Sunday, September 22, 2024

50వేల ఎకరాల్లో నష్టం!

- Advertisement -
- Advertisement -

Crop Damage in 50 thousand acres!

అకాల వానలతో అధికంగా దెబ్బతిన్న మిరప, మొక్కజొన్న పంటలు
పూర్తిస్థాయి నివేదికలు అందాకే పరిహారంపై నిర్ణయం

మనతెలంగాణ/ హైదరాబాద్ : అకాల వర్షాలు , వడగండ్ల వానలతో వ్యవసాయ రంగానికి జరిగిన నష్టాలపై ప్రభుత్వం దృష్టి సారిచింది. జిల్లాల వారీగా , పంటల వారీగా జరిగిన నష్టాలను సమగ్రంగా అంచనాలు వేసి నివేదికలు పంపాలని ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లకు మౌఖికంగా ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి కెసిఆర్ స్వయంగా పంట నష్టాల పరిశీలనకు వెళ్లాల్సివుండగా , అందుకు వీలు కాకపోవటంతో సిఎం ఆదేశాల మేరకు మంత్రుల బృందం మంగళవారం నాడు వరంగల్ జిల్లాలో పర్యటించింది. ఆకస్మిక వర్షాలు , వడగండ్ల వానలకు దెబ్బ తిన్న పంటలను మంత్రుల బృందం పరిశీలించింది. అరుగాలం శ్రమించి సాగు చేసిన పంటలు చేతికి అందుతున్న సమయంలో నీటి పాలు కావటం పట్ల రైతుల ఆవేదనను మంత్రుల బృందం కళ్లారా చూసి చలించి పోయింది. ప్రకృతి వైపరిత్యాల వల్ల పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభు త్వం అండగా నిలిచి అదుకుంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి దయాకర్ రావు వరంగల్ రైతులకు హామి ఇచ్చి రైతులను ఓదార్చే ప్రయత్నం చేశారు.

పంట నష్టాలు ఒక్క వరంగల్ జిల్లాకే పరిమింతం కాలే దు. రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లోనూ చోటు చేసుకున్నాయి. ఇప్పటికేవ్యవసాయ శాఖ పంట నష్టాలపై ప్రాధమిక అంచనాలు వేసింది. రాష్ట్రంలో వ్యవసాయ శాఖ అందించిన నివేదికల ప్రకారం రాష్ట్రంలో అన్ని రకాల పంటలు కలిపి సుమారు 50వేల ఎకరాలకు పైగానే పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ నష్టం ఇంకా అధికంగానే ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రకృతి వైపరిత్యాల ప్రభాంతో పంటలు దెబ్బతింటే జరిగిన నష్టం 33శాతానికి మించితేనే అటువంటి పంటలకు నష్టం జరిగినట్టు అధికారులు నమోదు చేస్తున్నారు. అకాల వర్షాలకు పంటలు దెబ్బతింటే అవి తిరిగి కోలుకునే అవకాశాలు ఉంటాయని అటువంటి వాటిని పంట నష్టాల జాబితాలో చేర్చబోమని అధికారులు వెల్లడించారు. పంట నష్టం 33శాతానికి మించిన వాటినే పంటనష్టం జాబితాకెక్కిస్తున్నారు. ప్రాధమిక అంచనాలు కాకుండా జిల్లాల వారీగా క్షేత్ర స్థాయిలో పర్యటనలు జరిపి పంట నష్టాలను సమగ్రంగా నిర్వహించి నివేదికలు అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది.

అధికారుల సమాచారం మేరకు రాష్ట్రంలోని ఉమ్మడి వరంగల్ జిల్లాలో అత్యధికంగా పంట నష్టం జరిగింది. ఈ జిల్లాలో 42వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. అందులో మిరప, మొక్కజొన్న , పసుపు తదితర పంటలు దెబ్బతిన్నాయి. అయితే జరిగిన పంటనష్టంలో 33శాతం పైగా నష్టపోయిన పంటల విస్తీర్ణం ఎంత అన్నది క్షేత్ర స్థాయిలో పరిశీలన అనంతరం నిర్ధారించనున్నట్టు అధికారులు వెల్లడించారు. అదే విధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా అకాల వర్షాలు , వడగండ్ల వానల వల్ల భారీగానే పంటలు దెబ్బతిన్నాయి. ఈ జిల్లాలో 25వేల ఎకరాలకు పైగా పంటలకు నష్టం వాటిల్లినట్టు రైతు సంఘాలు చెబుతున్నాయి. అందులో 10వేల ఎకరాల్లో మిరప పంటకు నష్టం వాటిల్లినట్టు చెబుతున్నారు. ఈ జిల్లాలో పండ్లతోటలకు కూడా భారీగానే నష్టం వాటిల్లిందని ఉద్యాన శాఖ అధికారులు వెల్లడించారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించాకే పంట నష్టాలపై సమగ్ర నివేదిక రూపొందించనున్నట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మొక్కజొన్న , ఉల్లి, ఆముదం , ఆవాలు , ఎర్రజోన్న తదితర పంటలకు నష్టం వాటిల్లినట్టు సమాచారం .

ఈ జిల్లాలో పంట నష్టాలపై అధికారులు సర్వేలు నిర్వహిస్తున్నారు. మిగిలిన జిల్లాల్లో కూడా వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులు పంట నష్టాలపై సమగ్ర సర్వేలు చేపట్టారు. మరో రెండు మూడు రోజుల్ల పూర్తి స్థాయిలో నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందజేసేందుకు చర్యలు చేపట్టారు

పంటనష్టాలపై ప్రభుత్వం భరోసా

రాష్ట్రంలో ప్రకృతి వైపరిత్యాల కారణంగా పంటలు నష్టపోయిన రైతులను అన్నివిధాల ఆదుకుంటామని ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. అన్ని జిల్లాల నుంచి పంట నష్టాలపై సమగ్ర నివేదికలు అందకా జరిగిన నష్టం ఎంత అన్నది తేల్చనున్నారు.పంటలు నష్టపోయిన రైతులను ఏవిధంగా ఆదుకోవాలి , ప్రభుత్వం నుంచి ఏవిధమైన సాయం అందించాలి , ఏ రూపంలో సాయం అందించాలి, తద్వారా ప్రభుత్వ ఖజానాపై పడే భారం ఎంత అన్నదానిపై ప్రభుత్వం ఉన్నత స్థాయిలో ఒక నిర్ణయానికి రానుందని అధికారులు చెబుతున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News