24న రాష్ట్ర సదస్సు
మన తెలంగాణ/హైదరాబాద్: మారుతున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా పంటల ప్రణాళిక రూపోందించాలని అఖిలభారత కిసాన్ సభ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ అరిబండి ఫౌండేషన్, తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 24న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మారుతున్న పరిస్థితుల్లో పంటల ప్రణాళిక అంశంపై రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర కార్యాలయంలో ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. సదస్సులో వ్యవసాయ విశ్వవిద్యాలయం విశ్రాంత ప్రొఫెసర్ డా.రాజిరెడ్డి, అరిబండి ఫౌండేషన్ ఛైర్మన్ డా.అరిబండి ప్రసాద్‌రావు, కార్యదర్శి డా.అరిబండి మనోహర్, నంద్యాల నర్సింహ్మారెడ్డి తదితరులు పాల్గొంటారన్నారు. రాష్ట్రంలో సమగ్ర వ్యవసాయ ప్రణాళికను రూపొందించాలని కోరారు. రాష్ట్రానికి అవసరమైన పంటలు ఏయే నేలల్లో ఏయే పంటలు సాగవుతాయో ప్రణాళిక రూపొందించాలని అన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన పండ్లు, కూరగాయలు ఇతర రాష్ట్రాలనుండి దిగుమతి చేసుకుంటున్నామని అన్నారు. భూసార పరీక్షలు నిర్వహించి వాటికి హెల్త్ కార్డులు ఇవ్వాలని కోరారు. రాష్ట్రానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. మార్కెట్‌కు అనుగుణంగా పంటలు సాగుచేసుకునే అవకాశం కల్పించాలని అన్నారు. కౌలురైతులు పోడు సాగుదారులు తమకు రావాల్సిన స్కీములను కోల్పోతున్నారని అన్నారు. రిజర్వు బ్యాంకు నిబంధనల ప్రకారం వ్యవసాయానికి రుణాలు అందించకపోవడంవల్ల రైతులు అధిక వడ్డీలకు ప్రయివేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గర రుణాలు తీసుకుంటున్నారని ఫలితంగా ఆత్మహత్యల పరంపరం కొనసాగుతున్నదని అన్నారు.
సమగ్రంగా చర్చించి ప్రణాళికను రూపొందించడం ద్వారా రాష్ట్ర స్థూల ఆదాయాన్ని పెంచే అవకాశం ఉందని అన్నారు. అత్యధిక మందికి ఉపాధిని చూపిస్తున్న వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరముందని అన్నారు. కార్పొరేట్ కంపెనీల జోక్యాన్ని నియంత్రించడం ద్వారా రైతాంగానికి అదనపు ఆదాయాన్ని సమకూర్చవచ్చని అన్నారు. రాష్ట్ర సదస్సులో వచ్చిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఒత్తిడి చేస్తామని మల్లారెడ్డి పేర్కొన్నారు.