హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 8వ తేదీ నుంచి 22వ తేదీ వరకు స్వాతంత్ర భారత వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కోరారు.బిఆర్‌కెఆర్‌భవన్‌లో స్వాతంత్రోద్యమ వజ్రోత్సవాల నిర్వహణపై శనివారం ఉన్నతాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు నిర్వహించే ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని కోరారు. వజ్రోత్సవ ఉత్సవాలపై ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ ఇప్పటికే రోజువారీ కార్యక్రమాలను రూపొందించిందని ప్రధాన కార్యదర్శి పేర్కొన్నారు. ఆగస్టు 8వ తేదీన జరిగే ప్రారంభోత్సవ సభ మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారని అన్నారు.
దేశ సమైక్యతా, దేశ భక్తి ని పెంపొందించే ప్రత్యేక కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమాలలో అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఇంటింటికీ పంపిణీ చేసేందుకు ఇప్పటికే కోటి జెండాలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అన్ని గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లో జెండాలు పంపిణీ చేసేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంగా అన్ని సినిమా థియేటర్లలో పాఠశాల విద్యార్థులకు జాతీయ సమైక్యత, దేశభక్తిని పెంపొందించే చలన చిత్రాలను ఉచితంగా ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. సమావేశంలో సిఎం ఓఎస్‌డి దేశపతి శ్రీనివాస్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి అర్వింద్‌కుమార్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్ , జిఎడి. పొలిటికల్ కార్యదర్శి శేషాద్రి, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్‌సుల్తానియా, సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ బి.రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్ పాల్గొన్నారు.