శివసేన ప్రతిక సామ్నా
ముంబయి: మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంపై రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్రం నిందలు మోపుతోందని శివసేన మండిపడింది. ప్రధాని మోడీసహా కేంద్రమంత్రులు, బిజెపి నేతలు ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో వేలాదిమందితో భారీ బహిరంగ సభలు, రోడ్‌షోలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించింది. శివసేన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో బిజెపి నేతలపై విమర్శలు గుప్పించింది. ముంబయిలో సబర్బన్ రైళ్లు నడపడాన్ని ఎలా తప్పు పడ్తారని సామ్నా ప్రశ్నించింది. ప్రజలు తమ ఉపాధి కోసం, ఉద్యోగాల కోసం రైళ్లలో ప్రయాణిస్తున్నారని పేర్కొన్నది.
ప్రధాని, హోంమంత్రిలాంటివారు పెద్ద సంఖ్యలో జన సమీకరణ చేస్తున్నపుడు, సామాన్య ప్రజలకు తమ జీవనోపాధి పొందే స్వేచ్ఛ కూడా లేదా అని సామ్నా ఘాటుగా ప్రశ్నించింది. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రం తమ రాష్ట్రానికి అందించిన తోడ్పాటు ఏమిటని ప్రశ్నించింది. కొవిడ్19 కేసులు అధికంగా నమోదవుతున్న థానే, నాసిక్‌లాంటి పలు నగరాల్లో ఇప్పటికే పాక్షిక లాక్‌డౌన్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని సామ్నా గుర్తు చేసింది.