మనతెలంగాణ/హైదరాబాద్: వ్యవసాయరంగంలో పంట రుణాల మాఫీ ప్రక్రియ చివరిఘట్టానికి చేరువవుతోంది.బ్యాంకులు , వ్యవసాయ సహకార బ్యాంకుల ద్వారా పంటల పెట్టుబడికోసం రుణాలు పొందిన రైతులకు ఇప్పటివరకూ మూడు విడతలుగా రూ.2 లక్షల వరకూ రుణాలు మాఫీ చేసిన ప్రభుత్వం మరో అడుగేసింది.రెండు లక్షల రూపాయల పైన రుణం ఉన్న రైతులకు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించింది. రూ.2లక్షలకు పైన ఎంత రుణం ఉంటే అంత మొత్తన్ని రైతులు బ్యాంకు ఖాతాలకు చెల్లించాల్సివుంటుంది. ఆ తర్వాత రూ.2లక్షల వరకూ మొత్తాన్ని ప్రభుత్వం ఆ రైతు బ్యాంకు ఖాతాకు జమ చేస్తుంది. ఈ ప్రక్రియలో భాగంగా రూ.2లక్షలకు పైగా ఉన్న మొత్తాన్ని రైతులనుంచి జమ చేయించుకునేందుకు ప్రభుత్వం బ్యాంకర్లకు ఆదేశాలు జారీ చేసింది. మంగళవాంర నుంచి బ్యాంకర్లు ఈ ప్రక్రియను ప్రారంభించనున్నాయి.
రుణాలు మాఫీకాని రైతుల నుంచి వివరాల సేకరణ:
బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొంది రుణమాఫీ జాబితాలో పేర్లులేక రుణమాఫీని పొందలేకపోయిన రైతుల కోసం రేవంత్‌రెడ్డి సర్కారు మరింత ఉదాసీన వైఖరితో అడుగులు వేస్తోంది. వివిధ కారణాల వల్ల మాఫీకి అర్హత పొందలేకపోయిన రైతుల వివరాల నమోదుకు రైతుభరోసా పంట రుణమాఫీ యాప్ ను రాష్ట్ర వ్యవసాయశాఖ రూపొందించింది. ఈ యాప్‌ను ఆదివారం అన్ని జిల్లాల వ్యవసాయాధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణాధికారులకు పంపించింది. రుణమాఫీ వర్తించని వారి ఇళ్లకు వెళ్లి క్షేత్రస్థాయి సమాచారం తెలుసుకొని యాప్‌లో నమోదు చేయాలని మార్గదర్శకాలు జారీ చేసింది. నమోదు అనంతరం రైతుల నుంచి ధ్రువీకరణపత్రం తీసుకోవాలని, స్థానిక పంచాయతీ కార్యదర్శి సంతకం తీసుకోవాలని సూచించింది.
ముందుగా ప్రయోగాత్మకంగా కొందరి రైతుల వివరాలను నమోదు చేసి పరీక్షించాలని ఆదేశించింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసినా తమకు వర్తించలేదని రైతులు వ్యవసాయశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. వారి ఖాతాలను తనిఖీ చేసినప్పుడు రేషన్‌కార్డు లేదని, చాలా మందికి కుటుంబ నిర్ధారణ కావాల్సి ఉందనే కారణాలు తేలాయి. రుణమాఫీ వర్తించని వారి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇదివరకే ప్రకటించారు. దీనికి అనుగుణంగా కొత్త యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
రైతుల నుంచి సెల్ప్ అఫిడవిట్లు :
వ్యవసాయశాఖ అధికారులు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేసిన రైతుల ఇళ్లవద్దకు వెళ్లనున్నారు. ముందుగా వారి రుణఖాతాలు, ఆధార్‌కార్డులను తనిఖీ చేయనున్నారు. అనంతరం కుటుంబ సభ్యుల వివరాలు తీసుకొని యాప్‌లో అప్‌లోడ్ చేస్తారు. రుణాలున్న భార్యాభర్తలే గాక, 18 ఏళ్లు పైబడిన వారి కుటుంబ సభ్యుల ఫొటోలు తీసుకుంటారు. ఆ తర్వాత కుటుంబ యజమానితో సెల్ప్ అఫిడవిట్‌కింద ధ్రువీకరణపత్రం తీసుకుంటారు. అందులో యజమాని తన రుణఖాతా, బ్యాంకు బ్రాంచి వివరాలతోపాటు రుణమాఫీ కోసం కుటుంబ సభ్యుల వివరాలను ఇష్టపూర్వకంగా రాసి ఇస్తున్నట్లు పేర్కొంటూ సంతకంతోపాటు మొబైల్ నంబర్ రాయాలి. వీటిని ధ్రువీకరిస్తూ గ్రామ కార్యదర్శి సంతకం చేయాలని వ్యవసాయ శాఖ నిర్దేశించింది.