Thursday, February 20, 2025

పనామా అడవుల్లో పాములు, మొసళ్లు దాటుకుంటూ బయటపడ్డాం

- Advertisement -
- Advertisement -

చండీగఢ్ : అమెరికా నుంచి అక్రమ వలసదారులను వెనక్కు పంపడంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏమాత్రం వెనుకాడడం లేదు. ప్రత్యేక విమానాల్లో వారిని తిప్పి పంపిస్తున్నారు. ఫిబ్రవరి 5న అమెరికా నుంచి మొదటి విమానంలో 104 మంది భారత్‌కు చేరుకోగా, శనివారం నాడు రెండో బ్యాచ్‌లో 116 మంది వచ్చారు., ఆదివారం రాత్రి మూడో బ్యాచ్‌లో 112 మంది అమెరికా నుంచి అమృత్‌సర్‌కు చేరుకున్నారు. అలాంటివారిలో ఒకరైన పంజాబ్ వాసీ 38 ఏళ్ల మణ్‌దీప్ తాను అక్రమ మార్గమైన డంకీరూట్‌లో ఎన్నికష్టాలు ఎదుర్కొని ప్రాణాలకు తెగించి ఎలా అమెరికాకు చేరుకుని అరెస్ట్ అయినదీ తన బాధలన్నీ వివరించాడు.

చట్టపరంగా తనను అమెరికాకు తీసుకెళ్తానని ఏజెంట్ నమ్మించి రూ. 40 లక్షలు వసూలు చేశాడని, చివరకు తనను ప్రమాదకరమైన డంకీ రూటులో తీసుకెళ్లాడని వివరించాడు. అత్యంత ప్రమాదకరమైన ఈ డంకీ రూటులో ప్రయాణానికి సంబంధించి అనేక వీడియోలు పాత్రికేయులకు చూపించాడు. తన ట్రావెల్ ఏజెంట్, సబ్ ఏజెంట్లు తనను నరక కూపం లోకి నెట్టివేశారని వాపోయాడు. పాములు, మొసళ్లను దాటుకుని తాను చేసిన ప్రయణాన్ని తలచుకుని ఉద్వేగానికి లోనయ్యాడు. మన్‌దీప్ లానే పంజాబ్‌కు చెందిన మిగతా బందీలు కూడా తమ కష్టాలను వివరించారు.

మొదట అమృత్‌సర్ నుంచి విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు. అక్కడ నుంచి ముంబై , నైరోబీ, అమ్‌స్టర్‌డామ్ మీదుగా సురినామ్ చేరకున్నామని వివరించాడు. అక్కడ నుంచి ఓ చిన్న ఇరుకైన వాహనంలో తనలాంటి మరికొంతమందిని ఎక్కించి గయానాకు తీసుకెళ్లారని చెప్పాడు. ఆ మార్గంలో రోజుల తరబడి ఆహారం లేకుండా , పనామా అడవుల్లో కాలువల్లో ప్రమాదకర పాములు, మొసళ్లను దాటుకుంటూ తమ ప్రయాణం సాగిందని పేర్కొన్నాడు. ఇదంతా ఏమిటి ? అని ప్రశ్నిస్తే చంపేస్తామని ఏజెంట్ బెదిరించారన్నాడు. అలా రోజుకు 12 గంటలు నడుస్తూనే ఉండేవాళ్ల మని తెలిపాడు. కెన్యా, నెదర్లాండ్, గయానా, సురినామ్ , కొలంబియా, పనామా, నికరగ్వా, దేశాల మీదుగా అమెరికా చేరుకున్నట్టు తెలిపాడు.

ఇలా ఎన్నో కష్టాలను దాటుకుని ఈ ఏడాది జనవరి 27న మెక్సికో లోని టిజువానాకు చేరుకొన్నామన్నాడు. అక్కడ నుంచి అమెరికా లోకి వెళ్లడానికి ప్రయత్నిస్తుండగా, బోర్డర్ పెట్రోల్ అధికారులు తనను అరెస్టు చేశారని చెప్పాడు. అనంతరం విమానంలో తిప్పి పంపినట్టు చెప్పాడు. దీంతో అగ్రరాజ్యంలో స్థిరపడి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని తాను కన్న కలలు పేకమేడలా కూలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశాడు. “ పనామా అడవుల్లోంచి ప్రయాణించడం అత్యంత ప్రమాదకరమని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన లవ్‌ప్రీత్ సింగ్ తన అనుభవాన్ని పేర్కొన్నాడు. పాములు, మొసళ్లు, ఇతర జంతవుల నుంచి ఎలాగోలా తమను తాము రక్షించుకుంటూ బతికి బయటపడ్డామని వాపోయాడు.

ఒక్కోసారి ఏజెంట్లు తమను కొట్టేవారని, కనీసం దైనందిన కృత్యాలు తీర్చుకోడానికి కూడా పంపేవారు కాదని చెప్పాడు. అమృత్‌సర్ జిల్లాకు చెందిన జస్నూర్ సింగ్ కుటుంబం కూడా జస్నూర్‌ను అమెరికాకు పంపించడానికి రూ. 55 లక్షలు ఖర్చు చేసినట్టు చెప్పారు. ఆస్తులు, వాణిజ్యవాహనాలు, ఒక ప్లాట్ కూడా అమ్మి ఆ డబ్బు చెల్లించామన్నారు. కపుర్తలా జిల్లాకు చెందిన 20 ఏళ్ల నిషాన్ సింగ్ కన్నీటి గాథ కూడా ఇలాంటిదే. “తాము ఏజెంట్ల మనుషులచే దెబ్బలు తినడమే కాదు, సరైన తిండి కూడా ఇచ్చేవారు కాదు.పనామా అడవుల్లో 16 రోజులు బిక్కుబిక్కుమంటూ పూర్తిగా నీళ్ల లోనే గడిపాం. తమ మొబైల్ ఫోన్లు, ఇతర వస్తువులు లాక్కున్నారు. ” అని వాపోయాడు. నిషాన్ సింగ్ రూ. 40 లక్షలు ఏజెంట్‌కు చెల్లించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News