Friday, January 24, 2025

పంట పెట్టుబడి సాయం తక్షణమే రైతులకు విడుదల చేయాలి: హరీష్

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట: పంట పెట్టుబడి సాయం రైతులకు తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయాలని బిఆర్ఎస్ ఎంఎల్ఎ హరీష్ రావు డిమాండ్ చేశారు. వానాకాలం వచ్చినా ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని మండిపడ్డారు. రైతులు ఆందోళన చేందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చురకలంటించారు. నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ ఫామ్ మొట్ట మొదటి క్రాఫ్ కటింగ్ కార్యక్రమంలో  మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్ మీడియాతో మాట్లాడారు. జూన్ 2021 లో నంగునూరు మండలం రామచంద్రపురం గ్రామంలో ఈ పంటను మొదటి సారి వేయడం జరిగిందని గుర్తు చేశారు. మూడేళ్ల క్రితం అయిల్ ఫామ్ సాగు ప్రారంభించామని, ఎల్లారెడ్డి పొలంలో మొదటి ఆయిల్ ఫామ్ మొక్క నాటామని, నాగేందర్ పొలంలో మొదటి పంట కోసుకుంటున్నామన్నారు.

ఆయిల్ ఫామ్ పంట అంటే చాల మంది రైతుల్లో అనుమానాలు ఉండేవని, ఖమ్మం సహా ఎపిలోని ప్రాంతాల్లో రైతులు ఎన్నో లాభాలు పొందుతున్నారని కొనియాడారు. మన రాష్ట్రంలో కూడా రైతులు లాభం పొందాలని ఇక్కడ ప్రారంభం చేశారని, ఆయిల్ ఫామ్ ప్రకృతి ప్రసాదించిన వరమని, రైతులు ఎదగడానికి దోహదపడుతుందని, ఇది చాలా సులువైన పంట కావడంతో స్థిరమైన ఆదాయం రావడంతో పాటు ఏడాది అంతా లాభమే వస్తుందన్నారు. కమ్మ కొట్టు, గెల కొట్టు, చెక్కు తెచ్చుకో అన్నట్టు ఉంటుందని, ఎకరాకు లక్షా 20 వేల ఆదాయం వరకు ఉంటుందని, ఆరుగాలం శ్రమించే రైతన్నకు లాభం చేయాలని కెసిఆర్  రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు కోసం ప్రోత్సాహం అందించారని హరీష్ రావు చెప్పారు.

పంట బోనస్ బోగస్ అయ్యిందని, విత్తనాల కొరత లేకుండా చూడటంలో ప్రభుత్వ దృష్టి సారించలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్న చూపు చూస్తున్నదని ధ్వజమెత్తారు. ఎరువులు కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని రకాల పంటలకు రూ. 500 బోనస్ ఇవ్వాల్సిందేనని హరీష్ రావు డిమాండ్ చేశారు. బోనస్ విషయంలో మంత్రులు తలో మాట మాట్లాడటం, దొడ్డు వడ్లకే బోనస్ అని చెప్పడం మాట తప్పడమేనని ధ్వజమెత్తారు.  అసెంబ్లీలో రైతుల పక్షాన బిఆర్ఎస్ పోరాటం చేస్తుందని, ఆయిల్ ఫామ్ దిగుమతిపై తొలగించిన సుంకాన్ని మళ్లీ విధించాలని, ఆయిల్ ఫామ్ రైతులకు ప్రోత్సాహం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కోరుతున్నామన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News