చట్టంలోని సెక్షన్ 8 (3) ప్రకారం ఒక వ్యక్తి నేరం చేసినట్లు నిర్థారణై, రెండేళ్లకు పైబడి శిక్ష పడితే సదరు వ్యక్తి జైలు నుంచి విడుదలైన తేదీ నుంచి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హుడవుతాడు. అయితే చట్టం కట్టుదిట్టంగా ఉన్నా, సత్వర న్యాయం అందడంలో ఏళ్లూపూళ్లూ పడుతున్న నేపథ్యంలో, నేరాలు చేసినా ‘శిక్ష పడినప్పుడు చూద్దాంలే’ అనే ధోరణిలో నిస్సిగ్గుగా చట్టసభలకు పోటీ చేసే ప్రబుద్ధులు ఎక్కువయ్యారు. ఈ లోపాన్ని నివారించేందుకు ఎంపిలు, ఎంఎల్‌ఎలపై నమోదైన కేసులపై వేగిరం విచారణ జరిపేందుకు వీలుగా ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలంటూ ఏడేళ్ల కిందట సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. చట్టసభలలోకి నేర చరితులు అడుగుపెట్టకుండా అడ్డుకునే పని ఒక్క రాజ్యాంగ సంస్థలకు మాత్రమే అప్పగిస్తే చాలదు, అమూల్యమైన తమ ఓటు హక్కు ద్వారా వారిని చట్టసభలకు పంపిస్తున్న ప్రజలకూ ఇందులో భాగస్వామ్యం ఉంది. సామ దాన భేద దండోపాయాలతో ఎన్నికల్లో నెగ్గాలని ఆశించే రాజకీయ నాయకులు విసిరే తాయిలాలకు ఆశపడే అమాయక జనంలో మార్పు రావాలి. వివేకంతో, విచక్షణతో ఓటు వేసి, నేరచరితులు అడుగుపెట్టకుండా చట్టసభలను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత ఓటర్లపైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News