Wednesday, January 8, 2025

సంక్షోభాల సుడిగుండంలో పాక్

- Advertisement -
- Advertisement -

ఉగ్రవాద కార్యకలాపాలు, రాజకీయ ఘర్షణలు, మతపరమైన హింసాకాండతో దాయాది దేశం పాకిస్తాన్ అతలాకుతలమవుతోంది. మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన దేశాన్ని ఎలా గట్టెక్కించాలో తెలియక అధికారంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వం తలపట్టుకుంటోంది. ఒకవైపు దేశంలోని కొన్ని ప్రాంతాల్లో షియా- సున్నీల ఘర్షణలు తీవ్రతరమవుతున్నాయి. పది రోజుల క్రితం ఖైబర్ పంఖ్తూన్ ఖ్వా రాష్ట్రంలోని కుర్రంలో తలెత్తిన షియా- సున్నీ ఘర్షణలు 150 మందిని బలిగొన్నాయి. మరోవైపు బలూచిస్థాన్‌లో చైనా- పాకిస్తాన్ కారిడార్‌పై వేర్పాటువాదుల దాడులు ఉధృతమవుతున్నాయి.ఇక ఉగ్రవాదుల దాడులు ఉండనే ఉన్నాయి.

గోరుచుట్టుపై రోకటిపోటులా మాజీ ప్రధాని, ఒకప్పటి క్రికెట్ స్టార్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్తాన్ తెహ్రీక్- ఏ- ఇన్సాఫ్ (పిటిఐ) పార్టీ మద్దతుదారులు చీటికీమాటికీ చేపడుతున్న నిరసనలు ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. గత ఏడాదిన్నరగా ఇమ్రాన్ జైలులోనే ఉన్నారు. ఆయనపై దాదాపు 150కి పైగా కేసులు విచారణలో ఉన్నాయి. వాటిలో కొన్నింటి లో నేరం నిరూపితమై గత ఏడాది మేనుంచి ఆడియాలా జైలులోనే మగ్గుతున్నారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ జైలునుంచే ఇచ్చిన లాంగ్ మార్చ్ పిలుపునకు స్పందించిన కార్యకర్తలు దేశ రాజధాని ఇస్లామాబాద్ ముట్టడికి భారీయెత్తున తరలివచ్చారు.

ఇమ్రాన్ మూడో భార్య బుష్రా బీబీ నాయకత్వంలో ఇస్లామాబాద్‌కు తరలివచ్చిన వేలాది కార్యకర్తలను అడ్డుకోవడం పోలీసులకు చేతగాకపోవడంతో ప్రభుత్వం సైన్యాన్ని రంగంలోకి దింపింది. ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడంతోపాటు రాజధాని నగరాన్ని షట్‌డౌన్ చేసింది. అయినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సైన్యం జరిపిన కాల్పుల్లో పదిమంది వరకూ పిటిఐ కార్యకర్తలు మరణించారు. వందలాదిమంది గాయపడ్డారు. దేశ రాజధానిలో నిరసన ప్రదర్శనలు చేపట్టరాదన్న చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఇమ్రాన్ దంపతులతోపాటు వందలాది కార్యకర్తలపై ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్లు ప్రభుత్వం అభియోగాలు మోపడం తాజా పరిణామం. ఈ ఆరోపణలు రుజువైతే ఇప్పటికే జైలులో మగ్గుతున్న ఇమ్రాన్, ఆయన సతీమణి కటకటాలకే పరిమితమయ్యే ప్రమాదం లేకపోలేదు. పొరుగు దేశంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, పలు సందర్భాల్లో పిటిఐ భారీస్థాయిలో నిరసనలు చేపడుతూ ప్రభుత్వాన్ని చీకాకు పెడుతూనే ఉంది. పాక్ సైన్యానికి, అమెరికాకు కంటగింపుగా మారి, పదవీచ్యుతుడైన ఇమ్రాన్‌కు ఇప్పటికీ స్వదేశంలో విపరీతమైన జనాదరణ ఉంది. ఇదే ప్రస్తుత ప్రభుత్వానికి కంటిమీద నిద్ర లేకుండా చేస్తోంది.

ఇమ్రాన్ జైలునుంచి బయటికొస్తే మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకోవడం ఖాయమన్న భయంతో ఆయనను జైలులోనే ఉంచేందుకు ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నిస్తోంది. ప్రపంచీకరణను అందిపుచ్చుకుని భారత్, చైనా, బంగ్లాదేశ్ అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తే, పాకిస్తాన్ మాత్రం ఈ రేసులో వెనుకబడింది. పదవులను కాపాడుకునేందుకు భారతదేశంపై అక్కసు వెళ్లగక్కుతూ, ఉగ్రవాదులకు అండదండలు అందిస్తూ తనకు తానే గోతులు తవ్వుకుంది. నాలుగేళ్లుగా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయి విలవిల్లాడుతున్న పాకిస్తాన్‌కు రాజకీయ అస్థిరత పెనుశాపంగా పరిణమించింది. దాయాది దేశంలో ప్రజలు నిత్యావసర సరకులు సైతం దొరక్క ఆకలితో అల్లాడుతున్నారు.

పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. అందిన చోటల్లా ప్రభుత్వం అప్పులు చేస్తోంది. గత ఏడాది దివాలాకు చేరువకావడంతో అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి మూడు బిలియన్ డాలర్ల ఆర్థిక సాయం పొంది, అప్పటికి గండం నుంచి గట్టెక్కగలిగింది. తాజాగా మరో ఏడు బిలియన్ డాలర్లకోసం దేహీఅనడంతో ఐఎంఎఫ్ అనేక షరతులు విధించింది. ఫలితంగా పాలనాపరమైన వ్యయాలను తగ్గించుకోవడంలో భాగంగా లక్షన్నర ఉద్యోగాలకు కోత పెట్టకతప్పలేదు. చివరకు మంత్రిత్వశాఖలను సైతం విలీనం చేసుకోవలసిన దుస్థితి దాపురించింది.

ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితిని గట్టెక్కించేందుకు తంటాలు పడుతున్న ప్రభుత్వానికి ఇమ్రాన్ పార్టీ నుంచి ఎదురవుతున్న రాజకీయ నిరసనలు తలనొప్పిగా పరిణమిస్తున్నాయి. సైనిక కుట్రలకు వెరచి, ఇతర అగ్రనేతల మాదిరి దేశాన్ని వదిలి పారిపోకుండా జైలు నుంచే పోరాట పటిమ కనబరుస్తున్నందుకు ఇమ్రాన్‌ను అభినందించవలసిందే. అయితే దేశం సంక్షోభంలో కూరుకుపోయిన వేళ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేవిధంగా కార్యకర్తలను రెచ్చగొడుతూ, అశాంతికి, అల్లర్లకు ఆజ్యం పోస్తున్నారనే విమర్శలు ఆయనపై వెల్లువెత్తుతున్నాయి. ఆర్థిక సంక్షోభంనుంచి గట్టెక్కాలన్నా, రాజకీయ అస్థిరతను చల్లార్చాలన్నా సైన్యం, ప్రభుత్వం ఒక తాటిమీదకు వచ్చి, విపక్ష పార్టీ ప్రతినిధులతో చర్చలు జరిపి, దేశం కుదుటపడేందుకు ఒక నిర్ణయానికి రావలసిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News