Wednesday, January 22, 2025

పంట వ్యర్థాల దగ్ధాలు తగ్గవా!

- Advertisement -
- Advertisement -

ప్రపంచంలోని అత్యంత కాలుష్య ఐదు నగరాల్లో నాలుగు దక్షిణాసియా నగరాలే. అవి లాహోర్, ఢిల్లీ, ముంబై, ఢాకా. ఈ నగరాల పొలిమేరల్లోని పొలాల్లో ధాన్యాన్ని వేరు చేసిన తరువాత మిగిలిపోయిన గడ్డి వంటి వ్యర్థాలను తగులబెడుతుండడం వాయు కాలుష్యం మరింత తీవ్రం కావడానికి దోహదమవుతోంది. ఈ వ్యర్ధాల మంట నుంచి వచ్చే పొగమసి గాలి సాంద్రతలో 40% వరకు పేరుకుపోతున్నది. దీంతో గాలి వేగం తగ్గిపోతుంది. వర్షానికి కూడా ఆటంకం ఏర్పడుతుంది. సుదీర్ఘకాలం ఈ కాలుష్యాలు గాలిలో నిండి ఉండడంతో గాలి నాణ్యత క్షీణిస్తుందని శాస్త్రవేత్తలు అంచ నా వేస్తున్నారు. అయితే పంట వ్యర్థాల దహనాన్ని అరికట్టడానికి ప్రత్యామ్నాయ మార్గాలు వున్నాయని చెబుతున్నారు. ప్రభుత్వాలు కూడా ఈ మేరకు ఆలోచిస్తున్నాయి. పంట వ్యర్థాలను వేరు చేయడానికి హ్యాపీ సీడర్ అనే యంత్రాలను వినియోగించవచ్చు. ఇది పొలాల నుంచి వ్యర్థాలను వేరు చేస్తూనే తదుపరి పంట విత్తనాలను కూడా నాటుతుంది. ఆ వ్యర్థాలను పొలంలోనే నశింప చేస్తుంది. పంట వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారు చేయవచ్చు.

అలాగే ఈ వ్యర్థాల నుంచి వెలువడే మెథేన్‌ను పరిశ్రమలకు వాడుకోవచ్చు. అయితే ఈ మేరకు సాంకేతిక సౌకర్యాలు అవసరమవుతాయి. బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేసి పంట వ్యర్థాలను వాటికి ముడి పదార్ధంగా వాడవచ్చు. ఈ విధంగా వ్యర్థాలను విక్రయించడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుంది. రసాయన ఎరువుల కన్నా ఈ సేంద్రియ ఎరువులు అందుబాటులోకి వస్తాయి. పంట వ్యర్థాలు ప్రయోజనకరమైనవిగా మారాలంటే ప్రభుత్వ పరంగా తగిన ప్రణాళికలు అవసరమవుతాయి.పంట వ్యర్థాలను తగులబెట్టడం ఆపివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో పంట వ్యర్థాలను సేకరించి నిల్వ చేయడం సరైన పరిష్కారం. ఈ వ్యర్థాలను బయటకు తీయడం, రవాణా చేయడం రైతుకు శ్రమే. దీనికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సాయం అందించడం అవసరం. గత నవంబర్‌లో పంట వ్యర్థాల దహనాలు ఢిల్లీని ఎంత ఉక్కిరిబిక్కిరి చేశాయో మనకు తెలిసిందే. పంజాబ్, హర్యానా సహా ఉత్తరాది రాష్ట్రాల్లో పంట వ్యర్థాల దహనం నిరాఘాటంగా సాగుతోంది. ఒక్క పంజాబ్‌లోనే గత సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు 28 వేలకు పైగా పంట దహనాలు జరిగాయి. ఈ పంట దహనాల కాలుష్యంతో పాటు దీపావళి బాణసంచా కాల్పులతో ఢిల్లీతో సహా మొత్తం ఏడు నగరాల్లో కాలుష్యస్థాయి ఘనపు మీటర్‌కు 500 మైక్రోగ్రాముల స్థాయిని దాటేసింది.

వరి నుంచి ఇతర పంటల మార్పిడి
మిగతా పంటల కన్నా వరి గడ్డి వ్యర్థాలు భారీగా ఉండటం తో ఇతర పంటల సాగుకు రైతులు మళ్లడానికి ప్రోత్సాహకంగా హర్యానా ప్రభుత్వం ఎకరాకు రూ. 7000ను రైతులకు అందిస్తోంది. దీంతో పాటు వరిగడ్డి నిర్వహణకు అదనంగా ఎకరానికి మరో రూ. 1000 అందిస్తోంది. రానున్న రెండు మూడేళ్లలో వరి గడ్డి వ్యర్థాల దగ్ధాలను పూర్తిగా నివారిస్తామని హర్యానా ప్రభుత్వం వెల్లడించింది. ఇదిలా ఉండగా పంట వ్యర్థాల నివారణ, నిర్వహణ కోసం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ ఇంతవరకు రూ. 3333 కోట్లను పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు విడుదల చేసింది. ఈ మొత్తంలో పంజాబ్‌కు రూ. 1531 కోట్లు, హర్యానాకు రూ. 1006 కోట్లు కేటాయించింది.

అయితే పంట వ్యర్థాలను దగ్ధం చేసే ప్రక్రియ తక్కువ గానే జరిగింది. పంట వ్యర్థాలను దగ్ధంచేయడాన్ని నివారించడానికి పంజాబ్ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోంది. కోతల తరువాత పొలం లోనే పంట వ్యర్థాలు కుళ్లిపోయే వరకు నిల్వ చేస్తోంది. వ్యర్థాలను కంపోస్ట్ ద్వారా ఎరువులకు, వంటచెరకుగాను, పరిశ్రమలకు ముడి ఇంధనంగా వినియోగిస్తోంది. అయినాసరే ఉత్తరాది మొత్తం మీద ఈ సీజన్‌లో పంట వ్యర్థాల దహనాలు పంజాబ్‌లోనే ఎక్కువగా జరగడం గమనార్హం. మొత్తం 57,242 దగ్ధాల్లో 64% పంజాబ్‌లోనే జరిగాయి.

హర్యానాలో అంతకు ముందు రెండేళ్లతో పోలిస్తే గత ఏడాది 71,304 దగ్ధాలు జరగ్గా, ఈ ఏడాది వాటిలో 67% వరకు తగ్గుదల కనిపించింది. అయినప్పటికీ పంట వ్యర్థాల దహనాలను పూర్తిగా తగ్గించడం వచ్చే రెండేళ్లయినా సాధ్యం కాకపోవచ్చు. పంట వ్యర్థాలను మట్టిలో కలిపి ఉండలుగా చుట్టి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు ఇంధనంగా అందించడానికి పంజాబ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధంగా పంట వ్యర్థాల్లో 20% వరకు సద్వినియోగం చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. ఇథనాల్ ఉత్పత్తికి వరిగడ్డినే ఉపయోగించాలనుకుంటోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చి( ఐసిఎఆర్) అభివృద్ధి చేసిన పూసా 44 రకం వరి వంగడం దిగుబడి అధికంగా ఇస్తున్నా వ్యర్థాలు ఎక్కువగా ఉంటున్నాయన్న ఆలోచనతో వచ్చే సీజన్‌లో ఆ రకం వంగడాన్ని సాగు చేయకూడదని పంజాబ్ ప్రభుత్వం నిషేధించింది. ఈ రకం పంటను తదుపరి గోధుమ పంటను సాగు చేయడానికి ముందు అక్టోబర్‌లో కోత కోసం మాత్రమే జూన్ మధ్యలో నాటుతారు.

ఈ నేపథ్యంలో కన్‌ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ ఫౌండేషన్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని రైతులకు బహుముఖ వ్యూహ సాంకేతికతతో సహాయం అందిస్తోంది. పంట వ్యర్థాలను ఏ విధంగా నిర్వహించాలో సాంకేతికంగా చేసి చూపిస్తోంది. పంట గడ్డిని మట్టితో కలిపి ఉండలు చేయడం, పరిశ్రమలకు ఉపయోగపడేలా మార్చడం, తదితర ప్రక్రియలను రైతులకు నేర్పిస్తోంది. ఈ విధమైన ప్రక్రియలు ఫతేహాబాద్ జిల్లాలో అనుసరిస్తున్నారు. దీని వల్ల ఈ సీజన్‌లో పంట వ్యర్థాలను దగ్ధం చేయడం 25% తగ్గింది. 2017 నుంచి ఈ ఫౌండేషన్ ‘క్లీన్ ఎయిర్.. బెటర్ లైఫ్’ అనే లక్షంతో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని 432 గ్రామాల్లో 88,000 మంది రైతులకు సహకరిస్తోంది. దీని వల్ల ఈ ప్రాంతాల్లో పంట వ్యర్థాల దహనాల్లో 80% వరకు తగ్గుదల కనిపిస్తోంది. 2018 నుంచి ఈ ఫౌండేషన్ పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని సహకార సంస్థలకు 947 సూపర్ సీడర్ యంత్రాలను ఉచితంగా అందజేసింది. పంజాబ్ లోని కాందహార్‌గఢ్ గ్రామాన్ని పరిశీలించగా దాదాపు 200 మంది వృద్ధ రైతులు గోధుమ విత్తడానికి ముందే వరి ధాన్యం గడ్డిని నిర్వహించడం కనిపించింది. దీని వల్ల 2017లో రెడ్ జోన్‌లో వున్న ఆ గ్రామం ఇప్పుడు గ్రీన్ జోన్‌గా మారింది.

అంటే 2017లో అత్యంత భారీ స్థాయిలో పంట వ్యర్థాల దహనం గ్రామంగా చెప్పుకునే ఈ గ్రామం ఇప్పుడు ఎలాంటి వ్యర్థాల దహనాలు లేని గ్రామంగా గుర్తింపుకు నోచుకుంది. చాలా మంది రైతులు సూపర్ సీడర్ మెషిన్లను ఉపయోగిస్తున్నారు. రూ. 23,000 వరకు ధర పలికే ఈ మెషిన్‌ను అద్దె కింద తెచ్చుకుని వినియోగించదలచుకుంటే గంటకు రూ. 150 నామమాత్రపు ధర చెల్లించవలసి వస్తుంది. ఖాందహార్‌గఢ్ కో ఆపరేటివ్ సొసైటీ నుంచి ఈ మెషిన్‌ను అద్దెకు తెచ్చుకుని వాడుతున్నారు. అధిక దిగుబడి పంట కోతలకు, సుదీర్ఘ కాల వరి రకం పూసా 44 పంట కోతకు దీనిని వినియోగిస్తున్నారు. వరిగడ్డిని మట్టితో కలిపి ఉండలు చేయడం వల్ల నేలసారం పెరిగి రసాయన ఎరువుల వినియోగం తగ్గిందని రైతులు చెబుతున్నారు.

గడ్డిని దగ్ధం చేస్తే నేల సారం క్షీణిస్తుందని క్రమంగా రైతులు తెలుసుకుంటున్నారు. అయితే గడ్డిని దగ్ధం చేయడంలో సంగూర్ జిల్లా ఓ హాట్ స్పాట్‌గా మిగిలింది. ఈ సీజన్‌లో 5600 గడ్డి దహనాలు జరిగాయి. హర్యానాలోని ఫతేహాబాద్ జిల్లా ధోలు గ్రామం రైతు రాజేష్ కుమార్ ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశించి పూసా 44 రకం వరి సాగు చేశాడు. కో ఆపరేటివ్ సొసైటీ సరఫరా చేసిన సూపర్ సీడర్ మెషిన్‌తో గడ్డి బేళ్లు తయారు చేశాడు. ఈ బేళ్లు త్వరలో బయోమాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్ శ్రీజ్యోతి రెన్యుబుల్ ఎనర్జీకి సరఫరా చేయడానికి సిద్ధమయ్యాడు.

క్వింటాల్ రూ.185 వంతున వారికి విక్రయిస్తాడు. పంజాబ్, హర్యానాలోని రైతులు పూసా 44 వరి రకాన్ని దాదాపు రెండు దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. ఈ రకం వరి 27 నుంచి 28 క్వింటాళ్ల వరకు దిగుబడి ఇస్తుందని, ఇతర రకాలు దీని కన్నా 20% తక్కువ దిగుబడి ఇస్తాయని రైతులు చెప్పారు. అయితే ఈ రకం సాగుకు 160 రోజులు పట్టగా, మిగతా రకాలు 35 రోజుల్లో దిగుబడినిస్తాయి. పూసా 44 రకం ఎకరాకు 40 క్వింటాళ్ల గడ్డిని ఉత్పత్తి చేస్తుంది. అందువల్ల గోధుమను సాగు చేసే ముందు ఈ గడ్డిని నిర్వహించడం ఒక సవాలుగా మారిందని రైతులు చెబుతున్నారు.

కె. యాదగిరి రెడ్డి
9866789511

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News