మన తెలంగాణ / హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై విమర్శలు చేస్తే వార్తలో నిలుస్తామని బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని టిపిసిసి ఉపాధ్యక్షులు శోభారాణి అన్నారు. బిఆర్‌ఎస్ అధికారంలోకి రావడమన్నది కల అని, బిఆర్‌ఎస్ దుకాణంబంద్ అయ్యిందని అన్నారు. మంగళవారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో శోభారాణి మాట్లాడారు. అధికార పక్షానికి, ప్రతిపక్షానికి తేడా తెలియకుండా బిఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతున్నారని ఆమె విమర్శించారు.
ప్రధాని ఎవరైనా రాష్ట్రాలకి పెద్దన్న పాత్ర పోసించాల్సిందేనని, బిఆర్‌ఎస్ నేతలని కాపాడుకునే పనిలో కెసిఆర్ ఉన్నారన్నారు. మా ముఖ్యమంత్రి పై విమర్శలు చేస్తే తాట తీస్తా మని ఆమె హెచ్చరించారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు వస్తుంటే బిఆర్‌ఎస్ పార్టీ నేతలకి కడుపు మంట అని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 30 వేల మంది కి ఉద్యోగాలు ఇచ్చిందని, కెసిఆర్ వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగాలు కల్పించుకున్నారు తప్ప నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. జీఓ నంబర్ 3 గురించి తెలియకుండా కవిత మాట్లాడుతోందని, జీఓ నంబర్ 3 పై అనుమానాలు ఉంటే కెసిఆర్ దగ్గరకి వెళ్లి ధర్నా చేయాలని ఆమె కవితను కోరారు.