Thursday, January 23, 2025

అకాల ‘పిడుగు’

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : అకాల వర్షాలు వడగండ్ల వానాలు యాసంగి పంటలపై రైతులు పెట్టుకున్న ఆశలను ఆవిరి చేస్తున్నాయి. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు రాష్ట్రంలో సాగుచేసిన వివిధ రకాల పంటలను భారీగా దెబ్బతీశాయి. మరో రెండు వారాల్లో చేతికందాల్సిన వరి, మొక్కజొన్న పైర్లు బలమైన ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాల ప్రభావంతో నేల వాలాయి. చెట్ల నిండుగా కాయలతో బరువెక్కిన వందలాది ఎకరాల్లోని మామిడి తోటలు ధ్వంసమయ్యాయి. వడగండ్ల వర్షం ధాటికి చెట్లపై ఉన్న మామిడి కాయలు పిందెలతో సహా జలజల నేల రాలాయి. ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన ఈ వర్షాలు ఉద్యాన తోటల రైతు కంట తడిపెట్టిస్తున్నాయి. ఉల్లి, టమాటా, అరటి, క్యాబేజి, పుచ్చ తదితర పైర్లు భారీవర్షాలకు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాలమేరకు వివిధ శాఖలకు చెందిన మంత్రులు జిల్లాల్లో అకాల వర్శాల వల్ల దెబ్బుతిన పంటలను పరిశీలించేందుకు క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తూ పంటలు నష్టపోయిన రైతులను ఓదారుస్తూ , కష్టాల్లో ఉన్న వారిని ప్రభుత్వం ఆదుకుని అండగా నిలుస్తుందని ధైర్యం చెబుతున్నారు.

రాష్ట్ర పురపాలక ఐటి శాఖ మంత్రి కె.టి రామారావు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పంట నష్టాలపై ఆ జిల్లా అధికార యంత్రాంగంతో సమీక్షించారు. జరిగిన పంట నష్టాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతికి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా పంట నష్టాలను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించి పంటలు నష్టపోయిన రైతులను ఒదార్చారు. మంత్రి ఎర్లబెల్లి దయాకర్ రావు మహబూబాబాద్ జిల్లాలో పర్యటించారు. పలు గ్రామాల్లో వర్షాలు వడగండ్ల వానలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. పంటనష్టాలపై నివేదికలు అందగానే ప్రభుత్వం తగిన సాయం అందిస్తుందని రైతులకు ధైర్యం చెప్పారు. ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించారు.మిగిలిన మరికొన్ని జిల్లాల్లో కూడా ఆయా జిల్లాల మంత్రులు క్షేత్ర స్థాయి పర్యటనలతో పంటపొలను పరిశీలించి రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ధైర్యం చెబుతున్నారు.

లక్ష ఎకరాల్లో పంటనష్టం 

గత మూడు రోజులుగా రాష్ట్ర మంతటా విస్తారంగా కురుస్తున్న భారీ వర్షాలు వడగండ్ల వానలతో వరి, మొక్కజొన్న, జొన్న , పెసర, వేరుశనగ, మామిడి, టమాటా , ఉల్లి, మిరప , పుచ్చ , క్యాబేజి , అరటి బొప్పాయి తదితర పైర్లు దెబ్బతిన్నాయి. వ్యవసాయశాఖ జిల్లాల వారీగా పంటనష్టాలపై నివేదికలు రూపొందింస్తోంది. క్లష్టర్లవారీగా క్షేత్ర స్థాయి అధికారులతో ఎన్యూమరేషన్ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటివరకూ ఆయా జిల్లాల నుంచి అందిన ప్రాధమిక నివేదికలను బట్టి అన్ని రకాల పంటలు కలిపి సుమారు లక్ష ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. అధికంగా వరిపైర్లుకే నష్టం వాటిల్లింది. 70వేల ఎకరాల్లో పైర్లు దెబ్బతిన్నాయి. అయితే వరి , మొక్కజొన్న పైర్లు నేలవాలినప్పటికీ వర్షాలు తగ్గగానే తిరిగి కోలుకుని యధాస్థితికి చేరుకునే అవకాశం ఉందని , అందువల్ల దెబ్బతిన్న పైర్లతో నష్టం ఎంత అన్నది ఇప్పటికిప్పడు అంచాన వేయలేమని వ్యవసాయశాఖ అధికారులు తెలిపారు.

మామిడి రైతుకు అపారనష్టం :

రాష్ట్రంలోని మామిడి రైతుకు అపార నష్టం వాటిల్లింది. ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం , మహబూబ్ నగర్ , రంగారెడ్డి , మెదక్ తదితర జిల్లాల్లో వడగండ్ల వాన ధాటికి కాపుమీద ఉన్న మామిడి కాయలు నేలరాలాయి. పిందెలు కూడా రాలిపోయాయి. దీంతో మామిడి రైతులపైన కోలుకోలేనంతగా దెబ్బపడింది. సంగారెడ్డి జిల్లా పరిధిలొని 62గ్రామాల్లో వివిధ రకాల పంటలు దెబ్బతిన్నాయి. జొన్న, మొక్కజొన్నతోపాటు ఉద్యాన పంటలకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. వికారాబాద్ జిల్లాలో వికారాబాద్ , తాండూర్ , కోట్ పల్లి ,మర్పల్లి, మొమిన్‌పేట తదితన మండలాల్లో అకాల వర్షాలకు అన్ని రకాల పైర్లు దెబ్బతిన్నాయి. వడగండ్ల వానప్రభావంతో దెబ్బతిన్న పంటలకు సంబంధించిన సమాచారాన్ని పంటల వారీగా , రైతుల వారీగా సేకరిస్తున్నారు.ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట , గద్వాల బల్మూర్ , వనపర్తి మండలాల్లో మామిడి తోటలకు నష్టవ వాటిల్లింది. బాలానగర్ మండలంలో అత్యధికంగా మామిడి తోటల్లోనే కాయలు నేలరాలిపోయాయి. మిగిలిన జిల్లాల్లో కూడా పంట నష్టాలపై క్షేత్ర స్థాయిలో తనిఖీలతో అంచనాలు సిద్దం చేస్తున్నారు. వర్షాలు పూర్తిగా ఆగిపోయి వాతావరణం తెలిక పడితే పంటనష్టాలపైన స్పష్టత వస్తుందని, ఇందుకోసం మరికొంత సమయం పడుతుందని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News