Wednesday, January 22, 2025

హిమాచల్‌లో కాంగ్రెస్‌కు షాక్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: రాజ్యసభ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ రాజకీయ పార్టీలకు బలమైన షాక్ ఇచ్చింది. హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌లోని 15 రాజ్యసభ స్థానాలకు మంగళవారం పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా పలు పార్టీలపై క్రాస్ ఓటింగ్ ప్రభావం చూపించింది. హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌లలో బిజెపికి అనుకూలంగా ప్రత్యర్థులు ఓటు వేయగా, కర్నాటకలో మాత్రం బిజెపికి ఎదురుదెబ్బ తగిలింది. ఉత్తరప్రదేశ్‌లో 10 రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా బిజెపి 8 మంది అభ్యర్థులను బరిలోకి దింపింది. సమాజ్‌వాది పార్టీ ముగ్గురు అభ్యర్థులను నిలబెట్టింది. అయితే ఏడుగురు ఎస్‌పి సభ్యులతో పాటుగా, బిఎస్‌పికి చెందిన ఒక ఎంఎల్‌ఎ బిజెపికి అనుకూలంగా ఓటు వేయడంతో ఆ పార్టీ పోటీ చేసిన ఎనిమిది స్థానాలను దక్కించుకుంది. కాగా సమాజ్‌వాది పార్టీకి రెండు సీట్లు దక్కాయి. కాగా హిమాచల్‌ప్రదేశ్‌లో అత్యంత నాటకీయ పరిణామాల మధ్య బిజెపి అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి విజయం సాధించారు.

హిమాచల్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ అక్కడ బిజెపికి అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగింది.68 సభ్యులున్న అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 40 మంది సభ్యులున్నారు. వీరు కాక ముగ్గురు ఇండిపెండెంట్లు కూడా ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు.ఈ లెక్కన కాంగ్రెస్ అభ్యర్థి అభిషేక్ మనుసింఘ్వి సునాయాసంగా విజయం సాధించాలి. బిజెపికి 25 మంది సభ్యులు మాత్రమే ఉన్నప్పటికీ ఆ పార్టీ హర్ష్ మహాజన్‌ను బరిలోకి దింపింది. ఆరుగురు కాంగ్రెస్ సభ్యులతో పాటుగా ముగ్గురు స్వతంత్రులు బిజెపికి అనుకూలంగా ఓటు వేశారు. దీంతో ఇద్దరికీ చెరి 34 ఓట్లు వచ్చాయి. దీంతో ఫలితం టై కావడంతో టాస్ వేయగా మహాజన్ విజయం సాధించగా, సింఘ్వికి నిరాశ ఎదురయింది. అయితే తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్‌ఎలను బిజెపి కిడ్నాప్ చేసిందని ముఖ్యమంత్రి సుఖ్విదర్ సింగ్ సుక్కు ఆరోపించారు. కాగా రాజ్యసభ ఫలితాల నేపథ్యంలో సుక్కు ప్రభుత్వంపై అవిశ్వాసానికి బిజెపి సన్నాహాలు చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కర్నాటకలో బిజెపికి ఎదురుదెబ్బ
కర్నాటకలో జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బిజెపి జెడి(ఎస్) కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. బిజెపికి చెందిన ఎంఎల్‌ఎ ఎస్‌టి సోమశేఖర్ కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌కు ఓటేసినట్లు తెలుస్తోంది. మరో బిజెపి ఎంఎల్‌ఎ శివరామ్ హెబ్బార్ ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. దీంతో కాంగ్రెస్ అభ్యర్థులు అజయ్ మాకెన్, డాక్టర్ సయ్యద్ నసీర్ హుస్సేన్, జిసి చంద్రశేఖర్‌లు విజయం సాధించగా, బిజెపి అభ్యర్థి నారాయణ్ బందగే ఆ పార్టీ పోటీ చేసిన ఏకైక స్థానంనుంచి గెలుపొందారు. కర్నాటకలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఐదుగురు అభ్యర్థులు పోటీ పడ్డారు. జెడి(ఎస్) తరఫున పోటీ చేసిన డి. కుపేంద్ర రెడ్డి ఓడిపోయారు. బిజెపి రెబెల్ ఎంఎల్‌ఎలు ఇద్దరూ గత కొంతకాలంగా కాంగ్రెస్‌తో సన్నిహితంగా ఉంటున్నారు. క్రాస్ ఓటింగ్ నేపథ్యంలో వారిపై చర్య తీసుకునే అంశంపై స్పీకర్‌తో మాట్లాడుతానని ప్రతిపక్ష నేత ఆర్ అశోక పేర్కొన్నారు. కాగా ఓటింగ్ అనంతరం విలేఖర్లతో మాట్లాడిన సోమశేఖర్ రెడ్డి తాను మనస్సాక్షి ఆధారంగా ఓటు వేసినట్లు చెప్పడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News