కొలంబో : శ్రీలంక తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోవడంలో తమ తప్పిదాలు కూడా ఉన్నాయని ఆ దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స అంగీకరించారు. కొన్ని దశాబ్దాలుగా చేసిన తప్పిదాల వల్లనే దేశం ప్రస్తుతం తీవ్ర సంక్షోభాలను ఎదుర్కొంటోందని అన్నారు. అయితే గతంలో చేసిన తప్పులను సరిదిద్దుకొన్ని దేశాన్ని సంక్షోభం నుంచి బయటపడేసేందకు తమ కుటుంబం కృషి చేస్తోందని భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ ఆందోళనలు ఉద్ధృతమైన నేపథ్యంలో కొత్త కేబినెట్ ఏర్పాటు సందర్భంగా అధ్యక్షుడు గొటబయ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘ ఆర్థిక సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితికి నేను చాలా చింతిస్తున్నా. నిత్యావసర వస్తువుల కోసం ప్రజలు పడిగాపులు పడుతూ తీవ్ర ఆగ్రహానికి లోనవుతున్నారు. ధరల పెరుగుదలపై మండిపడుతున్నారు.
వారి కోసం ఆందోళనలు సమంజసమైనవే. అయితే రెండున్నరేళ్లుగా మనకు ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయి. కరోనా మహమ్మారితోపాటు , రుణభారం వంటి సమస్యలు తీవ్రమయ్యాయి. దీనికి తోడు మావైపు కూడా తప్పిదాలు జరిగాయి’ అని శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స పేర్కొన్నారు. రాబోయే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ముందుగానే అంతర్జాతీయ ద్రవ్యనిధిని సంప్రదించి సహాయం పొందాల్సి ఉండాల్సింది. వీటితోపాటు వ్యవసాయాన్ని పూర్తిగా సేంద్రీయంగా మార్చే ప్రయత్నంలో రసాయన ఎరువులను నిషేధించకుండా ఉండాల్సింది. దేశంలో క్షీణిస్తోన్న విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడే లక్షంతో చేసిన ఎరువుల నిషేధం రైతులను తీవ్రంగా దెబ్బతీసింది.’ అని గొటబయ చెప్పుకొచ్చారు. ఇలా ఇప్పటివరకు జరిగిన తప్పిదాలను సరిదిద్దుకొన్ని ముందుకు వెళ్లాల్సి ఉందన్న ఆయన … తద్వారా ప్రజల విశ్వాసాన్ని మళ్లీ పొందాల్సిన అవసరం ఉందని కేబినెట్ మంత్రులతో అభిప్రాయపడ్డారు.