నేలకొరిగిన పంటలు
పిడుగుపాటుకు ఇద్దరు మృతి
సంగారెడ్డి జిల్లాలో ఒకరు,
నల్లగొండ జిల్లాలో మరొకరి
దుర్మరణం మూడు రోజుల
పాటు వర్ష సూచన
అప్రమత్తంగా ఉండాలి
అధికారులకు సిఎం ఆదేశం
మన తెలంగాణ / హైదరాబాద్ : అకాల వర్షాలు రాష్ట్రంలోని పలు జి ల్లాల్లో జనజీవనం స్తంబించింది. పెద్ద ఎత్తున పంట నష్టం చోటుచేసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో కోతకు వచ్చిన పంట నేలకొరిగింది. అకాల వర్షానికి సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణం లో పిడుగుపాటుకు ఒక కాలేజీ విద్యా ర్ధి మరణించారు. జిల్లాలోని కొండాపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన సంపత్ కుమార్ తన స్నేహితులతో కలిసి కాలేజి నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం వస్తుండడంతో రోడ్డు పక్కన ఉన్న చెట్టుకింద నిలుచున్నారు. అదే సమయంలో పిడుగుపడి సంపత్ కుమార్ అక్కడిక్కడే మృత్యువాత పడగా, మిగతా విద్యార్ధులు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం అమలురు గ్రామంలో గ్రొరెల కాపరి మేకల చిన్న రాములు పిడుగుపాటుకు గురై మరణించారు. తనకు ఉన్న 70 గ్రొర్రెలను మేపుకుంటుండగా అకాల వర్షం చోటుచేసుకోవడంతో చెట్టు కింద తలదాచుకునేందుకు వెళ్లాడు, ఈ క్రమంలో అకస్మాత్తుగా పిడుగుపడి రాములు అక్కడికక్కడే మృతిచెందారు.
పదికిలోల రాళ్ల వర్షం
గురువారం సిద్దిపేట జిల్లాలో కురిసిన వర్షాలకు తీవ్రంగా పంటనష్టం వాటిల్లింది. జిల్లాలోని మైసంపల్లి గ్రామంలో వడగళ్లతో వర్షంతో పాటు పది కిలోల బరువుగల రాళ్లవర్షం కురియడంతో గ్రామస్థులను భయబ్రాంతులకు గురయ్యారు.
మరో రెండు రోజులు వర్షం
ఇదిలా ఉండగా, బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనంతో వచ్చే రెండు రోజులపాటు తేలికపాటు నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులు ఈదురు గాలులు, గాలి వేగం గంటకు 30- నుంచి 40 కిలోమీటర్ల మేరకు ఉండే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని హైదరాబాద్ జంటనగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చెల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేట, మహబూబ్‌నగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
నగరంలో వాన ఇబ్బందులు
హైదరాబాద్‌లో ఈదురుగాలులతో వర్షం కురియడంతో జంటనగరాల ప్రజలు, వాహనదారులు – ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. హైదరాబాద్‌లో – చాలా ప్రాంతాల్లో ఈదురుగాలులతో వర్షాలకు పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. అనూహ్యంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. మియాపూర్, మదీనాగూడ, చందానగర్, లింగంపల్లి, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, కూకట్‌పల్లి, మేడ్చల్, దుండిగల్ తదితర ప్రాంతాల్లో రాత్రి వరకు వర్షం పడింది. భారీ గాలులకు కోఠి, సుల్తాన్ బజార్, అబిడ్స్, నాంపల్లి ప్రాంతాల్లో వర్షం పడడానికి ముందు ఉరుములు, మెరుపులతో ఈదురుగాలి ప్రారంభయింది. వేగంగా వీస్తున్న గాలులతో అటుగా వెళ్లే వాహనదారులు, బాటసారులు ఇబ్బందులు పడ్డారు. జూబ్లీహిల్స్, బంజారాజల్స్, ఫిల్మ్ నగర్ ప్రాంతంలో ఈదురు గాలులతో వర్షం కురిసింది. అకస్మాత్తుగా పడుతున్న వర్షంతో వాహనదారులు, పాదచారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
అప్రమత్తంగా ఉండండి ః సిఎం రేవంత్ రెడ్డి
రాజధాని నగరం హైదరాబాద్ జంటనగరాలతో పాటు పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు వర్షాలు వివిధ జిల్లాల్లో కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ సూచనలను పరిగణనలోకి తీసుకుని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు.