చెన్నై: వరుస ఓటములతో సతమతమవుతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై సోషల్ మీడియా వేదికగా విమర్శల వర్షం కురుస్తోంది. ఈ సీజన్లో ఆడిన మూడు మ్యాచుల్లోనూ వార్నర్ సేన ఓటమి పాలైన విషయం తెలిసిందే. స్వల్ప లక్ష్యాన్ని సయితం ఛేదించలేక హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ దారుణంగా విఫలం కావడంతో చివరి రెండు మ్యాచుల్లో గెలిచే స్థితిలో ఉండి పరాజయం పాలుకాక తప్పలేదు.
వరుస వైఫల్యాలు చవిచూస్తున్నా ప్రధాన కోచ్‌లు, మెంటర్, కెప్టెన్ వార్నర్ తదితరులు ఈ విషయంపై దృష్టి సారించక పోవడంపై పలువురు మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కిందటి మ్యాచ్‌లో చివరి వరకు క్రీజులో ఉండి జట్టును గెలిపించాల్సిన కెప్టెన్ వార్నర్ మధ్యలోనే పెవిలియన్ బాట పట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక సీనియర్ బ్యాట్స్‌మెన్ మనీష్ పాండేను తుది జట్టు నుంచి తప్పించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.
జట్టును గెలిపించే మాట అటుంచి చెత్త బ్యాటింగ్‌తో జట్టును ఓటమి అంచుల్లోకి నెడుతున్నాడని మనీష్‌పై విమర్శలు వస్తున్నాయి. ఇక సీనియర్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్‌ను ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడించక పోవడాన్ని కూడా నెటిజన్లు, మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. కేన్ జట్టులో ఉంటే పరిస్థితులు మరో విధంగా ఉంటాయని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా జట్టు కోచ్, మెంటర్, కెప్టెన్ తదితరులు బ్యాటింగ్ వైఫల్యలపై లోతుగా దృష్టి సారించి యువ ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలని వారు సూచిస్తున్నారు.