మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో గత రెండురోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానల వలన నారా య ణపేట, కామారెడ్డి, నిజామాబాద్, నాగర్ కర్నూల్, యాదాద్రి, సిద్దిపేట జిల్లాలలో పంటనష్టం జరిగినట్లు ప్రాథమిక నివేది కలు అందాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దాదాపు 2200 ఎకరాల వరకు వరి, మొక్కజొన్న, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా అంచనా వేసినట్లు పేర్కొన్నారు. పంటనష్టం సంభవించిన ప్రాంతాలను వెంటనే సందర్శించి పూర్తిస్థాయి రైతువారీ పంటనష్టం వివరాలు సేకరించాలని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు.
అంతేకాకుండా వరిపంట కోతలు ఊపందుకున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఇలాంటి అకాలవర్షాలు సంభవించే సందర్భంలో పంటనష్టాన్ని తగ్గించే విధంగా ముందుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో రైతులకు సూచించాలని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో సంబంధిత జిల్లాస్థాయి అధికారులు సమన్వయం చేసుకుంటూ.. మార్కెట్లకు, సెంటర్లకు వచ్చిన వరి ధాన్యం. ఇతర పంటలు తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ఇప్పటికే 2 లక్షలకుపైగా టార్పలిన్ కవర్లను రైతులకు అందుబాటులో ఉంచినట్లు మంత్రి తుమ్మల తెలిపారు.