చాలా మంది ఘరానా నేరస్థులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశంలో తీవ్ర నేరాలు చేసి విదేశాలకు పారిపోయారు. వారిని దేశానికి రప్పించడం అన్నది ప్రభుత్వానికి తలకు మించిన భారం. అయినా వారిలో చాలా మందిని ప్రభుత్వం రప్పించి శిక్షలు అమలు చేసింది. తాజాగా గురువారం తహవ్వూర్ హుసైన్ రాణా అనే నేరస్థుడిని రప్పించింది. ఇంత వరకు విదేశాలు అప్పగించిన ఘరానా నేరస్థులెవరో చూద్దాం..
అబూ సలెం(2005)
1993 బాంబే బాంబుల పేలుడు కేసులో అబూ సలెంను 2005 నవంబర్‌లో పోర్చుగల్ నుంచి భారత్‌కు రప్పించారు. అనేక చట్టపరమైన చర్చల అనంతరం ఆయనని రప్పించారు. అయితే ఆయనకి మరణశిక్ష, 25 ఏళ్లకు మించి జీవిత ఖైదు విధించబోమని భారత్ హామీ ఇచ్చాకే ఆయన అప్పగింత జరిగింది.
జతేదార్ జగ్తార్ సింగ్ తారా(2015)
పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో నిందితుడైన జతేదార్ జగ్తార్ సింగ్ తారాను 2015 జనవరిలో థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆయన బురైల్ మోడల్ జైలులో జీవిత ఖైదు శిక్షను అనుభవిస్తున్నారు.
క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్(2018)
బ్రిటిష్‌ఇటాలియన్ సంస్థ అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో జరిగిన ఓ ప్రధాన హెలికాప్టర్ ఒప్పందానికి సంబంధించి క్రిస్టియన్ జేమ్స్ మైఖేల్, భారత అధికారులకు లంచాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆయనని 2018లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యుఏఈ) నుంచి రప్పించారు. అప్పటి నుంచి ఆయన కస్టడీలోనే ఉన్నారు.
రాజీవ్ సక్సేనా(2019)
రూ. 3600 కోట్ల వివిఐపి హెలికాప్టర్ ఒప్పందం కేసులో మనీలాండరింగ్, బ్యాంక్ మోసంకు పాల్పడినందుకు దుబాయ్‌లోని వ్యాపారి రాజీవ్ సక్సేనాను అరెస్టు చేశారు. క్రిస్టియన్ మైఖేల్‌తో పాటు నిందితుడైన రాజీవ్ సక్సేనాను ఈడి 2019 జనవరిలో అరెస్టు చేసింది. ఈడి అరెస్టు చేయకముందే ఆయనని యుఎఈ డిపోర్ట్ చేసింది.
రవి పుజారి(2020)
పరారీ నేరస్థుడు రవి పుజారిని ఫ్రాన్స్ గుండా సెనెగల్ నుంచి బెంగళూరుకు 2020 జనవరిలో రప్పించారు. 97 కేసులలో ముద్దాయి అయిన ఆయనను బెంగళూరు సెంట్రల్ జైలులో ఉంచారు. హత్యలు మొదలుకుని అక్రమ వసూళ్ల కేసుల వరకు అనేక కేసులు ఆయనపై ఉన్నాయి.
తహవ్వూర్ హుస్సేన్ రాణా(2025)
ముంబై ఉగ్రదాడుల కేసులో నిందితుడైన తహవ్వూర్ రాణా(64)ను గురువారం అమెరికా నుంచి ఇండియాకు విజయవంతంగా రప్పించారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం సాయంత్రం 6.30కు ఆయన దిగారు. 26/11 దాడులలో ఆయన కీలక నిందితుడు. ఇండియాకు అప్పగించొద్దంటూ ఆయన చివరి వరకు చేసిన న్యాయపోరాటం విఫలం కావడంతో జాతీయ పరిశోధన సంస్థ, పరిశోధన, విశ్లేషన విభాగం బృందం ఆయనను తీసుకొచ్చింది. ఢిల్లీలోని పాటియాల హౌస్ కోర్టు బయట భద్రత పెంచారు.
ఆయనను త్వరలో కోర్టులో ప్రవేశపెడతామని అధికారులు తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదులు 2008 నవంబర్ 26న రైల్వే స్టేషన్, రెండు లగ్జరీ హోటళ్లలో విధ్వంసదాడులకు పాల్పడ్డారన్నది తెలిసిన విషయమే. పాకిస్థానీ ఉగ్రవాదులు అరేబియా సముద్రం గుండా ముంబైలోకి చొరబడి దాదాపు 166 మందిని చంపేశారు. దాదాపు 60 గంటలపాటు తెగించి దాడులు చేశారు. ఈ దాడి ప్రధాన కుట్రదారు డేవిడ్ కోల్‌మన్ హెడ్లీ అలియాస్ దావుద్ గిలానీ అనే అమెరికా పౌరుడితో రాణాకు సంబంధాలున్నాయి.