ఎన్‌డిఎ అంటే నో డేటా అవలైబుల్
బడ్జెట్‌లో భ్రమలు , అంకెలగారడీలు
లోక్‌సభలో శశిథరూర్ విమర్శ …
న్యూఢిల్లీ : కేంద్రంలోని మోడీ ప్రభుత్వ తీరు తెన్ను పూర్తిగా కిస్కా సాథ్ ఔర్ కిస్కా వికాస్ ( ఎవరికి తోడు? ఎవరికి లాభం ) అనే విధంగా సాగుతోందని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ఎన్‌డిఎ అంటే నో డేటా అవలైబుల్ అని చురకలు పెట్టారు. మోడీ ప్రభుత్వ నినాదం సబ్ కా సాథ్ సబ్‌కా వికాస్‌పై విమర్శలకు దిగింది. ఇటీవలి కేంద్ర బడ్జెట్ ఎండమావి, అద్దాల మేడలాగా భ్రమలు కల్పించేదిగా ఉందని బడ్జెట్‌పై చర్చను ప్రారంభిస్తూ కాంగ్రెస్ నేత శశిథరూర్ విమర్శించారు. పూర్తిగా మాటలు తప్పితే చేతలు ఏమీ లేని బాపతు బడ్జెట్ సమర్పణల ప్రభుత్వం ఇదేనని తెలిపారు.
పలు రంగాలలో ఎంతో జరిగిందని పదే పదే చెప్పడం, బడ్జెట్‌లో అంకెల భ్రమలు కల్పించడం తప్పితే వాస్తవికంగా జరిగిందేమీ లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను తూర్పారపట్టారు. పేదరికం, వినిమయం ఇతర కీలక విషయాలలో ప్రభుత్వం వద్ద ఎటువంటి వాస్తవిక గణాంక సమాచారం లేదని స్పష్టం చేశారు. నిర్మల సీతారామన్ జిడిపిని పాలన, ప్రగతి, పనితీరుగా పేర్కొనడాన్ని థరూర్ ప్రస్తావించారు. ఇప్పుడు ఈ జిడిపి అర్థం మారింది. జి అంటే ప్రభుత్వ జోక్యం , పన్నుల ఉగ్రవాదం, జనాభాపరమైన ద్రోహం , పేదరిక కొనసాగింపు అని థరూర్ చెప్పారు.
దేశంలో నిరుద్యోగ సంక్షోభం,కె షేప్డ్ అభివృద్ధి , పేద సంపన్నుల నడుమ పెరుగుతూనే ఉన్న వ్యత్యాసాలు నడుమ జనం చితికిపోతున్నారని విమర్శించారు. నిజం చెప్పాలంటే దేశ ప్రజలు 2014 ఎన్నికలలో బిజెపి వల్లించిన సబ్‌కా సాథ్ సబ్‌కా వికాస్‌ను బాగా నమ్మారు. మార్పు జరుగుతుందని తీర్పు వెలువరించారు. భారతీయులందరికి సమ్మిశ్రిత ప్రగతి ఫలాలు అందిస్తామని నమ్మబలికార. ఇదంతా కూడా భ్రమలు కల్పించే వాతావరణం తప్పితే ఏమీ లేదని చెప్పారు. గత పది సంవత్సరాలుగా దేశ ప్రజలు అనేక విధాలుగా మోసపోతూ వచ్చారు.
ఇది విషాదకరం, ఆర్థిక నిర్వహణ లోపాలతో భారత ప్రజలు విస్తృతస్థాయిలో నిరాశ నిస్పృహలు , కష్టాలు, తక్కువ ఆదాయం, పెరిగిన నిరుద్యోగం వంటి బాధలతో సతమతమవుతున్నారని తెలిపారు. ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో కొత్త కులాలను ప్రస్తావించినట్లుగా ఉందని , పేదలు , యువత, మహిళలు, రైతులు అన్నారు. వీరి అభ్యున్నతికి పాటుపడుతున్నామని చెప్పారని, నిజానికి ఈ నాలుగు వర్గాలు ప్రభుత్వం ఎంచుకున్న సామాజిక ఆర్థిక విధానాల పరిధిలో అత్యంత దారుణంగా నష్టపోయినవారే అన్నారు.