హైదరాబాద్ : వేసవి తాపాన్ని తట్టుకోలేక కేవలం 17 రోజుల వ్యవధిలో ఏకంగా కోటి బీర్లను తాగేశారు. గడిచిన కొద్దిరోజులుగా తెలంగాణలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. రాజధాని హైదరాబాద్‌లో సైతం ఉదయం 9 గంటలకే భానుడు తన ప్రకోపాన్ని ప్రదర్శిస్తున్నాడు. దరిమిలా రికార్డు స్థాయిలో బీర్లు అమ్ముడవుతున్నాయి. ఏప్రిల్ 17 వరకు ఒక్క హైదరాబాద్‌లోనే 1.01 కోట్ల బీర్లు అమ్ముడు పోయినట్లు అబ్కారీ శాఖ లెక్కలే చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని మూడు జిల్లాలో కలిపి 8,46,175 బీర్ల కేసులు అమ్ముడయ్యాయి. సగటున రోజుకు 6 లక్షల బీర్లు అమ్ముడుపోయాయని ప్రభుత్వ లెక్కలు విశదీకరిస్తున్నాయి.
ఏప్రిల్‌లో 17వ తేదీ వరకు హైదరాబాద్‌లో 1,94,351 కేసుల బీర్లు, రంగారెడ్డలో 5,59,746, మేడ్చల్ జిల్లాలో 92,078 కేస్‌ల బీర్లు అమ్ముడయ్యాయి. దీంతో డిమాండ్‌కు తగ్గట్టుగా ప్రభుత్వం కూడా మద్యం దుకాణాలకు నిత్యం బీరు సరఫరా చేస్తోంది. వచ్చే రెండు నెలల్లో బీర్ల విక్రయాలు రికార్డులు సృష్టించే అవకాశం వుందని చెబుతున్నారు. హైదరాబాద్‌లో భానుడి భగభగలు రోజురోజుకు తీవ్రస్థాయికి చేరుతున్నాయి. తత్ఫలితంగా విస్కీ, బ్రాందీ అలవాటున్న వ్యక్తులు సైతం ఉక్కపోత, ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు బీర్లను తాగేస్తున్నారు. అయితే వేడి, తేమతో కలిపినప్పుడు ప్రమాదకరంగా లేదా ప్రాణాంతకంగా వాతావరణం మారుతుందని వాతావరణ నివేదికలు చెబుతున్నాయి.
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికం : ఐఎండి నివేదికలు స్పష్టం
మరోవైపు దేశంలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత అధికమవుతోందని ఐఎండి నివేదికలు స్పష్టపరుస్తున్నాయి. వడదెబ్బ బారిన పడటంతో పాటు మరణాలు సంభవించే అవకాశాలను ప్రస్తావిస్తూ ఐఎండి హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో చల్లదనం కోసం ప్రజలు తమ ఎయిర్ కండిషనర్లు సహా ఇతర పరికరాలను వాడటంతో విద్యుత్ వినియోగం పెరిగి గ్రిడ్ పరిమితులు దాటి పలు ప్రాంతాల్లో విద్యుత్తుకు అంతరాయమేర్పడుతోంది. ఈ వారం ప్రారంభం నుంచి దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగడంతో పాటు వడగాలుల తీవ్రత సైతం పెరుగు తోంది. కోట్లాది మంది ప్రజలు వేడి అలసట లేదా ప్రాణాంతక వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంది.
అప్రమత్తతే శ్రీరామరక్ష
అప్రమత్తంగా ఉండటమే శ్రీరామరక్ష అని అధికారులు పేర్కొంటున్నారు. ప్రజలు హైడ్రేటెడ్ గా ఉంటూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. వేడికి గురికాకుండా ఉండాలని, తేలికపాటి, వదులుగా, కాటన్ దుస్తులు ధరించాలని, ఎండ్ల నుంచి తలలను కవర్ చేసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది. నీరు అధికంగా తీసుకోవాలనీ, వడదెబ్బ బారినపడకుండా జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగాలు చెబుతున్నాయి.