Monday, January 20, 2025

కన్నీరు మిగిల్చిన మిచౌంగ్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/భద్రాద్రికొత్తగూడెం/బోనకల్/చింతలపాలెం/ ములకలపల్లి: అకస్మాత్తుగా ముంచుకువచ్చిన మిచౌంగ్ తుఫాన్ కారణంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేని వ ర్షం కారణంగా వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో పలు చోట్ల వంతెనలు తెగిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం క లిగింది. ప్రమాదకర పరిస్థితులు ఉన్నచోట పోలీసు అధికారులు స్వయంగా పర్యవేక్షించి ఆయా ప్రాంతంలో ప్రయాణాలు నిషేధించారు. వర్షాల కారణంగా పొలాలు కాలువలను తలపించడమే కాకుండా చేతికి వచ్చిన పంట నీటిపాలైంది. కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసి ముద్దగా మారింది. దీంతో పెద్దఎత్తున పంట నష్టం వాటిల్లింది. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. వరద ప్రవాహం ఇంకా పెరిగే ప్రమాదం ఉన్నందున అటువైపు స్థానికులు వెళ్లకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి ట్రాక్టర్లను అడ్డుగా ఉంచాలని ఆదేశాలు జారీ అయ్యాయి.విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినందున పిల్లలను బయటకు వెళ్లకుండా తల్లితండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.

సరదాలు, విహార యాత్రల కోసం నీటి ప్రవాహం ఉన్న ప్రాంతాలకు వెళ్ల రాదని పేర్కొన్నారు. కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపే పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒడ్డుగూడెం వద్ద వాగు ఐదు అడుగులపైనే ప్రవహిస్తూ నీరు ఇళ్లలోకి చేరింది. కొత్తగూడెం నుంచి పెనుబల్లి రోడ్డు మార్గంలో ప్రమాదకరంగా ప్రవాహం ఉండడంతో రాకపోకలను నిలిపివేశారు. చుంచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని చింతల చెరువు వద్ద రెండు అడుగుల మేర నీరు రోడ్డుపైకి రావడంతో బారికేడ్లు ఏర్పాటు చేశారు. సుజాతనగర్ మండలం లక్ష్మీపురం గ్రామం వద్ద కాలువలు పొంగుతుండడంతో స్థానికులను అప్రమత్తం చేశారు. జూలూరుపాడు మండలం పడమటి నర్సాపురం నుంచి వెళ్లే బేతాల రోడ్డు కూడా బ్లాక్ చేశారు. అదే విధంగా చండ్రుగొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాల్య తండా నుంచి పోకలగూడెం వెళ్లే మార్గాన్ని మూసేశారు. పాల్వంచ కిన్నెరసానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతుండడంతో రెండు గేట్లు ఎత్తివేశారు. ఈ కారణంంగా రాజాపురం నుంచి యానం భైలు రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది. ములకలపల్లి మండలంలో తుఫాన్ కారణంగా చేతికొచ్చినవరి, వేరుసెనగ, మొక్కజొన్న, ఇతర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లటంతో మండల వ్యవసాయశాఖ అధికారిణి కరుణామయి, ఎఇఓలు రజనీకాంత్, రమేష్, సతీష్, రాహుల్‌లు బుధవారం రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం పంట నష్టపోయిన వివరాలను ఉన్నతాకారులకు తెలియజేస్తామని రైతులకు నష్టపరిహారం అందజేసేలా కృషి చేస్తామని తెలిపారు.

ములకలపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చాపరాలపల్లి నుంచి కుమ్మరిపాడు వెళ్లే బ్రిడ్జిపై నుంచి వరదనీరు అధికంగా ప్రవహిస్తున్నందున ప్రయాణాలు నిలిపి వేశారు. ఈ మండలంలోని ముత్యాలంపాటు బ్రిడ్జి నుంచి కూడా మూడు అడుగుల మేర నీరు ప్రవహించింది. అశ్వాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని గొందిగూడెం వెళ్లే దారిలో ఇసుక వాగు పొంగి పొర్లిన కారణంగా ప్రయాణాలకు అంతరాయం కలిగింది. అదే విధంగా ఖమ్మం జిల్లా బోనకల్ మండలంలో ఆరుగాలం కష్టపడి పండించిన పంటలు తుఫాను వర్షంతో నేలపాలయ్యాయి. చేలల్లో మిగిలిపోయిన పత్తి పూర్తిగా తడిసిపోయింది. దీంతో అన్ని రకాల పంటలు సాగుచేసిన ప్రతి రైతు తీవ్రంగా నష్టాలపాలయ్యాడు. వర్షంతోపాటు వీచిన తీవ్రమైన గాలులకు పంటలు నేలకొరిగిపోవటంతో అధిక మొత్తంలో నష్టం వాటిల్లిందని ఆళ్ళపాడుకు చెందిన రైతులు అల్లిక లక్ష్మీనారాయణ, మలాది లింగయ్య, షేక్ మస్తాన్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. పత్తి, మిర్చి, వరి పంటలు చేతికొచ్చే దశలో ఉన్నాయని భారీ వర్షంతో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని వారు తెలిపారు. దీంతో తాము కోలుకోలేని విధంగా ఆర్థికంగా నష్టపోయామని అన్నారు. పొలాలు కౌలుకు తీసుకొని సాగు చేశామని తుఫాను కారణంగా కురిసిన భారీ వర్షం తమను తీవ్ర ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టివేసిందని కన్నీటి పర్యంతమయ్యారు.

ప్రస్తుతం వరి పంట కోతకొచ్చిందని మరికొన్ని రోజులైతే ధాన్యం ఇంటికి వచ్చేదని తుఫాను కారణంగా కురిసిన వానతో పంట మొత్తం కింద పడిపోయిందని మస్తాన్ అనే కౌలు రైతు తెలిపాడు. ఏడు ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి సాగు చేశానని సోమవారం రాత్రి కురసిన భారీ వర్షానికి పత్తి మొత్తం తడిసిపోయిందని అల్లిక లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశాడు. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేట, గుండ్లపహాడ్, నందిగామ, రేలకుంట, రంగాపురం గ్రామంలో మిచౌంగ్ తుఫాన్ కారణంగా నేల కూలిన వరి, మిర్చి పంటలు బాగా దెబ్బతిన్నాయి. తుఫాను ధాటికి పంటనష్టపోయిన రైతులను నూతన ప్రభుత్వం ఆదుసుకోవాలని రైతులు కోరారు. నల్లగొండ జిల్లా చింతలపాలెం మండలంలో కూడా తుఫాన్ ధాటికి పంట పొలాలు తీవ్రంగా నష్టపోయాయి. పంట చేతికి వచ్చే సమయంలో వచ్చిన తుపాన్ వల్ల సుమారు 6 వేల ఎకరాలో మిర్చి, 4 వేల ఎకరాలో పత్తి మంటను తీవ్రంగా నష్టపరిచిందని రైతులు వాపోతున్నారు.

మిర్చి పంటకు వచ్చే బొబ్బ, వైరస్, తేగులు, పురుగు నుండి రక్షించడం కోసం ఇప్పటికే ఎకరాకు లక్షకు పైగా ఖర్చు అయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. అహర్నిశలు శ్రమించి పంటసాగు చేస్తున్న సరైన దిగుబడి రావడం లేదని దానికి తోడు తుపాన్ తీవ్రంగా నష్టపరిచిందని ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పంట నష్టం అంచన వేసి ఆదుకోవాలని రైతులు కోరుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News